
సీఎం ప్రసంగిస్తుండగా జనాలు రాక ఖాళీగా ఉన్న కుర్చీలు
చంద్రబాబు సభ అంటేనే ఆలస్యం.. తరలించిన జనాలకు రెండు మూడు గంటల నిరీక్షణ తప్పదు. అలాంటి చంద్రబాబుకు ఈసారి జనాలే రిటార్డ్ ఇచ్చారు. ఆదివారం విశాఖ నగరంలో ప్రచార సభ ఆయన ప్రచార సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. నడినెత్తిమీద సూర్యుడు నాట్యం చేసే వేళ సభ పెట్టడం.. చంద్రబాబు ఆలస్యం గురించి తెలిసిన టీడీపీ జనాలు సమయమైనా ప్రాంగణంలోకి అడుగుపెట్టలేదు. 20 నిమిషాలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్న బాబు.. జనం లేకపోవడాన్ని గమనించి నేతలపై చిర్రుబుర్రులాడారు. దాంతో వారంతా ఉరుకులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. అయినా జనం హాజరు పలుచగానే కనిపించింది. ఇక షరా మామూలుగానే బాబుగారి ప్రసంగం షరా మామూలుగానే సొంత డబ్బాలో పాత మాటలతో.. సుదీర్ఘంగా సాగి సుత్తి కొట్టించడంతో వచ్చిన కొద్దిపాటి జనాలు అసహనానికి గురయ్యారు.
విశాఖ సిటీ/జగదాంబ: ఐదేళ్లుగా అదే పాట.. పాడిన పాటే.. మళ్లీ పాడుతూ.. ప్రజలు, కార్యకర్తలు, నేతల సహనాన్ని పరీక్షిస్తున్న చంద్రబాబు.. ఎన్నికల ప్రచారంలోనూ పాత పల్లవే అందుకున్నారు. ‘60 సంవత్సరాలుగా హైదరాబాద్‌ని అభివృద్ధి చేశాను. ఆస్తులన్నీ అక్కడే ఉండిపోయాయి.. మనకు ఇవ్వకుండా బయటకు పంపించేశారు. అమరావతిని అభివృద్ధి చేస్తున్నాను. కంప్యూటర్‌ని పరిచయం చేసింది నేనే.. నేను అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలొస్తాయి’ఐదు సంవత్సరాలుగా వింటున్న ఈ మాటలే ఎన్నికల ప్రచార సభలోనూ చంద్రబాబు నోటి నుంచి జాలువారాయి.
విశాఖలో టీడీపీ ఎన్నికల సమర భేరి మోగించిన నేపథ్యంలో మర్రిపాలెం సమీపంలోని శారదాబేకరీ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయనగరం నుంచి విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు.. ఇంకా సభా ప్రాంగణానికి జనాలు రాలేదని తెలియడంతో.. 15 నిమిషాల పాటు అక్కడే ఉండిపోయారు. సరిగా 1.40 గంటలకు వేదిక వద్దకు చేరుకున్న చంద్రబాబు.. 2.20 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించారు. సుమారు గంటా 15 నిమిషాల పాటు చేసిన ప్రసంగంలో ఎప్పుడూ చెప్పే సొంత డబ్బా... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత దూషణలకే పరిమితమయ్యారు. తన వల్ల వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్న రైతులు, వృద్ధులు, వికలాంగులు, వితంతులు, డ్వాక్రా మహిళలు, ఆటో డ్రైవర్లు రోజుకు 3 గంటల పాటు టీడీపీ కోసం ప్రచారం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తం సీట్లన్నీ టీడీపీ గెలిస్తే.. ఢిల్లీలో అధికారం తమ చేతుల్లో ఉంటుందన్నారు.
త్వరగా రండి బాబూ
అసలే వేసవి.. ఆపై మిట్ట మధ్యాహ్నం. చంద్రబాబు సభ అంటే.. కనీసం రెండు గంటలైనా ఆలస్యమవుతుందని చాలా మంది టీడీపీ కార్యకర్తలు నిర్ణీత సమయమైన ఒంటి గంటకు సభా ప్రాంగణానికి రాలేదు. దీంతో చంద్రబాబు విశాఖకు చేరుకున్నప్పటికి సగమైనా కుర్చీలు నిండలేదు. చుట్టు పక్కల జనాన్ని పోగేసి ఎలాగోలా ప్రాంగణం ఫుల్ అయ్యేలా చేశారు.
సీనియర్లను పట్టించుకోని బాబు
ఎన్టీఆర్ హయాం నుంచి మాడుగుల నియోజకవర్గం నుంచి 5 సార్లు పోటీ చేసి గెలిచిన రెడ్డి మాస్టారును బాబు కనీసం పట్టించుకోలేదు. మరో సీనియర్ నాయకుడు, భీమిలి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అప్పలనర్సింహరాజును కూడా బాబు చూసిచూడనట్టుగానే వ్యవహరించారు. పప్పల చలపతిరావు పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. మరో వైపు విశాఖ ఎంపీ టిక్కెట్ ఆశిస్తున్న బాలకృష్ణ అల్లుడు, గీతం మూర్తి మనవడు భరత్‌కు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైంది.
నాయకులుఎడమొహం పెడమొహం
సీట్ల సెగ చల్లారక ముందే ప్రచార పర్వం ప్రారంభించడంతో నాయకుల మధ్య అంతరం స్పష్టంగా కనిపించింది. గాజువాక, చోడవరం నియోజకవర్గాల్లో సిట్టింగ్ అభ్యర్థులున్నా తొలి జాబితాలో వారి పేర్లు లేకపోవడంతో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, కె.ఎస్.ఎన్.రాజు వేదికపై నిరాశతో కనిపించారు. చంద్రబాబుకు ఇరువైపులా గంటా, అయ్యన్న కూర్చున్నా కనీసం ఒక్కసారైనా పలకరింపులు లేవు. కార్యకర్తల నినాదాలతో ఇలా సభలోనూ సీట్ల వేడి రాజుకుంది.
గాజువాక, చోడవరం టిక్కెట్లపై కార్యకర్తల ఆందోళన
టీడీపీ ప్రచార సభలో కార్యకర్తలు ప్లకార్డులతో ఆందోళన చేశారు. పల్లా శ్రీనివాస్‌కు విశాఖ ఎంపీ టిక్కెట్ వద్దని, గాజువాక అసెంబ్లీ టిక్కెట్టే కేటాయించాలని కార్యకర్తలు నిరసన తెలిపారు. చోడవరం టిక్కెట్ కె.ఎస్.ఎన్.రాజుకే ఇవ్వాలంటూ పలువురు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.