నింగిలోకి సగర్వంగా...

GSLV-F11 successfully launches GSAT-7A in to orbit - Sakshi

విజయవంతంగా జీశాట్‌–7ఏ ప్రయోగం

జీఎస్‌ఎల్వీ ఎఫ్‌–11 రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి

వాయుసేన, ఆర్మీ అవసరాల కోసం రూపొందించిన ప్రత్యేక ఉపగ్రహం

శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత వాయుసేనకు విశేష సమాచార సేవలందించేందుకు ఉద్దేశించిన జీశాట్‌–7ఏ ఉపగ్రహాన్ని భారత్‌ విజయవంతంగా ప్రయోగించింది. రక్షణ రంగానికి సాంకేతికంగా కీలకమైన ఈ ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–11 రాకెట్‌ ద్వారా నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో షార్‌ అంతరిక్ష కేంద్రం నుంచి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) బుధవారం నింగిలోకి పంపింది.

19 నిమిషాల 20 సెకన్లలో ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. ఇస్రోకు ఈ ఏడాదిలో ఇది ఏడో విజయం కాగా శ్రీహరికోట నుంచి ప్రయోగించిన వాటిలో 69వ విజయవంతమైన ప్రయోగం. 2,250 కిలోల బరువు కలిగిన మిలటరీ అడ్వాన్స్‌డ్‌ కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ఈ జీశాట్‌–7ఏ. క్రయోజనిక్‌ సాంకేతిక పరిజ్ఞానంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతో పరిపూర్ణత సాధించి ప్రపంచ దేశాల్లో భారత్‌ తిరుగులేని అంతరిక్ష ప్రయోగాలు చేసే శక్తిగా ఎదిగిందని మరోసారి నిరూపించారు.  

18 ఏళ్లు కఠోర శ్రమ ఫలితమే
ఇస్రో 18 ఏళ్లు కఠోరశ్రమ ఫలితమే తాజా వరుస విజయాలకు బాటవేసిందని చెప్పొచ్చు. సాయంత్రం 4.10 గంటలకు నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పెద్ద శబ్దంతో జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–11 రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ జీశాట్‌–7ఏను మోసుకుని నింగికేగింది. ఒక్కొక్క దశ విజయవంతంగా ప్రయాణం సాగిస్తుంటే మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని శాస్త్రవేతల ముఖాల్లో విజయగర్వం తొణికిసలాడింది. రాకెట్‌కు మొదటి దశలో నాలుగు వైపులా అమర్చిన నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్‌ బూస్టర్లతో పాటు కోర్‌ అలోన్‌ దశ విజయవంతంగా పనిచేసింది. రెండు, మూడు దశలు కూడా సమర్థవంతంగా పనిచేయడంతో ఈ భారీ ప్రయోగాన్ని సునాయాసంగా నిర్వహించారు.

పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసి మూడో దశలో అమర్చిన 14,996 టన్నుల క్రయోజనిక్‌ ఇంజిన్‌ల సాయంతో రాకెట్‌ శిఖరభాగంలో అమర్చిన జీశాట్‌–7ఏ ఉపగ్రహాన్ని 19.20 నిమిషాలకు నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో 3.5 టన్నుల నుంచి 5 టన్నుల బరువు కలిగిన సమాచార ఉపగ్రహాలతోపాటు చంద్రయాన్‌–2 ప్రయోగంలో రోవర్‌ను, ల్యాండర్‌ను, అలాగే స్పేస్‌ షటిల్‌ ప్రోగ్రాంలో భాగంగా మానవుడిని అంతరిక్షంలోకి పంపేందుకు ఈ ప్రయోగం ఎంతో దోహదపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే బెంగళూరులోని హసన్‌లో వున్న మాస్టర్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఉపగ్రహాల నియంత్రణా కేంద్రం) వారు దానిని తమ అధీనంలోకి తీసుకుని, అంతా సవ్యంగా పనిచేస్తున్నట్లు ప్రకటించారు.

2019లో 32 మిషన్లు లక్ష్యం: శివన్‌
ప్రయోగం విజయానంతరం మిషన్‌ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి ఇస్రో చైర్మన్‌ డాక్టర్‌ కైలాసవాడివో శివన్‌ మాట్లాడుతూ శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలించిదన్నారు.  ఇన్నాళ్లు చేసిన ప్రయోగాలు ఒక ఎత్తయితే జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు మాత్రం ఎవరెస్ట్‌ అంత ఎత్తు అని శివన్‌ అన్నారు. సమాచార ఉపగ్రహాలను మనం పంపుకోవడమే కాకుండా విదేశాలకు చెందిన భారీ ఉపగ్రహాలను పంపేస్థాయికి ఎదిగామని విజయగర్వంతో చెప్పారు. ఇస్రో 2019 ఏడాదిలో 32 మిషన్‌లను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  చెప్పారు. 2019 ప్రథమార్ధంలో చంద్రయాన్‌–2 ప్రయోగం చేపడతామన్నారు.

జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 ప్రయోగంలో ఎన్నడూ లేని విధంగా సూపర్‌ సింక్రోనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌లోకి జీశాట్‌–7ఏ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఎప్పుడు లేని విధంగా జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌11 రాకెట్‌లోని రెండోదశలోని ద్రవ ఇంధనాన్ని 2.5 టన్నులు పెంచడంతో ఆ దశ సక్సెస్‌ అయ్యిందన్నారు. తర్వాత క్రయోజనిక్‌ దశలో 3 టన్నులు ఇంధనం పెంచడంతో ఈ దశ కూడా విజయవంతం అయ్యిందన్నారు. ఈ రెండు ప్రత్యేకతలను ఒకే ప్రయోగంలో సాధించామని గర్వంగా చెప్పారు. 35 రోజుల్లో 3 ప్రయోగాలు సైతం ఇస్రో చరిత్రలో తొలిసారి కావడం విశేషం. ఈ ప్రయోగం భరత జాతికి కొత్త ఏడాదికి కానుక అని ఆయన వ్యాఖ్యానించారు.

గవర్నర్, సీఎం అభినందనలు
జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌–11 రాకెట్‌లో పంపిన జీశాట్‌–7ఏ ప్రయోగం విజయవంతమైనందుకు ఇస్రో శాస్తవేత్తల బందానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌తోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అభినందనలు తెలిపారు. ఇస్రో శాస్తవేత్తలు పనితీరు దేశానికి గర్వకారణమని వారు కొనియాడారు.

శాస్త్రవేత్తలకు వైఎస్‌ జగన్‌ అభినందనలు
జీశాట్‌–7ఏను విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అద్భుతమైన విజయాలను ఇస్రో సాధించాలని ఆయన ఆకాంక్షించారు.  

వాయుసేనకు అండదండ
జీశాట్‌–7ఏ బరువు: 2,250 కేజీలు
ఉపగ్రహ జీవితకాలం: 8 ఏళ్లు
వ్యయం: రూ.500–800 కోట్లు  

ట్రాన్స్‌పాండర్లు: కేయూ బ్యాండ్‌. వీటివల్ల చాలా ప్రయోజనాలున్నాయి. అతిచిన్న యాంటెన్నాతోనైనా సిగ్నల్స్‌ను గ్రహిస్తాయి. ఇతర బ్యాండ్లతో పోల్చి చూస్తే విస్తృతమైన కవరేజ్‌ ఉంటుంది. వర్షాలు, ఇతర వాతావరణమార్పుల్ని బాగా తట్టుకోగలవు.

బెంగళూరు: ఇస్రో ప్రయోగించిన జీశాట్‌–7ఏ ఉపగ్రహంతో భారత రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం కానుంది. జీశాట్‌–7ఏని ప్రత్యేకంగా భారతీయ వైమానిక దళ, ఆర్మీ అవసరాల కోసమే రూపొందించారు. వాయుసేనకు చెందిన రాడార్‌ స్టేషన్లు, వైమానిక స్థావరాలను ఈ ఉపగ్రహానికి అనుసంధానిస్తారు. తద్వారా కదనరంగంలో భారత వైమానిక దళ సామర్థ్యం పెరుగుతుంది. సమాచార సరఫరా వేగవంతం అవుతుంది. ఎంతో దూరంలో ఉండే ప్రత్యర్థుల విమానాలను కూడా గుర్తించడానికి వీలు కలుగుతుంది. యుద్ధ విమానాల పర్యవేక్షణ కూడా ఈ ఉపగ్రహం సాయంతో చేయవచ్చు. రాడార్ల కంటే అత్యంత శక్తిమంతమైన సిగ్నల్స్‌ను కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్‌ ద్వారా ఈ ఉపగ్రహం అందిస్తుంది. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరమవుతుంది.

డ్రోన్ల పనితీరు సులభం
జీశాట్‌–7ఏతో వాయుసేనలో డ్రోన్ల నిర్వహణ సులభమవనుంది. యూఏవీ (గాలిలో ఎగిరే మానవరహిత వాహనం)లను భూస్థావరం నుంచి కాకుండా ఉపగ్రహం ద్వారా నియంత్రించవచ్చు. డ్రోన్లు ఎప్పటికప్పుడు వీడియోలు, ఫొటోలు తీసి సమాచారం పంపడానికి సాయపడుతుంది. అమెరికా నుంచి సముద్ర గస్తీ డ్రోన్లను కొనుగోలు చేయాలనుకుంటున్న తరుణంలో జీశాట్‌–7ఏ ఉపగ్రహంతో వాటి పనితీరు మరింత సులభం కానుంది. అత్యంత ఎత్తులో ప్రయాణించే డ్రోన్లు సుదూరం నుంచి కూడా నిర్దేశిత లక్ష్యాల్ని ఛేదించగలవు.  

గతంలో రుక్మిణి ప్రయోగం
2013లో ఇస్రో జీశాట్‌–7ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహాన్ని రుక్మిణి అని పిలుస్తారు. ఈ రుక్మిణి హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగపడింది. యుద్ధనౌకలు, జలాంతర్గాములు, సముద్ర తీర గస్తీ విమానాల కదలికలకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని రుక్మిణి ఉపగ్రహం ద్వారా తెలుసుకునే వీలు కలిగింది. ఇప్పుడు రుక్మిణిని మరింత అధునీకరించి జీశాట్‌–7ఏను ప్రయోగించారు. ఇందులో ఏ అంటే అడ్వాన్స్‌డ్‌ అని అర్థం. జీశాట్‌–7ఏతో వైమానిక దళ కమాండ్‌ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. మరికొన్నేళ్లలో జీశాట్‌–7సీ ఉపగ్రహాన్ని ప్రయోగించి నెట్‌వర్క్‌ ఆపరేషన్లను బలోపేతం చేయడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచంలో 320 మిలటరీ ఉపగ్రహాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 320 మిలటరీ ఉపగ్రహాలు ఉన్నాయి. వీటిలో సగం అమెరికాకు చెందినవే. ఆ తరవాత అత్యధిక సైనిక ఉపగ్రహాలు కలిగిన దేశాల్లో రష్యా, చైనా ఉన్నాయి.
ఈ విషయంలో చైనాయే మనకి అతి పెద్ద శత్రువు. సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఎన్నో ఉపగ్రహాల్ని చైనా ప్రయోగించింది. చివరికి యాంటీ శాటిలైట్‌ ఆయుధాలు.. అంటే ఉపగ్రహాల్నే కూల్చే ఆయుధాల్ని కూడా పరీక్షించింది. భారత్‌కు ఇప్పటివరకు 13 మిలటరీ ఉపగ్రహాలే ఉన్నాయి. భూమిపై నిఘా, యుద్ధనౌకలకు దిక్సూచి, కమ్యూనికేషన్లకి ఉపయోగపడుతున్నాయి. మిలటరీ ఉపగ్రహాల సహకారంతోనే పాకిస్తాన్‌పై లక్షిత మెరుపుదాడుల సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయగలిగాం.

ఉపయోగాలివీ...
సమాచార ఉపగ్రహాల్లో జీశాట్‌–7ఏ ప్రత్యేకమైన ఉపగ్రహంగా చెప్పుకోవచ్చు. సమాచార ఉపగ్రహాలను ఎక్కువగా డీటీహెచ్‌ ప్రసారాలు, ఇంటర్నెట్‌ సౌకర్యాలను పెంపొందించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈసారి మాత్రం పూర్తిగా వాయుసేన, ఆర్మీ కోసం దీనిని ప్రయోగించారు. ఈ ఉపగ్రహంలో కేయూ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు మాత్రమే ఉంటాయి. ఈ ఉపగ్రహాన్ని స్పేస్‌ అప్లికేషన్‌ సెంటర్‌ (అహ్మదాబాద్‌)లో అభివృద్ధి చేశారు. శత్రుదేశాల నుంచి వచ్చే ముప్పును కనిపెడుతుంది. మిలటరీకి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తుంది. ఇప్పటిదాకా పంపిన 35 సమాచార ఉపగ్రహాల్లోకెల్లా ఇది ప్రత్యేకమైనది. మిలటరీ, ఎయిర్‌ఫోర్స్‌ అవసరాల కోసమే దీన్ని రూపొందించినట్టు ఇస్రో ప్రకటించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top