వడివడి అడుగులు!

Guest Column By Ramachandra Murthy Over Cabinet Expansion - Sakshi

త్రికాలమ్‌

రహస్య మంతనాలు లేవు. సుదీర్ఘమైన సమాలోచనలు లేవు. వీడియో కాన్ఫ రెన్స్‌లు లేవు. ఊహాగానాలు లేవు. శషభిషలు లేవు.  ఒత్తిళ్ళు లేవు. ముందుకూ, వెనక్కూ లాగడాలు లేవు. చివరి క్షణంలో నిర్ణయాలు మార్చడాలూ, పేర్లు చేర్చడాలూ, తొలగించడాలూ లేవు. సస్పెన్స్‌ అసలే లేదు.  ఎన్నికలలో అభ్య ర్థులను ఖరారు చేయడం, మంత్రివర్గంలో సభ్యులను నిర్ణయించడం, వారికి శాఖలు కేటాయించడం ఇంత తేలికా? అని ఆశ్చర్యబోయే విధంగా పనులు కంప్యూటర్‌లో ప్రోగ్రామింగ్‌ చేసినట్టు సాఫీగా, చకచకా జరిగిపోవడం పరిశీ లకులకు విస్తుగొలుపుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి అనేక కీలకమైన నిర్ణయాలు అలవోకగా తీసుకుంటున్న తీరు ఇది వరకు ఎన్నడూ కనలేదు. వినలేదు.

స్వభావ రీత్యా జగన్‌ ఆలోచనా విధానం సరళంగా, సూటిగా ఉండటం వల్ల అనాయాసంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించాలి. నవ్యాంధ్ర ప్రభుత్వ పగ్గాలు చేతపట్టినప్పటి నుంచి ముఖ్యమైన స్థానాలలో అధికారులను నియ మించడం, వారికి తగిన బాధ్యతలు అప్పగించడం మొదలుకొని మంత్రులను నియమించి వారికి సముచితమైన శాఖలు అప్పగించడం వరకూ జరిగిన పరి ణామాలను పరిశీలిస్తే పూసల్లో దారంలాగా ఒక విధానం గోచరిస్తుంది. జగన్‌ నిర్ణయాలపైన ప్రభావం చూపే మూడు అంశాలు గమనించవచ్చు. ఒకటి– ప్రజాస్వామ్య స్ఫూర్తి. రెండు– సామాజిక న్యాయ సూత్రం. మూడు– విధేయత.  

భాగస్వామ్యస్ఫూర్తి
ప్రజాస్వామ్యం సార్థకం కావాలంటే ప్రజలందరికీ తగిన ప్రాతినిధ్యం, భాగ స్వామ్యం ఉన్నదనే అనుభూతి కలగాలి. అమెరికా అధ్యక్షుడు అబ్రహాం లింకన్‌ గెటిస్‌బర్గ్‌ ప్రసంగంలో ప్రజాస్వామ్యాన్ని ‘ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల యొక్క పరిపాలనా వ్యవస్థ (గవర్నమెంట్‌ ఆఫ్‌ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్‌ ద పీపుల్‌)’గా అభివర్ణించడంలోని ఆంతర్యం ఇదే. ఈ అంతరార్థాన్ని జగన్‌ గ్రహించడమే కాకుండా సాధ్యమైనంత మేరకు అమలు పరచాలనే పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ లెజిస్లేచర్‌ పార్టీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రకటించినప్పుడు జాతీయ స్థాయి ఇంగ్లీషు చానళ్ళు విశేషవార్తగా ప్రసారం చేశాయి.

తొలి ప్రధాని పండిట్‌ నెహ్రూ మంత్రిమండలిలో వల్లభ్‌భాయ్‌ పటేల్‌ ఉపప్రధానిగా ఉండే వారు. చివరి ఉపప్రధాని లాల్‌కృష్ణ అడ్వాణీ. మన్మోహన్‌సింగ్‌కూ, నరేంద్ర మోదీకీ ఉపప్రధానులు లేరు. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి 1956లో ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేసినప్పుడు పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి పదవిలో ఉంటే తెలంగాణకు చెందిన నాయకుడు ఉపముఖ్యమంత్రిగా ఉండాలని నియమం పెట్టుకున్నారు. ఎందుకు? తెలంగాణ ప్రజలకు కూడా తమ ప్రతినిధి ఉన్నత, నిర్ణాయక స్థాయిలో ఉన్నారనే ఒక భాగస్వామ్య భావన కలుగుతుంది. ఈ సూక్ష్మం అర్థం చేసుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి ఉపముఖ్యమంత్రిని ఆరో వేలుతో పోల్చి అపహాస్యం చేశారు.

ఉప ముఖ్య మంత్రిని నియమిస్తే ముఖ్యమంత్రిగా తన అధికారానికి భంగం వాటిల్లుతుందని అపార్థం చేసుకొని ఆదిలోనే హంసపాదు అన్నట్టు తెలంగాణ ప్రజల మనస్సులలో అనుమాన బీజాలు తొలినాళ్ళలోనే నాటారు. బిహార్‌లో జేడీ(యు) అధినేత నితీశ్‌కుమార్‌ ముఖ్యమంత్రి. బీజేపీ నాయకుడు సుశీల్‌  కుమార్‌ మోదీ ఉపముఖ్యమంత్రి. నవ్యాంధ్ర తొలి ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా బీసీ నాయకుడు కేఈ కృష్ణమూర్తి, కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప ఉన్నారు. వీరిలో ఒకరు రాయలసీమలోని కర్నూలుకు చెందినవారైతే మరొకరు కోస్తాంధ్ర లోని తూర్పుగోదావరి జిల్లా నాయకులు. తెలంగాణ తొలి ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రిగా మొదట రాజయ్య, అనంతరం శ్రీహరి ఉండేవారు. ముస్లింల ప్రతినిధిగా మహమ్మద్‌ మహమూద్‌ అలీ పని చేశారు రెండో ప్రభుత్వంలో శ్రీహరి లేరు. అలీ ఉన్నారు కానీ ఉపముఖ్యమంత్రి హోదా లేదు. ఒక్కో సామాజికవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా సదరు సామాజిక వర్గానికి ప్రభుత్వంలో పాల్గొంటున్నామనే భరోసా ఇచ్చినట్టు అవుతుందనీ, ఇతర సామాజికవర్గాలతో సమానంగా ఆ సామాజికవర్గాలను కూడా పరిగణించి గౌరవించినట్టు అవుతుందనీ జగన్‌ భావించి ఉంటారు.

అందుకే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా బీసీలకూ (పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌), దళితులకూ (కళత్తూరు నారాయణస్వామి), ఆదివాసీలకూ (పాముల పుష్పశ్రీవాణి), ముస్లింలకూ (అంజద్‌ బాషా), కాపులకూ (ఆళ్ళ నాని) ఉపముఖ్యమంత్రి పద వులు కేటాయించాలన్న అసాధారణమైన నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా ఒక మహిళకు హోంశాఖ కేటాయించడంలో తండ్రి వైఎస్‌ను ఆదర్శంగా తీసుకున్నారు. సబితా ఇంద్రారెడ్డికి వైఎస్‌ హోంశాఖ అప్పగించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయినారు. ఆ తర్వాత ప్రజలను చకితులను చేసిన నాయకుడు నరేంద్రమోదీ. నిర్మలాసీతారామన్‌కు రక్షణ శాఖ, తాజాగా ఆర్థిక శాఖ కేటాయించి ముఖ్యమైన శాఖలపైన పురుషాధిక్యాన్ని అంతం చేశారు. మేకతోటి సుచరితకు హోంశాఖ ఇవ్వడం ఒక ప్రయోగం. సుచరిత సబిత లాగా అగ్రవర్ణానికి చెందిన ఆడపడుచు కాదు. దళిత మహిళ.

అణగారిన వర్గాల ప్రతినిధులకు ముఖ్యమైన బాధ్యతలు అప్పగించి ఆయా సామాజికవర్గాలలో సమర్థులైన నాయకులు ఎదిగి రావడానికి అవకాశం కల్పించడం దార్శనికుల లక్షణం. అత్యధిక స్థానాలు గెలుచుకున్న రెడ్లతో సమానంగా కాపులకు కూడా నాలుగు స్థానాలు కల్పించడం విశేషం. బీసీలలో చేర్చవలసిందిగా కొంత కాలంగా ఉద్యమం చేస్తున్న కాపు నాయకులను అస్తిత్వ సమస్య వెంటాడుతూ వస్తున్నది. ఉపముఖ్యమంత్రి పదవి కొనసాగించడం వల్ల వారిలో భద్రతాభావం పెరుగవచ్చు. పాతికమంది మంత్రులలో ఎనిమిది మంది వెనుకబడిన కులాల వారూ, అయిదుగురు దళితులూ ఉండటం (దామాషా లెక్కన చూస్తే) తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదే ప్రథమం. శాఖల కేటాయింపులో కూడా అగ్రవర్ణాలవారి కంటే వెనుకబడిన కులాలకు చెందినవారికీ, దళితులకూ, ఆదివాసీ మహిళకూ ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మంత్రివర్గంలో సామాజిక సమీకరణాలను బడుగువర్గాలకు సానుకూలంగా ఇంత పకడ్బందీగా ఎవ్వరూ సాధించలేక పోయారు. దీన్నంతటినీ చారిత్రక సందర్భంగా పరిగణించాలి. 

విధేయులకే అందలం
కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ధిక్కరించి పార్టీ నుంచి నిష్క్రమించి కొత్త కుంపటి పెట్టుకున్న పరీక్షా సమయంలో తనకు తోడుగా నిలిచి, తనతోపాటు నడిచిన నాయకుల పట్ల విశ్వాసం ఉంచి వారికి మంత్రి పదవులు ఇవ్వడం మరో విశేషం. తనను నమ్మినవారికి ఉపకారం చేయడం ఫక్తు వైఎస్‌ తరహా రాజ కీయం. అందుకే వైఎస్‌ పట్ల రాజకీయవాదులకే కాకుండా రాజకీయాలతో సంబంధంలేని అనేకమందికీ వల్లమాలిన అభిమానం. సోనియాతో విభేదించి జగన్‌ కొత్త పార్టీ పెట్టుకున్నప్పుడు మంత్రి పదవులను బేఖాతరు చేసి కాంగ్రెస్‌ నుంచి వైదొలగిన నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌. బాలినేని ఎంఎల్‌ఏగా గెలిచి మంత్రిపదవి అందుకున్నారు. బోస్‌ వైఎస్‌ఆర్‌సీపీ టిక్కెట్టుపైన 2012, 2014, 2019లో పోటీ చేసి ఓడిపోయారు. 2014 పరాజయం తర్వాత ఎంఎల్‌సీగా ఎన్నికైనారు.

మోపిదేవి వెంకటరమణారావు మంత్రి పదవి కోల్పోయి జైలులో కొంతకాలం ఉన్నారు. వైఎస్‌ కుటుంబానికి పరమ విధేయుడు. రేపల్లె నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ మత్స్యకారుల ప్రతినిధిగా మంత్రివర్గంలో చోటు దక్కింది. మంత్రిగా, వక్తగా ధర్మాన ప్రసాద రావు ప్రసిద్ధుడు. వైఎస్‌ మంత్రివర్గంలో ముఖ్యుడు. జగన్‌తో పాటు ప్రసాద రావు కాంగ్రెస్‌ని వీడి రాలేదు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో కొనసాగారు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్‌ మాత్రం కాంగ్రెస్‌ నుంచి వైదొలిగి వైఎస్‌ ఆర్‌సీపీలో చేరిపోయారు. ఈ సారి ఎన్నికలలో సోదరులు ఇద్దరూ గెలుపొం దారు. కానీ మంత్రిపదవి ప్రసాదరావును కాకుండా కృష్ణదాస్‌ను వరించింది.  సుచరిత కూడా జగన్‌ బాటలో నడిచి ఉపఎన్నిక ఎదుర్కొన్నారు. నెల్లూరు లోక్‌ సభ స్థానాన్ని వదులుకొని కాంగ్రెస్‌కి బైబై చెప్పి వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన మేకపాటి రాజమోహనరెడ్డి ఉపఎన్నికలోనూ, 2014లోనూ గెలిచారు.

 ఈ సారి ఎన్నికలలో పోటీ చేయలేదు. ఆయన కుమారుడు గౌతమ్‌రెడ్డిని జగన్‌ పరిశ్రమల మంత్రి చేశారు. ఇరిగేషన్‌ వంటి అత్యంత ప్రధానమైన శాఖ పొందిన అనిల్‌ కుమార్‌ యాదవ్‌ నెల్లూరు సిటీలో నారాయణను ఓడించిన ధీరుడు. అనిల్‌ కుమార్, పుష్పశ్రీవాణి, ఆదిమూలం సురేష్, కొడాలినానీ, అంజద్‌బాషా, గుమ్మ నూరు జయరాం, కళత్తూరు నారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వంటి శాసన సభ్యులు 2014లో కూడా గెలిచి టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా జగన్‌తో పాటు నడిచిన విధేయులు. అందుకే మంత్రి పదవులు దక్కాయి. చిత్తూరు జిల్లాలో మొత్తం 13 స్థానాలు గెలిపించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మంత్రి పదవీ, ఆయన కుమారుడు మిధున్‌రెడ్డికి లోక్‌సభలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకత్వం అప్పగించారు. తనతోపాటు జైలు జీవితం, ఇతర  కష్టాలూ, నష్టాలూ సమా నంగా పంచుకున్న విజయసాయిరెడ్డికి పార్లమెంటరీపార్టీ నేతగా సముచిత స్థానం కల్పించారు.  స్పీకర్‌గా ఎన్నిక కాబోతున్న  తమ్మినేని సీతారాం బీసీ. ఆయన శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస  నుంచి ఐదు విడతలుగా శాసన సభకు ఎన్నికైనారు. గతంలో మంత్రిగా పనిచేశారు. మొదటి నుంచి వైఎస్‌ఆర్‌ సీపీని అంటిపెట్టుకొని ఉన్న నాయకుడు.
 
నిజాయితీపరులైన అధికారుల ఎంపిక

మంత్రుల ప్రమాణం కంటే ముందు అనేకమంది ఉన్నతాధికారులను బదిలీ చేశారు. ఈ నియామకాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్‌కల్లం సూచనల మేరకు జరిగాయి. నిజాయితీ పరులుగా, సమర్థులుగా, సేవాతత్పరులుగా పేరు తెచ్చుకున్న అధికారులనే కీలకమైన పదవులలో నియమించారు. ఎన్నికల ప్రచారంలో, ప్రణాళికలో వాగ్దానం చేసినట్టు ఆశావర్కర్ల జీతం మూడు వేల నుంచి పదివేలకు పెంచే ఉత్తర్వుపైన శనివారంనాడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న వెంటనే తొలి సంతకం చేశారు. ఉద్యోగులకు ఆందోళన కలిగిస్తున్న సీపీఎస్‌ను రద్దు చేయ డానికి ముఖ్యమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారు.

తాత్కాలిక సహాయం (ఇంటీరియం రిలీఫ్‌) ఇచ్చేందుకు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకూ యువ ముఖ్యమంత్రి పని నల్లేరు మీద బండిలాగానే వేగంగా సాగింది. ఒకే విడతలో ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించడం, ఒకే ఊపులో మంత్రి వర్గాన్ని పూర్తిగా నిర్మించడం, మంత్రులు ప్రమాణం చేసిన వెంటనే వారికి శాఖలు కేటాయించడం, మంత్రులు ప్రమాణం చేయడానికి ఒక రోజు ముందు గానే లెజిస్లేచర్‌పార్టీ సమావేశం నిర్వహించి తన మనసులోని మాట భావో ద్వేగంగా చెప్పడం వంటి అనేక కొత్త పోకడలు కనిపించాయి. రెండున్నర సంవ త్సరాల తర్వాత తొంభై శాతం మంది మంత్రులు వైదొలిగి వారి స్థానంలో కొత్తవారు వస్తారనేది మరో ప్రయోగం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయమై అధ్యయనం చేయడానికి ఆంజనేయరెడ్డి నాయకత్వంలో ఒక కమిటీని నియమిం చాలన్న నిర్ణయం ఆహ్వానించదగినదే.

ఆయనకు లోగడ ఏపీఎస్‌ఆర్‌టీసీ ఎండీగా పని చేసిన అనుభవం ఉన్నది. ఇరిగేషన్‌ ప్రాజెక్టులలో అవినీతికి ఆస్కారం ఉన్నదనే మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. టెండర్లను పిలవ డంలో, ఖరారు చేయడంలో పారదర్శకత పాటించబోతున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అవసరమైన సందర్భాలలో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను అమలు చేస్తామనీ, అవినీతికి ఆస్కారం లేకుండా సకల చర్యలూ తీసుకుం టామనీ చెప్పారు. అవినీతిలో కూరుకొని ఉన్న రాష్ట్ర పరిపాలనా యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాలన్న సంకల్పం ఉదాత్తమైనదే. దానిని సాకారం చేయాలంటే నాయకత్వానికి దృఢదీక్ష ఉండటంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం సహకారం అవసరం.

నైతిక విలువలకు పెద్దపీట వేసే ఉన్నతాధికారులూ, ముఖ్యమంత్రి ప్రకటించిన చర్యలతో సంతుష్టులైనట్టు కనిపిస్తున్న ప్రభుత్వోద్యోగులూ, రాజ కీయ నాయకులూ ఏకోన్ముఖదీక్షతో కృషి చేసినప్పుడే నవశకోదయం సాధ్యం. ఇక  నుంచీ ప్రతి అడుగూ ఆచితూచి వేయాలి. సంక్షేమంతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలి. నిధులు కేటాయించగలగాలి. సంపద సృష్టించే వ్యవస్థను ఆవిష్కరించాలి. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. వైఎస్‌కు లేని సౌలభ్యం జగన్‌కు ఉన్నది. వైఎస్‌కు కాంగ్రెస్‌ అధిష్ఠానదేవత నెత్తిపైన ఉండేది. జగన్‌ను ప్రశ్నించేవారు లేరు. అందుకే జాగ్రత్తగా అడుగులేయాలి.

కె. రామచంద్ర మూర్తి
వ్యాసకర్త

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top