దేశంలో మౌలిక ప్రాజెక్టులను శరవేగంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.
ప్రణాళికలు రూపొందిస్తున్న కేంద్రం
రోజుకు 30 కి.మీ రోడ్డు నిర్మాణం
హైదరాబాద్-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే యోచన
న్యూఢిల్లీ: దేశంలో మౌలిక ప్రాజెక్టులను శరవేగంగా అభివృద్ధి చేయడానికి కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ సంవత్సరంలో రూ.3లక్షల కోట్ల వ్యయంతో రహదారులను నిర్మించడానికి కసరత్తుచేస్తోంది. రోజుకు 30 కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణం చేపట్టేలా లక్ష్యాన్ని విధించుకుంది. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తయిన సందర్భంగా రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారీ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.
కొత్త విధానాల్లో నిధులను సేకరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మోదీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టక మునుపు దేశంలో రోజుకు 2 కి.మీ. మేర రోడ్లు నిర్మాణమవుతుండగా, ఇప్పుది 12 కి.మీ.కు పెరిగిందని, నెలాఖరుకల్లా 14 కి.మీకు చేరుకుంటామన్నారు. రెండేళ్లలో 30 కి.మీ. చేరుకునేలా లక్ష్యాన్ని విధించుకున్నామన్నారు. వీటితోపాటు హైదరాబాద్-బెంగళూరు, అమృత్‌సర్-కత్రా ఎక్స్‌ప్రెస్‌వేలను చేపట్టే ఆలోచనలున్నాయన్నారు. గడ్కారీ ఇంకా ఏమన్నారంటే...
- యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను రోడ్డు మార్గాల ద్వారా కలిపే చార్‌ధామ్ ప్రాజెక్టుకు 11వేల కోట్లు ఇస్తాం.
- సరిహద్దు, కోస్తా ప్రాంతాల్లో 5వేల కి.మీ.తో నిర్మించే ‘భారత్ మాలా’ రోడ్ నెట్‌వర్క్‌కు రూ. 50 వేల కోటు ఖర్చు చేస్తాం.
- ఢిల్లీలో రద్దీని తగ్గించి, ఎన్‌హెచ్ 24లో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు ఐటీఓ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని దస్నా వరకు 16 లేన్లతో రూ.6వేల కోట్లతో ఈస్ట్రన్ బైపాస్ ప్రాజెక్టును మూడు నెలల్లో చేపడతాం.
- ఆరు నెలల్లో రూ.3 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులను పీపీపీ, హైబ్రిడ్ లేదా ఈపీసీ (ఇంజనీరింగ్, సేకరణ, నిర్మాణం) పద్ధతిలో నిర్మిస్తాం.
కాగా, మోదీ ప్రభుత్వంపై ఆరెస్సెస్ నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని గడ్కారీ చెప్పారు. కేంద్ర మంత్రులంతా స్వేచ్ఛగా పనిచేస్తున్నారన్నారు. ఇటీవల ఆరెస్సెస్ చీఫ్ భాగవత్‌తో కేంద్ర మంత్రులు భేటీ కావడంపై స్పందిస్తూ... వారి మధ్య రాజకీయ అంశాలపై చర్చి జరిగిందని అంగీకరించారు.