క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు | cricket betting gang caught by police | Sakshi
Sakshi News home page

క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

Oct 8 2013 3:09 AM | Updated on Sep 1 2017 11:26 PM

ఐపీఎల్, ఐసీఎల్ మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం

కుషాయిగూడ, న్యూస్‌లైన్: ఐపీఎల్, ఐసీఎల్ మ్యాచ్‌లతో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టును ఎస్‌ఓటీ పోలీసులు సోమవారం రట్టు చేశారు. నగర శివారు జీడిమెట్లను కేంద్రంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ ముఠా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) ప్రత్యేకాధికారి కె.గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. ప్రకారం.. సైబరాబాద్ కమిషనర్ సి.వి.ఆనంద్ ఆదేశాలతో జీడిమెట్లలోని ఓ బెట్టింగ్ కేంద్రంపై సోమవారం పోలీసులు దాడి చేశారు. రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐసీఎల్ మ్యాచ్‌కు సంబంధించిన బెట్టింగ్ జోరుగా సాగుతున్నట్లు గుర్తించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎల్‌ఈడీ టీవీ, ఇన్వర్టర్, ‘డెల్’ల్యాప్‌టాప్‌తో పాటు 18 సెల్‌ఫోన్‌లు, బైక్, రూ.13,440 నగదు, రూ.2లక్షల మేరకు బెట్టింగ్ జరిగిన బ్యాంకు అక్కౌంట్ బుక్కును స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నుంచి సెల్‌ఫోన్‌లు, కంప్యూటర్ ద్వారా సుధీర్ అనే వ్యక్తి ఈ రాకెట్‌ను నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
 ‘బెట్టింగ్’ సాగుతుంది ఇలా...
 సుధీర్ బంధువు కృష్ణా జిల్లా గంపలగూడెం ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన దివ్వెల సత్యనారాయణ(29) లెక్చరర్. ఈయన కేవలం క్రికెట్ ‘బెట్టింగ్ అడ్డా’ కోసం ఐదు నెలల క్రితం జీడిమెట్లలో ఓ గదిని అద్దెకు తీసుకుని బెట్టింగ్‌కు కావాల్సిన పరికరాలు సమకూర్చుకున్నాడు. అప్పటికే సుధీర్ మారు పేరుతో యాక్సిస్ బ్యాంకులో అకౌంట్ తీసుకుని నగదు జమయ్యేలా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. ప్రధాన లైన్ గన్నవరానికి చెందిన సుధీర్ వద్ద ఉండగా, సబ్‌లైన్ సత్యనారాయణ నడిపేవాడు. మరో ఏడుగురు నిర్ణీత నంబరులో వచ్చే ఫోన్ కాల్స్ రికార్డు, బెట్టింగ్ నగదు బదిలీ వంటి పనులు చేసేవారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేసే మైలవరం నివాసి కట్టెబోయిన శివాజీ, పుల్లూరుకి చెందిన వజ్రాల వెంకటేశ్వర్‌రెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన నాగవెంకట్‌రెడ్డి, ప.గో.జిల్లాకు చెందిన కొప్పాక ఆనంద్‌కుమార్, మైలవరానికి చెందిన ఏరువ వేణుగోపాల్‌రెడ్డి, ఖమ్మం జిల్లావాసి మందపల్లి మధుసూదన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన సిబ్బందికి రివార్డులు ప్రకటించనున్నట్లు ఇన్‌స్పెక్టర్‌లు సీహెచ్ కుషాల్కర్, కె.చంద్రశేఖర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐలు నాగరాజు, గోపీనాథ్, రమేష్, ఎస్‌ఓటీ సిబ్బంది పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement