గిన్నిస్ విజయానికి తొలిమెట్టు ‘మీనా’ | Vijaya Nirmala First Movie 'Meena' Completes 40 Years | Sakshi
Sakshi News home page

గిన్నిస్ విజయానికి తొలిమెట్టు ‘మీనా’

Dec 27 2013 11:52 PM | Updated on Sep 2 2017 2:01 AM

కృష్ణ అంటే మాస్. మాస్ అంటే కృష్ణ. అలాంటి మాస్ స్టార్‌తో పక్కా క్లాస్ సినిమా తీస్తే? అదే ‘మీనా’. కృష్ణకు ఇదే తొలి నవలా చిత్రం.

కృష్ణ అంటే మాస్. మాస్ అంటే కృష్ణ. అలాంటి మాస్ స్టార్‌తో పక్కా క్లాస్ సినిమా తీస్తే? అదే ‘మీనా’. కృష్ణకు ఇదే తొలి నవలా చిత్రం. సినిమా అంతా పంచెకట్టులోనే కనబడతారాయన. ఇందులో నో ఫైట్స్... నో డాన్సెస్. అయినాసినిమా రక్తి కట్టింది. ఈ సాహసం విజయ నిర్మలది. స్టార్ వేల్యూని కాకుండా స్టోరీ వేల్యూని నమ్ముకుని... దర్శకురాలిగా తన ప్రయాణం మొదలుపెట్టారు. పక్కా స్క్రిప్టు... పర్‌ఫెక్ట్ ప్లానింగ్... ఇవే ఆమె విజయ రహస్యాలు. ‘మీనా’ విడుదలై నేటికి 40 ఏళ్లు. దర్శకురాలిగానూ, నిర్మాతగానూ విజయభేరి మోగించిన విజయ నిర్మలకు ఈ సినిమానే తొలిమెట్టు.
 
‘సాక్షి’ షూటింగ్... విజయ నిర్మలకు హీరోయిన్‌గా ఇది రెండో సినిమా. కృష్ణతో కలిసి యాక్ట్ చేయడం ఇదే తొలిసారి. సెట్‌లో చాలా హుషారుగా ఉన్నారామె. బాపు టేకింగ్ ఆమెని మంత్రముగ్ధురాల్ని చేసేసింది. బొమ్మలతో చాలా డీటైల్డ్‌గా బాపు వేసిన స్క్రిప్టు బుక్ చూసి ఎంత మురిసిపోయారో.షాట్ గ్యాప్‌లో కృష్ణతో ‘‘నాక్కూడా డెరైక్షన్ చేయాలనుంది’’ అని తన మనసులో మాట చెప్పారామె. కృష్ణ షాక్ కాలేదు కానీ, కొంచెం ఆశ్చర్యపోయారు. ‘‘నీకింకా హీరోయిన్‌గా చాలా భవిష్యత్తు ఉంది. ఇప్పటికిప్పుడు డెరైక్షన్ చేస్తే, రెంటికి చెడ్డ రేవడి అవుతావు. ముందు హీరోయిన్‌గా సినిమాలు చేయ్. ఈలోగా డెరైక్షన్‌పై అవగాహన పెంచుకో’’ అని గట్టిగానే చెప్పారు కృష్ణ. విజయ నిర్మల ఏం మాట్లాడలేదు. సాధారణంగా కృష్ణ సలహా ఇవ్వరు. ఇస్తే తిరుగే ఉండదు.ఇక అప్పటినుంచీ విజయనిర్మల ఏ సినిమా చేసినా, ఆ దర్శకుని శైలిని నిశితంగా గమనించడం ఓ పని అయిపోయింది.
 
 సీఎస్‌రావు... వి.మధుసూదనరావు... వరప్రసాద్... ఇలా చాలామంది దర్శకుల పనితీరుని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకున్నారు.1972... విజయ నిర్మలకు హీరోయిన్‌గా ఓ స్టేచర్ వచ్చేసింది. బోలెడన్ని హిట్లు... బోలెడంత పేరు. ఆమెలో అప్పటి వరకూ రహస్యంగా సంచరించిన డెరైక్టర్ బయటికి వచ్చే సమయం ఆసన్నమైంది. విజయ నిర్మల ఓ మలయాళ సినిమాలో యాక్ట్ చేస్తుండగా కో డెరైక్టర్ ఐవి శశి పరిచయమయ్యారు. ఆయన ద్వారా రచయిత షరీఫ్ కలిశాడు. అతను చెప్పిన కథ విజయ నిర్మలను ఎట్రాక్ట్ చేసేసింది. చేస్తే గీస్తే ఇలాంటి కథతోనే తన ఫస్ట్ డెరైక్షన్ చేయాలి. బడ్జెట్ వేసి చూసుకుంటే ఆరు లక్షలు తేలింది. అప్పట్లో అది చాలా ఎక్కువే. ఇంత రిస్కు అవసరమా అనిపించిందామెకు. అప్పుడు కృష్ణ ఓ సలహా ఇచ్చారు. ‘‘ఓ పని చేయ్. నీకెలాగో మలయాళంలో పాపులార్టీ ఉందిగా. అక్కడే తీయ్. ఖర్చు సగానికి తగ్గుతుంది. అక్కడైతే ఇంత బడ్జెట్ అవ్వదు’’.
 
అలా మలయాళంలో ‘కవిత’ సినిమా మొదలుపెట్టారు విజయ నిర్మల. తనే టైటిల్ రోల్. హీరోగా ఉమర్‌ని తీసుకున్నారు. మధు, రాజశ్రీ, తిక్కురసి, విన్సెంట్, ఆదూర్ బాసి, కలియూర్ పొన్నమ్మ లాంటి హేమాహేమీలు యాక్ట్ చేశారు. ‘నీల్‌క్కుయిల్’ వంటి సినిమాలకు స్వరాలందించి పరిశ్రమకు దూరంగా ఉన్న రాఘవన్ మాస్టారితో ఏరికోరి మ్యూజిక్ చేయించుకున్నారు. మలయాళంలో ఫస్ట్ లేడీ డెరైక్టర్‌గా విజయ నిర్మలకు పేరూ వచ్చింది. హిట్టూ దక్కింది. వందరోజులాడిందా సినిమా. ఇప్పుడు విజయ నిర్మలకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. రచ్చ గెలిచింది. ఇప్పుడు ఇంట గెలవాలి. తెలుగులో డెరైక్షన్‌కు ప్రయత్నాలు మొదలయ్యాయి. విజయ నిర్మలకు మొదట్నుంచీ బాగా నవలలు చదివే అలవాటు. యద్దనపూడి సులోచనారాణికి వీరాభిమాని. ఆవిడ రాసిన ‘మీనా’ నవల అంటే ప్రాణం. దాన్నే సినిమాగా తీస్తే? కానీ హక్కులు ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు దగ్గర ఉన్నాయ్.
 
అన్నపూర్ణ సంస్థలో విజయ నిర్మల ‘పూలరంగడు’, ‘ఆత్మీయులు’ సినిమాల్లో నటించారు. ఆయనతో బాగా పరిచయం ఉంది. దుక్కిపాటిని కలిసి ‘మీనా’ హక్కులు అడిగారామె. కృష్ణ హీరోగా ఈ సినిమా తానే డెరైక్ట్ చేస్తానని చెప్పడంతో, దుక్కిపాటి ఆశ్చర్యపోయారు. ‘‘కృష్ణలాంటి మాస్ హీరోతో ఇలాంటి సినిమా ఎలా తీస్తావ్? ఇందులో ఫైట్లూ, మాస్ మసాలా అంశాలు ఉండవు కదా’’ అనడిగారు. ఏం ఫర్వాలేదన్నారు విజయ నిర్మల. కానీ మనసులో ఎక్కడో చిన్నపాటి సంశయం ఉందామెలో. కృష్ణను అడగాలా వద్దా అని సందిగ్ధం. ఇదంతా కృష్ణ గమనించారు. ‘‘ఏం ఫర్వాలేదు. మంచి కథ కదా. డేట్లిస్తా. వెంటనే పని మొదలు పెట్టు’’ అని భరోసా ఇచ్చారు. కృష్ణతో డాన్సులూ, ఫైట్లూ లేకుండా క్లాస్ సినిమా అంటే కొంచె రిస్కే. బయటి నిర్మాతలకు ఆ కష్టం, నష్టం ఎందుకు? అందుకే విజయ నిర్మల సొంతంగా విజయకృష్ణా మూవీస్ బేనర్ పెట్టారు.
 
పనులు మొదలయ్యాయి. హీరోగా కృష్ణ రెడీ. హీరోయిన్‌గా తను రెడీ. హీరోయిన్ తండ్రి పాత్రకు ఎస్వీ రంగారావుని అడిగితే ఆయనా ఓకే. ఎస్.వరలక్ష్మి, జగ్గయ్య, అల్లు రామలింగయ్య, సూర్యకాంతం, చంద్రకళ... ఇలా అంతా రెడీ. బాపు తరహాలో బొమ్మలతో స్క్రిప్ట్ బుక్ రెడీ చేయించుకోలేదు కానీ, దగ్గర దగ్గరగా అలాంటిపనే చేశారు విజయ నిర్మల. ఓ క్యారంబోర్డు మీద మినియేచర్ సెట్ వేయించి, కొండపల్లి బొమ్మలు పెట్టించి... ఇది మిడ్‌షాట్, ఇది క్లోజప్... అంటూ పూర్తి డీటెయిల్స్‌తో నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారు. షూటింగ్‌కి అంతా రెడీ. ఈలోగా షాకింగ్ న్యూస్. ఎస్వీఆర్ హఠాన్మరణం. దాంతో అప్పటికప్పుడు గుమ్మడిని తీసుకున్నారు. ఫస్ట్ డే షూటింగ్. గుమ్మడి మీదే సీన్లు.
 
 చక చకా 6 సీన్లు తీసేసిందామె. ఈ స్పీడు చూసి గుమ్మడికి అయోమయంగా అనిపించింది. ‘‘ఏంటమ్మా ఇది. ఓ ఆర్డర్ లేకుండా చేస్తే మూడ్ ఎలా వస్తుంది... నవల పాడు చేస్తున్నావ్’’ అంటూ కేకలేశారు. వెంటనే మేకప్ కూడా తీసేశారు. దాంతో విజయ నిర్మల అప్పటి వరకూ తీసిన ఆరు సీన్లని ఎడిట్ చేసి గుమ్మడికి చూపించింది. అప్పుడు శాంతించారాయన. ‘ఓసి... పని రాక్షసి’ అని కితాబు కూడా ఇచ్చారు. 35 రోజుల్లో 17 రీళ్ల సినిమా తయారైంది. సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చయ్యింది. ఫస్ట్ కాపీ వచ్చాక పంపిణీదారులకు చూపించారు. సినిమా అంతా బాగుంది కానీ, ‘శ్రీరామ నామాలు శతకోటి’ పాట మాత్రం వృథా అని తేల్చేశారు. తీసేయమన్నారు కూడా. విజయ నిర్మల మాత్రం ఆ పాట ఉండి తీరాల్సిందే అని పట్టుబట్టారు. 
 
1973 డిసెంబర్ 28న ‘మీనా’ విడుదలైంది. కథలోని మలుపులు, ఫ్యామిలీ డ్రామా ఈ చిత్రాన్ని విజయతీరం వైపు నడిపించాయి. 25 కేంద్రాల్లో 100 రోజులాడింది. విజయవాడలో మెయిన్ థియేటర్‌లోనే కాకుండా, సెకండ్ థియేటర్ లీలామహల్‌లో కూడా ఈ సినిమా 50 రోజులాడింది. విశేషం ఏమిటంటే ఈ 50 రోజులూ కేవలం మహిళా ప్రేక్షకులకే ప్రదర్శించారు. అదొక రికార్డు కూడా. రమేశ్‌నాయుడు స్వరపరిచిన పాటలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘శ్రీరామ నామాలు శతకోటి’, ‘మల్లెతీగ వంటిది మగువ జీవితం’, ‘పెళ్లంటే నూరేళ్ల పంట’ పాటలు పెద్ద హిట్టు.
 
దర్శకురాలిగా, నిర్మాతగా విజయ నిర్మల ఓ చరిత్ర. అందుకు తొలిమెట్టు ‘మీనా’ సినిమా. భానుమతి, సావిత్రిలాంటి వాళ్లు డెరైక్ట్ చేసినా కూడా... విజయ నిర్మలలాగా ఇన్ని సినిమాలూ ఎవ్వరూ చేయలేదు. ఇంత సక్సెస్సూ ఎవ్వరూ సాధించలేదు. అందుకే గిన్నిస్ బుక్ కూడా ఆమె ముందు సాగిలపడింది. దేవదాసు (1974), దేవుడే గెలిచాడు (1976), హేమా హేమీలు (1979), సంఘం చెక్కిన శిల్పాలు (1979), రామ్-రాబర్ట్-రహీమ్ (1980), భోగి మంటలు (1981), అంతం కాదిది ఆరంభం (1981), సాహసమే నా ఊపిరి (1989)... ఇలా ఒక మహిళ దిగ్విజయంగా 43 సినిమాలు డెరైక్ట్ చేయడమంటే మాటలు కాదు. అందుకే విజయ నిర్మల ప్రస్థానం ఓ చరిత్ర! భావితరం మహిళా దర్శకులకు ఓ ఇన్‌స్పిరేషన్!
 
చాలా బాగా తీశావని యద్దనపూడి మెచ్చుకున్నారు
‘‘నిజానికి ఈ చిత్రాన్ని కలర్‌లో తీయాలి. కానీ బడ్జెట్ పరిమితుల రీత్యా బ్లాక్ అండ్ వైట్‌లో తీశాం. సినిమా విడుదలయ్యాక యద్దనపూడి ఫోన్ చేసి ‘నవలను ఏమాత్రం చెడగొట్టకుండా చాలా బాగా తీశారమ్మా’ అని మెచ్చుకున్నారు. దాంతో విజయ నిర్మల అవార్డు వచ్చినంతగా సంబరపడిపోయింది. ఈ సినిమా అంతా నేను పంచెకట్టులోనే కనిపిస్తాను. నేను పంచె కడితే ఆ సినిమా సూపర్‌హిట్టే అనే సెంటిమెంట్ దీంతో మరింత బలపడింది. విజయనిర్మల గిన్నిస్ స్థాయికి ఎదగడానికి ఈ సినిమానే ప్రాతిపదిక. నాకిది 96వ సినిమా. నేను, విజయ నిర్మల కలిసి చేసిన 29వ చిత్రం 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement