రైతన్నలు గెలిచేదెలా?

K Ramachandra Murthy Article On Rythu Bandhu Scheme - Sakshi

ఈ దేశంలో రైతు జీవితం దుర్భరం. 1995 నుంచి రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు.  వ్యవస్థీకృతం కాని వ్యవసాయరంగంలో ఎంత సంక్షోభం నెలకొన్నా ఉద్యమాలు రగలవు. రైతులు ప్రదర్శన చేశారంటే వారిలో సహనం పూర్తిగా నశించిందని అనుకోవాలి. కొన్ని మాసాలుగా దేశంలో రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. మహారాష్ట్రలో వేలాదిమంది రైతులు 160 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ముంబయ్‌ చేరుకొని నిరసన ప్రదర్శన చేశారు. తమిళనాడు రైతులు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదనే వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు మెడలో పుర్రెల దండలు వేసుకొని, నోళ్ళతో సజీవంగా ఉన్న ఎలుకలను పట్టుకొని వినూ త్నంగా ప్రదర్శన చేశారు.  వైద్యులూ, లాయర్లూ, టీచర్లూ, వివిధ రంగా లకు చెందిన యువతీయువకులు భోజనాలూ, నీళ్ళూ సరఫరా చేయడం ద్వారా ఢిల్లీ వీధులలో ఊరేగింపు జరిపిన వేలాదిమంది రైతులకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు మాఫ్‌ చేయాలనీ, కనీస మద్దతు  ధర (మినిమమ్‌ సపోర్ట్‌ ప్రైస్‌–ఎంఎస్‌పీ)ను న్యాయంగా నిర్ణయించాలనీ, పెట్టుబడికి సాయం చేయాలనీ వారు ఉద్ఘోషించారు. 2019 ఎన్నికలలో గెలుపొందాలంటే రైతులను శాంతింపజేయడం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకీ స్పష్టంగా తెలుసు. రైతులకు ఏ రకమైన సహాయం చేయాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాలి.

అందుకే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు సమీకరించాలని ఎన్‌డీఏ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. కేంద్రానికీ, ఆర్‌బీఐకీ మధ్య వివాదం తలెత్తడానికి ఇదే ప్రధాన కారణం. తమకు నిధుల  నిల్వలు ఉండాలనీ, ప్రభుత్వానికి ఇవ్వలేమనీ ఆర్‌బీఐ గవర్నర్లు వాదిస్తున్నారు. అంతలేసి నిధులు ఆర్‌బీఐలో మూలుగుతూ ఉండటం ఎందుకనీ, వాటిని సర్క్యులేషన్‌లో పెట్టాలనీ, అభివృద్ధికోసం ఖర్చు చేయాలనీ (సంక్షేమం అనడం లేదు) ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ నొక్కి చెబుతున్నారు. ఈ వాదనతో వేగలేకనే ఆర్థికవేత్త ఊర్జిత్‌పటేల్‌ ఆర్‌బీఐ గవర్నర్‌ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన ఐఏఎస్‌ అధికారి శక్తికాంతదాస్‌ ఎంతకాలం పదవిలో  ఉంటారో తెలియదు. ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని రఘురాంరాజన్‌ వంటి ఆర్థికవేత్తలూ, మాజీ గవర్నర్లూ ప్రబోధిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతోంది. అందుకే మాజీ గవర్నర్‌ బిమల్‌జలాన్‌ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు.

కనీస నిల్వలు ఏ మేరకు ఉంటే ఆర్‌బీఐకి ఇబ్బంది ఉండదో నిర్ణయించ వలసిందిగా ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. నయానో, భయానో ఆర్‌బీఐ నుంచి నిధులు సేకరించినప్పటికీ వాటిని రైతులకు ఏ రూపంలో, ఏ పథకం కింద అందజేయాలో మోదీ ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్థికంగా శక్తికి మించిన భారంగా కాకుండా, రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండే పథకం కోసం అన్వేషణ కొంతకాలంగా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణలను విశ్వసించే ప్రవీణులు రైతుల  రుణాలను మాఫ్‌ చేయడాన్ని ఆమోదించరు. వైఎస్‌  రాజ శేఖరరెడ్డి ఒత్తిడి చేయడం వల్ల 2004లో ఆంధ్రప్రదేశ్‌లో  రైతు రుణ మాఫీకి నాటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కష్టం మీద ఒప్పుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ. 77 వేల కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫ్‌ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన మోదీ ఆచరణలో చేయవలసినంత చేయలేకపోయారు. 22 పంటలకు పెట్టుబడిపైన ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటించానంటూ శని వారంనాడు ఉత్తరప్రదేశ్‌ ఘాజీబాద్‌ బహిరంగసభలో మోదీ చెప్పారు. కానీ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో డాక్టర్‌ స్వామినాధన్‌ సూచించిన పద్ధతిని అనుసరించలేదు. పెట్టుబడి వ్యయం అంటే కేవలం విత్తనాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాల ఖర్చు మాత్రమే కాదు. ఆ ఖర్చుతోపాటు పొలంలో పని చేసే వ్యక్తులందరి వార్షిక  వేతనాలనూ, పొలం అద్దెకు (కౌలుకు)  ఇస్తే సాలీనా ఎంత ఆదాయం వస్తుందో ఆ మొత్తాన్నీ, పంట బీమాకోసం చెల్లించవలసిన మొత్తాన్నీ కూడితే వచ్చే మొత్తానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాధన్‌ చెప్పారు. అది జరగలేదు.

కేసీఆర్‌ మోడల్‌
రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం రెండు లక్షల మేరకు రుణం మాఫ్‌ చేస్తామంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విస్తృత ప్రచారాన్ని రైతులు విశ్వసించడమే. అధికారంలోకి వచ్చిన పది రోజులలో రుణాలు మాఫ్‌ చేస్తానంటూ రాహుల్‌ వాగ్దానం చేశారు. అన్నట్టుగానే మూడు రాష్ట్రాలలో కొత్త ముఖ్యమంత్రులు కమల్‌నా«ద్, భూపేశ్‌ బఘేల, అశోక్‌ గహ్లోత్‌లు రుణాలు మాఫ్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులను సుముఖం చేసుకోవడం ఎన్‌డీఏకి అత్యవసరం. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పాలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) చేసినట్టు పెట్టుబడి సాయం అందజేయాలా? స్వామినాధన్‌ చెప్పినట్టు రైతు పెట్టుబడి పోగా యాభై శాతం లాభం మిగిలే విధంగా మద్దతు ధర నిర్ణయించి, మద్దతు ధరకూ, మార్కెట్‌ ధరకూ ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లించాలా? కేంద్ర రాష్ట్రాలు  కలసి భర్తీ చేయాలా? రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్న మోదీని కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ యాత్రలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుసుకున్నారు. 

నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోగా అంత భారీ మెజారిటీలతో అన్ని సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) గెలవడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, అన్ని పార్టీల నాయకులకూ ఉండటం సహజం. బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 వరకూ మోదీతో కేసీఆర్‌ సమావేశమైనారు. ఇతర విషయాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్‌ చెప్పింది ఆలకించిన వెంటనే మోదీ రంగంలో దిగారు. అదే రోజు రాత్రి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌లను పిలిపించుకొని సుదీర్ఘ సమాలోచన చేశారు. మర్నాడు ప్రధాని కార్యాలయం (పీఎంవో)  సంబంధిత శాఖల అధికారులను సమ న్వయం చేసి అభిప్రాయాలు సేకరించింది. కసరత్తు జరుగుతోంది. 

వాగ్దానం చేయగానే సరిపోదు
రుణమాఫీ ప్రకటించడం సులువే. అమలు కష్టం. తెలంగాణలో వాయిదాలలో రుణాలు ప్రభుత్వం తీర్చింది. ఒకేసారి మాఫ్‌ చేస్తే బాగుండేదని రైతుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అంత మొత్తం సిద్ధంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అన్యాయం.  2014 జూన్‌8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు  రైతులపైన ఉన్న రుణభారం రూ. 87,612 కోట్లు. అంత భారీ రుణం తీర్చే స్థోమత కొత్త రాష్ట్రానికి ఉండదనే ఉద్దేశంతో రుణమాఫీ వాగ్దానం చేయడానికి వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సంకోచించారు. చంద్రబాబు నిస్సంకోచంగా వాగ్దానం చేసి గెలిచాక ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించడానికి అనేక అడ్డదారులు తొక్కవలసి వచ్చింది. అర్హతపైనా, చెల్లింపులపైనా పరిమితులు విధించి దాన్ని రూ. 24 వేల కోట్లకు కుదించారు.

అంటే, వాగ్దానం చేసిన మొత్తంలో నాలు గింట ఒక వంతుకు తగ్గించారు. అది కూడా వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకూ మూడు విడతలలో చెల్లించిన మొత్తం రూ. 15,147 కోట్లు మాత్రమేనని చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. ఈ సంవత్సరం వాయిదా ఇంతవరకూ చెల్లించలేదు. కొత్తగా కాంగ్రెస్‌ పాలనలోకి వచ్చిన మూడు హిందీ రాష్ట్రాలలో కూడా రైతుల రుణాలు మాఫ్‌ చేయాలంటే ఖజానాలో డబ్బు లేదు. బయటి నుంచి అప్పు తీసుకొని తీర్చవలసిందే. ఉదాహరణకు, రాజస్థాన్‌లో 2018–19 బడ్జెట్‌ వ్యయం మొత్తం రూ. 1,07, 865 కోట్లు. అందులో 70 శాతం నిధులు వసుంధరే రాజే ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతుల రుణాలు మొత్తం రూ. 18 వేల కోట్లు. ఈ మొత్తం రుణాల మాఫీకి కేటాయిస్తే  రాష్ట్ర సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత ఏడు మాసాలలోనే నాలుగింట మూడు వంతుల బడ్జెట్‌ బీజేపీ ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అందుకే నిష్క్ర మించేముందు బీజేపీ ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేశాయంటూ కమల్‌నాథ్, గహ్లోత్‌ ఆరోపించారు. 

కేరళ ప్రయోగం
రుణమాఫీకి మోదీ సుముఖంగా లేరని ఉత్తరప్రదేశ్‌ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌పైన చేసిన విమర్శ స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్‌ రుణ మాఫీ పేరుతో రైతులకు లాలీపాప్‌లు ఇచ్చి మోసం చేస్తున్నదనీ, అబద్ధాలు చెబుతున్నదనీ మోదీ ధ్వజమెత్తారు. ఏదో ఒక రూపంలో రైతులకు సాయం చేయవలసిన అవసరం మాత్రం ఉంది. 2006  కేరళ రైతుకు నరకం చూపించిన సంవత్సరం. కేరళలో వాణిజ్య పంటలు అధికం. రబ్బర్, మిరియం పండించి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ సంవత్సరం అంతర్జాతీయ విపణిలో ఈ రెండు పంటల ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులపైన అప్పుల భారం పెరిగింది. దాదాపు 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన రైతుల భార్యలతో ఢిల్లీలో జరిగిన ఊరేగింపునకు ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్‌ నాయకత్వం వహించారు. అప్పుడే యూడీఎఫ్‌ ప్రభుత్వం నిష్క్రమించి అచ్యుతానందన్‌ నాయకత్వంలో ఎల్‌డీఎఫ్‌ సర్కార్‌ ప్రవేశించింది. వామపక్ష ఆర్థికవేత్త ప్రభాత్‌ పట్నాయక్‌ను ఆయన కేరళ ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడిగా నియమించి రైతు సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. మన రాష్ట్రాలలో వలె కాకుండా కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ సుస్థిరంగా ఉంది. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాల విమోచన కమిషన్‌ను నియ మించింది. రైతు ప్రతినిధులూ, వ్యవసాయరంగ నిపుణులూ, సామాజిక కార్య కర్తలూ, రాజకీయ  నాయకులూ కలసి బృందాలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి, రుణగ్రస్తులైన రైతులతో, వారికి రుణాలు ఇచ్చిన సహకార బ్యాంకుల అధికారులతో సమాలోచనలు చేసి ఏ మేరకు మాఫ్‌ చేయాలో అక్కడికక్కడే నిర్ణయించేవారు. సహకార బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళకు వెళ్ళి వడ్డీ వ్యాపారులలాగా అవమానించరు. బృంద సభ్యులు రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ చొరవ ఫలితంగా బలవన్మరణాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. 

తెలంగాణ అమలు చేస్తున్న పథకం చూసి జార్ఖండ్‌ ప్రభుత్వం కూడా రైతుబంధును పోలిన పథకం డిసెంబర్‌ 21న ప్రవేశపెట్టింది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తొలి బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. ఆ మర్నాడు ఒడిశా ప్రభుత్వం రైతుబంధులో స్వల్ప మార్పులు చేసి కొత్త పథకం ప్రకటించింది. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. భూమి ఎవరి పేరున ఉంటే వారి పేరనే చెక్కు ఇస్తున్నారు. భూమిపైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎనిమిది వేల చొప్పున చెల్లిస్తున్నారు. రుణభారంతో వేగలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో దాదాపు 75 శాతం కౌలు రైతులే. అటువంటి రైతులు తెలంగాణలో 15 లక్షల మంది ఉంటారని అంచనా. భూమి యజమానికీ, కౌలురైతుకీ మధ్య ప్రభుత్వం ఒక వారధిగా ఉంటూ యాజ మాన్య సమస్య ఉత్పన్నం కాకుండా, యజమానికి అభద్రతాభావం లేకుండా కౌలురైతుకు బ్యాంకు రుణాలు అందేవిధంగా, రైతుబంధు వంటి పథకం వర్తించే విధంగా ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టవలసిన బాధ్యత ఉన్నది. రైతు బంధు నమూనాను అమలు చేయాలని మోదీ తలపెట్టిన ట్లయితే ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నిజంగా రుణగ్రస్తులైనవారిని ఆదుకున్నట్టు అవు తుంది. పంట దిగుబడికి గిట్టుబాటు ధర చెల్లించడంతో పాటు ప్రాసెసింగ్‌ వ్యవస్థనూ, మార్కెటింగ్‌ సదుపాయాలనూ కల్పించగలిగితే రైతులు గౌరవ ప్రదంగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి.


త్రికాలమ్‌
కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top