2 నౌకలపై దాడి

Two oil tankers attacked in Gulf of Oman - Sakshi

ఇరాన్‌ సమీపంలోని ‘గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌’ వద్ద ఘటన

అంతర్జాతీయ మార్కెట్‌లో ఎగబాకిన ముడిచమురు ధరలు

దుబాయ్‌/టెహ్రాన్‌/ఓస్లో: యుద్ధమేఘాలు కమ్ముకున్న గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్తత చెలరేగింది. ఇరాన్‌కు సమీపంలో ఉన్న ‘గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌’ ప్రాంతంలో గురువారం రెండు చమురు నౌకలపై గుర్తుతెలియని దుండగులు దాడిచేశారు. ఈ దుర్ఘటనలో రెండు నౌకలు మంటల్లో చిక్కుకోగా, ఇరాన్‌ నేవీ 44 మంది సిబ్బందిని రక్షించింది. నార్వేకు చెందిన ‘ఫ్రంట్‌ ఆల్టేర్‌’ నౌక ఇథనాల్‌ను ఖతార్‌ నుంచి తైవాన్‌కు ఇరాన్‌ సమీపంలోని హోర్ముజ్‌ జలసంధి మార్గం ద్వారా తీసుకెళుతోంది. ఈ నేపథ్యంలో నౌక గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌ ప్రాంతానికి చేరుకోగానే ఉదయం ఒక్కసారిగా మూడు పేలుళ్లు సంభవించాయి. నౌకలో మంటలు చెలరేగడంతో 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. అలాగే సౌదీఅరేబియా నుంచి సింగపూర్‌కు ఇదేమార్గంలో మిథనాల్‌ను తీసుకెళుతున్న ‘కొకువా కరేజియస్‌’ నౌకపై గంట వ్యవధిలో మరోదాడి జరిగింది.  ఈ రెండు నౌకల నుంచి ప్రమాద హెచ్చరికలను అందుకున్న ఇరాన్‌ నేవీ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని 44 మంది సిబ్బందిని కాపాడింది.

ఖండించిన ఐరాస: ప్రపంచంలో మూడోవంతు చమురును తరలించే హోర్ముజ్‌ జలసంధి వద్ద దాడి జరగడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు 3 శాతానికిపైగా ఎగబాకాయి. లండన్‌కు చెందిన బ్రెంట్‌ ముడిచమురు ధర బ్యారెల్‌కు 61.99 డాలర్లకు చేరుకోగా, న్యూయార్క్‌ వెస్ట్‌ టెక్సాస్‌ బ్యారెల్‌ చమురు ధర 3.1 శాతం పెరిగి 52.74 డాలర్లకు పెరిగింది. ఈ ఘటనను ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ ఖండించారు. గల్ఫ్‌లో మరో ఉద్రిక్తత తలెత్తితే ప్రపంచం తట్టుకోలేదని హెచ్చరించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top