రియల్ ఎస్టేట్ వల్లే అధిక ‘ఆదాయ వెల్లడి’ | Devaraja Reddy comments on IDS | Sakshi
Sakshi News home page

రియల్ ఎస్టేట్ వల్లే అధిక ‘ఆదాయ వెల్లడి’

Oct 5 2016 1:01 AM | Updated on Sep 27 2018 4:47 PM

రియల్ ఎస్టేట్ వల్లే అధిక ‘ఆదాయ వెల్లడి’ - Sakshi

రియల్ ఎస్టేట్ వల్లే అధిక ‘ఆదాయ వెల్లడి’

రియల్ ఎస్టేట్‌వల్లే ‘ఐడీఎస్’ కింద తెలుగు రాష్ట్రాల్లో అధిక ఆదాయం వెల్లడై ఉండవచ్చునని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజారెడ్డి అభిప్రాయపడ్డారు.

‘ఐడీఎస్’లో తెలుగువారే ఎక్కువ ఉండటంపై ఐసీఏఐ అధ్యక్షుడు దేవరాజారెడ్డి
 
 
 సాక్షి, న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్‌వల్లే ‘ఐడీఎస్’ కింద తెలుగు రాష్ట్రాల్లో అధిక ఆదాయం వెల్లడై ఉండవచ్చునని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) అధ్యక్షుడు ఎం.దేవరాజారెడ్డి అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘ఆదాయ వెల్లడి పథకం’ (ఐడీఎస్) ద్వారా ఏపీ, తెలంగాణాల్లో ఎక్కువమంది తమ ఆదాయాన్ని ప్రకటించడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్న నగరం. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో ఉన్నందున పెట్టుబడులకు అవకాశాలు పెరగడంతో పాటుగా తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేవారు ఆస్తులను అమ్మేసి అక్కడ పెట్టుబడి పెడుతున్నారు. దీనివల్ల ఆదాయపు పన్ను అధికంగా వసూలయ్యే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐడీఎస్ విజయవంతం కావడంలో సీఏల పాత్ర ఎంతో ఉంది’ అని దేవరాజారెడ్డి చెప్పారు. మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ...ఐడీఎస్‌తో కేంద్రానికి రూ.71 వేల కోట్ల ఆదాయం లభించిందని, 64 వేల మందికి పైగా ఆదాయాన్ని వెల్లడించారన్నారు. వీరిలో 60 శాతం కొత్తవారు ఉండవచ్చన్నారు. దేశంలో 10 లక్షల మందికి పైగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఉన్నారని చెప్పారు.

 అంతర్జాతీయ ప్రమాణాలతో నూతన సిలబస్...
 సీఏ కోర్సులు అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండేలా నూతన సిలబస్‌ను త్వరలోనే ప్రవేశపెడతామని దేవరాజారెడ్డి చెప్పారు. జీఎస్‌టీ అమలు కాబోతున్న నేపథ్యంలో.. దీనికి అనుగుణంగా రూపొందించిన ఈ నూతన సిలబస్‌ను సోమవారం ఐసీఏఐ కౌన్సిల్ సమావేశంలో ఖరారు చేశామన్నారు. ప్రస్తుతం 10వ తరగతి తర్వాత సీఏకు రిజిస్టర్ చేసుకుంటున్నారని, నూతన సిలబస్ ప్రకారం 12వ తరగతి తర్వాతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. విద్యార్థులు వృత్తిపరమైన సీఏ కోర్సులను ఆసక్తితోనే చదవాలని, ఒత్తిడితో కాదన్నారు. దేశంలోని 2.5 లక్షల మంది సీఏలలో 30 వేల మంది విదేశాలలో ఉన్నారని, మరో 5 ఏళ్లలో ఒక లక్ష మంది విదేశాలకు వెళతారన్నారు. ఏపీ, తెలంగాణాల్లో సీఏ కోచింగ్ సెంటర్లలో బట్టీలు పట్టిస్తూ విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయని, వాటిపై ఆధారపడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement