రూ. 5000 కోట్లతో బీసీ సంక్షేమ నిధి : దత్తాత్రేయ​

Bandaru Dattatreya Criticises KCR Over Reservations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మోసపూరితంగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎంపీ బండారు దత్తాత్రేయ విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని తెలిసినా.. కేంద్రం సహకరించడం లేదంటూ ఆరోపణలు చేయడం తగదన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ... రాజ్యాంగం ప్రకారం ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచే అధికారం ఉన్నా కేసీఆర్‌ ఆ పని చేయడం లేదని విమర్శించారు. సబ్‌ప్లాన్ అని చెప్పి బీసీలను కూడా మోసం చేశారని, బీసీ, ఇతర సామాజిక వర్గాల కార్పోరేషన్లకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ది మోసాల చరిత్ర అన్న దత్తాత్రేయ.. ఆయన దగ్గర మోసపూరిత విధానాలు, మాటల గారడి తప్ప ఇంకేం లేదని ఎద్దేవా చేశారు. ఆయన విధానాలతో టీర్‌ఎస్‌పై ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. కాంగ్రెస్‌- టీడీపీ పొత్తు గురించి ప్రస్తావిస్తూ... చంద్రబాబు ఓ మోసకారి అంటూ దుయ్యబట్టారు. అడుగడుగునా తెలంగాణను మోసం చేసిన సోనియా గాంధీ తెలంగాణ తల్లి కాదని.. ఆమె కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి మాత్రమే తల్లి అని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

10,000 కోట్ల తో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తాం..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే రూ. 10,000 కోట్లతో రైతు సంక్షేమ నిధి, రూ. 5000 కోట్లతో బీసీ సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామని దత్తాత్రేయ తెలిపారు. మక్తల్, నారాయణ పేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలలాగా మారుస్తామని హామీ ఇచ్చారు. విద్య, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, కార్పొరేట్ హాస్పిటల్లో బిల్లుల నియంత్రణ కోసం రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆర్ఎంపి, పీఎంపిలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు రాసిన వారికి ఇంటర్వ్యూ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే క్రీడా సంస్థల్లో క్రీడాకారులే పదాధికారులుగా ఉండేలా చట్టసవరణ తీసుకువస్తామని తెలిపారు. తాండూరు, జనగామ, రంగారెడ్డి, జడ్చర్ల వరకు ఎంఎంటీఎస్ సర్వీసును విస్తరిస్తామని పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top