
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊరటనిచ్చేలా లేదు. నాబార్డు కింద ఏర్పాటు చేసిన కార్పస్ ఫండ్ నుంచే రూ.6 వేల కోట్ల రుణాలను సత్వర సాగునీటి ప్రాయోజిత పథకం (ఏఐబీపీ) కింద ఎంపిక చేసిన ప్రాజెక్టులకు ఇస్తామని బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. దేశవ్యాప్తంగా 48 ప్రాజెక్టులకు రూ.6 వేల కోట్లు ఇస్తామని పేర్కొనగా, అందులో తెలంగాణకు సంబంధించి 11 ప్రాజెక్టులుండే అవకాశం ఉంది.
దేవాదుల, రాజీవ్ బీమా, ఎస్సారెస్పీ రెండో దశ, నీల్వాయి, ర్యాలీ వాగు, మత్తడి వాగు, పాలెం వాగు, కుమురం భీం, జగన్నాథపూర్, పెద్ద వాగు, గొల్ల వాగు, వరద కాలువలకు నిధులు విడుదల కావొచ్చు. నిజానికి ఈ ప్రాజెక్టులకు కేంద్ర సాయం కింద గతేడాదే రూ.659.56 కోట్లు రావాల్సి ఉన్నా కేంద్రం విడుదల చేయలేదు. మరి ప్రస్తుత ఏడాది మొత్తం నిధుల్లో 10 శాతం ఒక్క రాష్ట్రానికే ఇస్తారా అన్నది సందేహమే.
ఏఐబీపీ ప్రాజెక్టులన్నీ 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని కేంద్రం పేర్కొనగా, రాష్ట్రంలోని 11 ప్రాజెక్టుల్లో వరద కాల్వ మినహా పదింటిని ఈ ఏడాది మార్చి నాటికే పూర్తి చేయాల్సి ఉంది. దీంతో నిధులు మంజూరు చేస్తేనే ప్రాజెక్టుల పూర్తి సాధ్యం కానుంది.
చెక్ డ్యామ్‌లకు వస్తాయో రావో..?
‘హర్ ఖేత్‌కో పానీ’ కింద మైనర్ ఇరిగేషన్, వాటర్‌షెడ్ పథకాలకు రూ.2,600 కోట్లను కేంద్రం కేటాయించింది. ఇందులో మిషన్ కాకతీయకు నిధులు దక్కే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఖమ్మంలో 66, మెదక్‌లో 45, నల్లగొండలో 36 చెరువుల పనులకు గానూ మరమ్మతులు, పునరుద్ధరణ, పునరావాసం (ఆర్‌ఆర్‌ఆర్) పథకం కింద కేంద్రం రూ.162 కోట్లు మంజూరు చేసింది. ఇప్పుడూ అదే మాదిరి నిధులు రావొచ్చని నీటి పారుదల వర్గాలు చెబుతున్నాయి.
ఇక వాటర్‌షెడ్ పథకాల కింద నిర్మిస్తున్న చెక్ డ్యామ్‌లకు నిధులు దక్కుతాయో లేదో వేచి చూడాలి. నదుల అనుసంధాన సమగ్ర ప్రాజెక్టు నివేదికల తయారీకి రూ.225 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో మహానది–గోదావరి, గోదావరి–కావేరీ నదుల అనుసంధాన ప్రతిపాదన ఉండనుంది. ఇక భూగర్భజలాల నిర్వహణకు రూ.450 కోట్లు కేటాయించగా వాటి నుంచి రాష్ట్రానికి నిధులొస్తాయన్న ఆశేమీ లేదు.