
గ్రేటర్‌లోఆస్తిపన్ను పెంపునకు రంగం సిద్ధం
గ్రేటర్ ప్రజలపై ఆస్తిపన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఓ వైపు ఖజానా నిల్వలు రోజురోజుకూ తగ్గడం... మరోవైపు చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ్యయం వందల కోట్ల రూపాయల్లో ఉండటం...
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ప్రజలపై ఆస్తిపన్ను భారం మోపేందుకు రంగం సిద్ధమైంది. ఓ వైపు ఖజానా నిల్వలు రోజురోజుకూ తగ్గడం... మరోవైపు చేపట్టాల్సిన ప్రాజెక్టుల వ్యయం వందల కోట్ల రూపాయల్లో ఉండటం... ఇప్పటికే ఆస్తి పన్ను జాబితాలో లేని ఇళ్లు, నివాస భవనాల్లో కొనసాగుతున్న వాణిజ్య భవనాల గుర్తింపు వంటి చర్యలు చేపట్టిన జీహెచ్‌ఎంసీ ఆస్తిపన్నును సైతం పెంచక తప్పదనే నిర్ణయానికి వచ్చింది.
జీహెచ్‌ఎంసీలో 2002 తర్వాత నివాస గృహాలకు, 2007 అనంతరం వాణిజ్య భవనాలకు ఆస్తి పన్ను పెంచలేదు. నాటితో పోలిస్తే నేడు అన్నింటి ధ రలు ఎన్నో రెట్లు పెరిగాయి. ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు ఆస్తిపన్ను రివిజన్ చేస్తామని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సైతం ప్రకటించారు. ఈ క్రమంలో పన్ను పెంపు కోసం అవసరమైన రివిజన్‌కు అనుమతించాల్సిందిగా ఇటీవల ప్రభుత్వానికి జీహెచ్‌ఎంసీ లేఖ రాసింది. దీనికి ప్రభుత్వ అనుమతి లాంఛనమే!
శాస్త్రీయంగా సర్వే...
గత ఏప్రిల్ నుంచి 7,912 భవనాలను కొత్తగా ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.10.86 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలాంటి అంశాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు... పన్ను పెంపు కోసం శాస్త్రీయంగా సర్వే జరపాలని నిర్ణయించారు. రివిజన్ చేసేందుకు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. గ్రేటర్‌లోని ఆయా ప్రాంతాల్లోని స్థలాల డిమాండ్, మౌలిక సదుపాయాలు, వసతులు, సంపన్న ప్రాంతాలు, పేద వాడలు, జోన్, లొకేషన్, భవనం తీరు మొదలైన వాటికనుగుణంగా ఆయా ప్రాంతాల్లోని వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ)లను అంచనా వేసి ఆస్తిపన్ను సవరించనున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. వాస్తవానికి ఏటా ఆస్తి పన్ను పెంచాల్సి ఉందన్నారు. అయితే పన్ను వసూళ్లలో లోపాలను సరిదిద్దుతూ, లొసుగుల్ని సవరిస్తూ అంతర్గత సామర్థ్యం మెరుగుపరుచుకోవడం వంటి చర్యలతో ఏటికేడు ఆదాయం పెంచుకోవడం తప్ప పెంపు జోలికెళ్లలేదన్నారు.
ఆస్తి పన్ను పెంపు ప్రతిపాదన మూడేళ్ల కిందటే వచ్చినా... ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆలోచనతో విరమించుకున్నారు. పెంచి చాలా కాలమైనందున ఇప్పుడా పరిస్థితి రాదని జీహెచ్‌ఎంసీ భావిస్తోంది. అయితే... పేదలుండే ప్రాంతాల్లో ఎక్కువ భారం పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకునే యోచనలో ఉన్నారు. పన్ను పెంపు ప్రతిపాదనలను ప్రజల ముందుంచి నెల రోజుల పాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఒకవేళ పెంచితే జీహెచ్‌ఎంసీకి ఆస్తి పన్నుపై వచ్చే ఆదాయం దాదాపు రెట్టింపవుతుందని అంచనా. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేందుకు దాదాపు ఐదారు నెలలు పట్టవచ్చని అధికారులు అంటున్నారు.