
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో తాము పోటీ చేయని స్థానాల్లో వివిధ పార్టీలు, స్వతంత్రులకు మద్దతునివ్వాలని సీపీఐ, సీపీఎం నిర్ణయించాయి. నల్లగొండ, ఖమ్మంలో సీపీఎం, భువనగిరి, మహబూబాబాద్‌లలో సీపీఐ ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మిగతా 13 స్థానాల్లో ఎవరికి మద్దతునివ్వాలనే విషయంపై ఈ పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో ఇతర సీట్లలో ఏ అభ్యర్థిని బలపరచాలనే విషయంలో ఏ పార్టీకి ఆ పార్టీ నిర్ణయం తీసుకోవాలనే అభిప్రాయానికి వచ్చా యి.
ఈ నేపథ్యంలో తొలుత టీఆర్‌ఎస్, బీజేపీలను ఓడించగలిగే కాంగ్రెస్‌కి మద్దతునివ్వాలని నిర్ణయించిన సీపీఐ మల్కాజిగిరి, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో ఆ పార్టీకి మద్దతునిస్తున్నట్టు తెలిపింది. వయనాడ్‌లో సీపీఐ అభ్యర్థిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నామినేషన్ దాఖలు చేయడంతో మిగతా సీట్ల లో మద్దతుపై పునరాలోచనలో పడింది. చేవేళ్ల, సికింద్రాబాద్ ఇతర స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు మద్దతు కోరినా ఆచితూచి స్పందించింది. నిజామాబాద్‌లో రైతు అభ్యర్థులంతా ఉమ్మడిగా ఒకరిని ఎన్నుకుంటే వారికి మద్దతు తెలుపుతామని చెప్పింది.
జనసేన, బీఎస్పీలకు సీపీఎం మద్దతు...
జనసేనకు సికింద్రాబాద్, ఆదిలాబాద్, మల్కాజిగిరిలలో.. బీఎస్పీకి వరంగల్, నాగర్‌కర్నూల్, కరీంనగర్‌లలో... ఎంసీపీఐ (యూ)కు చేవెళ్ల, పెద్దపల్లిలో.. బహుజన ముక్త్‌పార్టీకి మహబూబ్‌నగర్, జహీరాబాద్‌లలో.. రైతులకు నిజామాబాద్‌లో.. మెదక్‌లో పృథ్వీరాజ్ అనే ఇండిపెండెంట్‌కు.. హైదరాబాద్‌లో న్యూ ఇండియా పార్టీకి మద్దతు తెలపాలని సీపీఎం నిర్ణయించింది.