గోవా జైలులో ఖైదీల బీభత్సం | Prisoner dies in failed Goa jail break | Sakshi
Sakshi News home page

గోవా జైలులో ఖైదీల బీభత్సం

Jan 25 2017 2:40 PM | Updated on Sep 5 2017 2:06 AM

గోవా జైలులో ఖైదీల బీభత్సం

గోవా జైలులో ఖైదీల బీభత్సం

గోవాలోని ఓ జైలులో రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ ఖైదీ మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.

గోవా :
గోవాలోని ఓ జైలులో మంగళవారం రాత్రి ఖైదీలు బీభత్సం సృష్టించారు. రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ ఖైదీ మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి.  పంజీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న సదా సబ్ జైలులో మంళవారం రాత్రి ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి వివరాలను డీఎస్పీ లారెన్స్ డి సౌజా బుధవారం తెలిపారు. జైలులో రెండు ఖైదీల గ్రూపుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఖైదీ వినాయక్ కోర్బాట్కర్ కత్తి పోట్లతో తీవ్రగాయాలయ్యాయన్నారు. ఆతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నెలలోనే మరో ఖైదీ అశ్పక్ బెనర్జీ పై కత్తితో దాడి చేసిన ఘటనలో వినాయక్ ప్రమేయం ఉందని ఆయన తెలిపారు.

దక్షిణ గోవా కలెక్టర్ స్వప్నిల్ నాయక్ ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. పంజీకి 15 కిలోమీటర్ల దూరంలో కొత్తగా నిర్మించిన కొల్వాలే సెంట్రల్ జైలులోకి ఖైదీలను మారుస్తుండగా జైలులోని రెండు గ్రూపుల మధ్య కొట్లాట జరిగిందన్నారు. అనంతరం ఖైదీలు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన జైలు సిబ్బందిపై కూడా ఖైదీలు దాడికి దిగి మెయిన్ గేట్ ద్వారా తప్పించుకోవాలని చూశారు. కానీ, అక్కడే గస్తీ కాస్తున్న పోలీసులు ఖైదీలను అడ్డుకున్నారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన ఖైదీలందరిని అడ్డుకొని జైలులో పరిస్థితి అదుపులోకి రావడానికి కొన్ని గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు.

45 మంది ఖైదీలతో పాటూ అండర్ ట్రయల్ లో ఉన్న మరికొందరు కలిసి జైలు నుంచి పరారవ్వలని చూశారు. ఈ మొత్తం తతంగంలో కొందరు జైలు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement