
ఇది.. మా హక్కు!
సడ్డా హక్.. అంటే పంజాబీలో ‘మా హక్కు’ అని అర్థం. అందుకే సోషల్ జర్నలిజానికి ఓ ప్లాట్‌ఫామ్ వేసింది ఈ ‘సడ్డా హక్’ అనే వెబ్‌జర్నల్. అయితే దీన్ని నడిపిస్తోంది తలపండిన పండితులు కాదు.
సడ్డా హక్.. అంటే పంజాబీలో ‘మా హక్కు’ అని అర్థం. అందుకే సోషల్ జర్నలిజానికి ఓ ప్లాట్‌ఫామ్ వేసింది ఈ ‘సడ్డా హక్’ అనే వెబ్‌జర్నల్. అయితే దీన్ని నడిపిస్తోంది తలపండిన పండితులు కాదు. సమస్యను గుర్తించే చైతన్యం, వాటి పరిష్కారం కోసం తపన ఉన్న యువత! అందరికన్నా భిన్నమైన దారి వెదుక్కున్న ఈ స్పెషల్ జర్నీ డ్రైవర్ పేరు పల్లవ్. హైదరాబాదీ. ఐఐఎం కోల్‌కతాలో ఎంబీఏ చేశాడు. అమెరికాలో మంచి ఉద్యోగం, ఆల్ హ్యాపీస్. అయితే ఏడాది క్రితం ఉత్తరాఖండ్‌లో బీభత్సం సృష్టించిన జలవిలయం వార్తలు అతడ్ని కదిలించాయి. వరద బాధితులకు సాయం చేయాలనుకున్నాడు. కానీ ఎవరిని కాంటాక్ట్ చేయాలో తెలుసుకోవడం గగనమైపోయింది. స్నేహితుల ద్వారా తాననుకున్నది చేయగలిగాడు. సాయం చేసే మార్గం కోసం పడిన కష్టం పల్లవ్‌లో కొత్త ఆలోచనకు ఊపిరి పోసింది.
సడక్ టు సడ్డా హక్
తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడున్న తన స్నేహితులతో ఇదే విషయంపై చర్చించాడు. ‘వార్తలు ఇవ్వడానికి బోలెడన్ని చానళ్లు, వార్తాపత్రికలు ఉన్నాయి. కానీ మన స్పందనను కరెక్ట్‌గా కనెక్ట్ చేయలేకపోతున్నాయి’ అని తన అనుభవాన్ని పంచుకున్నాడు. పల్లవ్ వాదనతో అందరూ ఏకీభవించారు. ‘వీటిని అధిగమిస్తూ విభిన్నంగా మనమే ఓ వెబ్ జర్నల్ మొదలుపెడితే’ బావుంటుందన్నాడు. ‘ఈ వెబ్ జర్నల్‌లో పనిచేయడానికి సామాజిక సమస్యల మీద అవగాహన, ఆసక్తి ఉన్న ఎవరైనా అర్హులే. దేశవ్యాప్తంగా ఉన్న రిపోర్టర్లను స్వచ్ఛందంగా ఆహ్వానిద్దాం.
వాళ్లు ఎక్కడ ఏం జరిగినా ఈ వెబ్‌లో పోస్ట్ చేసేలా ప్లాన్ చేద్దామ’ని చెప్పుకొచ్చాడు. ‘కేవలం న్యూసే కాదు.. సిటీలో చారిటీ ఈవెంట్లకు ఈ వెబ్ జర్నల్ హెల్ప్ చేస్తుంది. ఈవెంట్ చేయదలచిన వారు ఫోన్ నంబర్ ఇందులో పెడితే చాలు. దాన్ని ఈవెంట్ ఆర్గనైజర్స్ పంపించి వాళ్లిద్దరూ కాంటాక్ట్ అయ్యేలా ప్లాన్ చేద్దాం. ప్రజాసమస్యలకు సంబంధించి ఏదైనా రీడర్ స్పందించి పరిష్కారం కోసం ఈ వెబ్ జర్నల్‌లో పిటిషన్ కూడా వేయొచ్చు. ఆ అంశానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో కూడా అప్‌డేట్ చేద్దాం. పలు సమస్యలను చర్చకు తీసుకొద్దాం. ఏదైనా సోషల్‌కాజ్‌పై ఇంట్రెస్ట్ ఉన్న సెలబ్రిటీలతో రీడర్స్‌కు ఆన్‌లైన్‌లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఏర్పాటు చేద్దాం’ అంటూ స్నేహితుల వైపు చూశాడు. అప్పటి వరకూ ఊ కొడుతూ విన్న మిత్రబృందం పల్లవ్ ఐడియాకు స్వాగతం పలికారు.
రీడ్.. రైట్.. ఎంగేజ్..
2013, డిసెంబర్‌లో సడ్డా హక్ స్టార్ట్ అయింది. రీడ్.. రైట్.. ఎంగేజ్ అనే నినాదమెత్తుకుని లక్ష పైన వ్యూస్‌తో ఎలాంటి బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. వాలంటరీ రిపోర్టర్స్ మొదలు పేరుమోసిన పత్రికల మాజీ ఎడిటర్ల దాకా సడ్డా హక్‌లో వార్తలు రాస్తున్నారు. చర్చలు, ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. పిటిషన్లు వేస్తున్నారు (న్యూఢిల్లీలో కొందరు దాడి చేసిన ఘటనలో మరణించిన అరుణాచల్‌ప్రదేశ్ కుర్రాడు నిడో తానియా ఇష్యూ మీద 20 వేల పిటిషన్లు దాఖలయ్యాయి). హక్కులు, బాధ్యతలు మరిచిపోని ఈ టీమ్‌ని చూస్తుంటే యూత్‌కి దూకుడే కాదు సాలోచనా ఉంటుందని అర్థమవుతోంది.
- సరస్వతి రమ