
శాలిగౌరారం: రాష్ట్రంలో నరహంతక దోపిడీ పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో కాంగ్రెస్ సీనియర్ నేత, దివంగత కందాళ భద్రారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువకుల ఆత్మబలిదానాలు, ప్రజల సమష్టి ఉద్యమాలతో ఏర్పడిన కలల తెలంగాణ రాష్ట్రం.. నేడు దోపిడీ దొంగలు, నరహంతక ముఠాలతో కల్లోల తెలంగాణగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమంలో విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడుతుంటే చలించి మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసి రాష్ట్రం కోసం ఉద్యమించిన చరిత్ర తమకుందని చెప్పారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్ పాలనను చూస్తుంటే తెలంగాణను సాధించింది ఇందుకా అనే ప్రశ్న తమను నిత్యం వేధిస్తోందని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.