
నేటి నుంచి మళ్లీ కూల్చివేతలు
అక్రమ భవనాల కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ అధికారులు మరోమారు సిద్ధమవుతున్నారు.
ప్రజావాణిలో కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడి
172 భవనాల నిర్మాణంలో భారీ అక్రమాలు
అవినీతికి పాల్పడిన అధికారులనూ వదలం
కొనుగోలు చేసే ముందు ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
ఎన్ కన్వెన్షన్‌పై కోర్టు ఉత్తర్వు అందలేదు
సాక్షి, హైదరాబాద్:
అక్రమ భవనాల కూల్చివేతలకు జీహెచ్‌ఎంసీ అధికారులు మరోమారు సిద్ధమవుతున్నారు. ఇటీవలే గురుకుల్ ట్రస్ట్, అయ్యప్పసొసైటీలో అక్రమంగా నిర్మించిన భవనాలను కూల్చివేసిన అధికారులు తాజాగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో మంగళవారం కూల్చివేత చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమ నిర్మాణాలపై నిఘా వేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు 890 అక్రమ నిర్మాణాలను గుర్తించడంతో పాటు వాటికి సంబంధించి రిజిస్టర్లు కూడా తయారు చేశారు. వాటిల్లో భారీ అక్రమాలకు పాల్పడిన 172 భవనాలను కూల్చివేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా మంగళవారం కొన్నింటి కూల్చివేతలు చేపట్టనున్నారు. ఈ విషయాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ తెలిపారు. సోమవారం ‘ప్రజావాణి’ అనంతరం మీడియాతో మాట్లాడారు.
భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు సైతం అక్రమాల జోలికి వెళ్లవద్దని హెచ్చరించారు. అధికారులు లంచాలు తీసుకుని ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే ఎప్పటికైనా ముప్పేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. అక్రమాలను ప్రోత్సహించిన అధికారులపై కఠినచర్యలు తీసుకుంటామని చెప్పారు. జీ ప్లస్ ఐదంతస్తుల వరకు ఇకపై జోనల్ స్థాయిలోనే అనుమతులిచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేవారికి వీలైనంత త్వరితంగా అనుమతులు మంజూరు చేస్తామన్నారు.
ఎన్ కన్వెన్షన్‌పై..
ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు సంబంధించి తమకింకా కోర్టు ఉత్తర్వు అందలేదని, అందగానే తగు చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టు తీర్పు కాపీ జాప్యంపై అడ్వొకేట్ జనరల్ సూచన మేరకు నడచుకుంటామన్నారు.
స్లమ్ ఫ్రీసిటీ..
స్లమ్‌ఫ్రీసిటీలో భాగంగా రాబోయే పదిరోజుల్లో పైలట్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు. ఎంపిక చేసే ఒకటి రెండు స్లమ్స్‌లో పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తామని తెలిపారు. పాదచారుల నిమిత్తం ఏర్పాటు చేయబోయే 50 ఎఫ్‌ఓబీల్లో ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు, అవసరాల దృష్ట్యా లిఫ్ట్‌లున్నవి, ఎస్కలేటర్‌వి, సైవాక్‌వి, మాన్యువల్‌వి ఉంటాయన్నారు.
గురుకుల్ ట్రస్టులో కొనసాగుతున్న సర్వే
గురుకుల్ ట్రస్టులో సర్వే కొనసాగుతోంది. ఐదు బృందాలు వారం రోజులుగా సర్వే చేస్తున్న విషయం తెలిసిందే. అయ్యప్ప సొసైటీలో ప్లాట్లు, భవనాలు 950, యజమానులు 1600 మంది ఉన్నట్లు గుర్తించారు. సర్వే ఆఫ్ ఇండియా లేఅవుట్‌లో భవనాలను గుర్తించినప్పటికీ ప్లాట్ల సరిహద్దులు సరిగ్గా లేకపోవడంతో సర్వే చేయడంలో జాప్యం జగుతుందని జీహెచ్‌ఎంసీ సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ మహేందర్ తెలిపారు. గురుకుల్ ట్రస్టులోని ఖాళీ స్థలాల్లో సర్వే చేయడం సులభం కాదని, రెవెన్యూ అధికారులే సరిహద్దులు నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. సర్వే కొనసాగుతున్నప్పటికీ ఖాళీ స్థలాలు, విస్తీర్ణం గుర్తింపులో జాప్యమేర్పడుతుందని చెప్పారు. గురుకుల్ ట్రస్టులోని ఎన్ కన్వెన్షన్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉన్నతాధికారుల అదేశాల మేరకు తాము చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.