ఎవరి వ్యూహాలు వారివి

Can friendships between the US and North Korea fall? - Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీ ఆశించిన ఫలితాలు సాధించి చరిత్ర సృష్టిస్తుందా ? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అణ్వాయుధాల వినియోగం, వ్యాప్తి నిరోధం కోసం తాను ‘శాంతి యాత్ర’కు వెళుతున్నట్లు సింగపూర్‌కు బయలుదేరే ముందు ట్రంప్‌ ప్రకటించినా.. ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరగనున్న ఈ సమావేశం దశ, దిశ ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇరువురు నేతల చంచల స్వభావాల్ని పరిగణనలోకి తీసుకుంటే మాత్రం భేటీ అనూహ్యంగా ముగుస్తుందనే ఊహాగానాలు సాగుతున్నాయి.

నిజానికి శిఖరాగ్ర సమావేశాల కోసం ఎజెండాను ముందుగానే ఖరారుచేస్తారు. ఈ భేటీ కోసం రూపొందించిన ఎజెండాపై గోప్యత కొనసాగుతోంది. అణ్వస్త్రాల వ్యాప్తి, తయారీ నుంచి వైదొలిగేందుకు కిమ్‌ సానుకూలంగా స్పందిస్తారని అమెరికా ఆశిస్తోంది. దక్షిణ, ఉత్తర కొరియాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధానికి ముగింపు పలికేందుకు ఈ భేటీ దోహదపడుతుందని ఆ దేశం నమ్మకంతో ఉంది. ఆ దిశగా అగ్రరాజ్యానికి నమ్మకం కలిగించే చర్యల్ని ఉ.కొరియా ఇప్పటికే చేపట్టినా.. తన బలంగా చెప్పుకుంటున్న అణ్వాయుధాలను కిమ్‌ వదులుకుంటాడా? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

స్నేహ సంబంధాలు చిగురిస్తాయా?
బద్ద శత్రువులుగా ఉన్న అమెరికా–ఉత్తరకొరియాల మధ్య స్నేహ సంబంధాలు చిగురిస్తాయా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. గతేడాది ట్రంప్‌–కిమ్‌ల మధ్య మాటల యుద్ధంతో కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తమపై దాడికి పాల్పడితే అమెరికాపై అణ్వాస్త్రాల్ని ప్రయోగిస్తామంటూ కిమ్‌ హెచ్చరించగా.. ట్రంప్‌ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, కిమ్‌లు పరస్పరం దూషణలకు దిగారు. అయితే తన ధోరణికి భిన్నంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి కిమ్‌ శాంతి మంత్రం మొదలుపెట్టారు. ఇకపై దేశ ఆర్థికాభివృద్ధిపై దృష్టి పెడతానని చెప్పడంతో పాటు దక్షిణ కొరియాకు స్నేహ హస్తం అందించారు. స్వయంగా కొరియా సరిహద్దుల్లో ద.కొరియా అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ట్రంప్‌తో చర్చలకు ప్రతిపాదించడంతో పాటు తానే చొరవ తీసుకున్నాడు. ఒక దశలో ట్రంప్‌ అర్ధాంతరంగా చర్చల్ని రద్దుచేసుకుంటున్నట్లు ప్రకటించినా.. కిమ్‌ ఒక మెట్టు దిగొచ్చి ట్రంప్‌ను చర్చలకు ఒప్పించారు.  

 ఇద్దరికీ సవాలే..
అమెరికాలో తన పట్టు నిలుపుకోవడంతో పాటు, ప్రపంచం దృష్టిలో సమర్థనేతగా గుర్తింపు పొందేందుకు ఈ భేటీని సువర్ణావకాశంగా ఉపయోగించుకోవాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ఉత్తరకొరియాను దారికి తెచ్చిన నేతగా చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తున్నారు. చైనా, రష్యా ఆధిపత్యానికి చెక్‌పెట్టి ఆసియాపై తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రస్తుత చర్చలు ఉపయోగపడతాయనే ఆలోచనతో ఉన్నారు. మరోవైపు అమెరికా, ఇతర దేశాల ఆర్థిక,సైనిక ఆంక్షలతో దారుణంగా దెబ్బతిన్న తన దేశ పునర్నిర్మాణంతోపాటు.. ప్రపంచదేశాల్లో సానుకూల గుర్తింపు పొందేందుకు ఈ శిఖరాగ్ర సమావేశాన్ని వేదికగా చేసుకోవాలని కిమ్‌ ఆశాభావంతో ఉన్నారు. ఈ చర్చల సందర్భంగా ట్రంప్‌ తన దుందుడుకు స్వభావానికి భిన్నంగా వ్యవహరిస్తారా? దౌత్యనీతిని ప్రదర్శించి పెద్దన్నపాత్రను పోషిస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది. కిమ్‌తో భేటీ ట్రంప్‌ సామర్థ్యానికి సవాల్‌గా నిలవనుంది.

    –సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top