‘బేడీ’ల ఘటనపై విచారణ జరిపించండి | Sakshi
Sakshi News home page

‘బేడీ’ల ఘటనపై విచారణ జరిపించండి

Published Sat, May 13 2017 1:06 AM

‘బేడీ’ల ఘటనపై విచారణ జరిపించండి - Sakshi

గవర్నర్‌ నరసింహన్‌కు టీపీసీసీ విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘటనపై విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. శుక్రవారం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ముఖ్యనేతలు రాజ్‌భవన్‌లో నరసింహన్‌ను కలిశారు. రైతులకు బేడీలు వేయడం, వారిపై పెట్టిన కేసులు.. తదితర అంశాలను వారు గవర్నర్‌కు వివరించారు. అనంతరం ఉత్తమ్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో రైతులకు చేసింది శూన్యమన్నారు. లక్షన్నర కోట్ల బడ్జెట్‌ ఉండి, రైతుల పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.

విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చుచేస్తున్న ప్రభుత్వానికి రైతులను ఆదుకోవడానికి చేతులు రావడంలేదని విమర్శించారు. ఆందోళనలో ఉన్న రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ భరోసా ఇవ్వడంలేదని, మార్కెట్‌యార్డులను మంత్రులు సందర్శించకుండా బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. దీనిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్టు ఉత్తమ్‌ వెల్లడించారు. గవర్నర్‌ను కలసినవారిలో షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, జె.గీతారెడ్డి, కె.ఆర్‌.సురేశ్‌రెడ్డి, నాగయ్య తదితరులు ఉన్నారు.  

Advertisement
Advertisement