ఆయన వారిని  అమ్మా అని పిలిచాడు

Women have introduced jesus to the world - Sakshi

బైబిల్‌  స్త్రీలు

క్రీస్తును ప్రపంచానికి పరిచయం చేసింది స్త్రీలే. క్రీస్తు బోధలనీ, క్రీస్తు దైవత్వాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళిందీ స్త్రీలే. క్రైస్తవంలో స్త్రీలకు గుర్తించదగ్గ స్వేచ్చ ఉంది. కారణం క్రీస్తు బ్రతికున్న రోజుల్లో స్త్రీల మధ్యన ఎక్కువగా పరిచర్య చేయడం.  పురుషాధిక్యత ఉన్న యూదా జాతిలో కన్యక అయిన మరియ అనే స్త్రీ, క్రీస్తును కనడానికి ముందుకొచ్చింది. క్రీస్తుకు తల్లిగా మారేందుకు తనని తాను తగ్గించుకుని గాబ్రియేల్‌ అనే దూత చెప్పినట్టు విన్నది. దేవునికి లోబడతానని తన విధేయతతో ప్రపంచానికి క్రీస్తును పరిచయం చేసింది. పెళ్లి కాకుండా గర్భం దాల్చిన స్త్రీగా ఎన్నో అవమానాలను ఎదుర్కొంది. యోసేపుకు ప్రధానం చేయబడ్డ ఆమెను, ఒకానొక సమయంలో అవమాన భారం వల్ల యోసేపే వదిలేయాలనుకున్నాడు. అయినా లేఖనాలలో రాయబడ్డట్టు జరిగేందుకు తన సమ్మతిని తెలియజేయడమే కాదు ఆమె అన్ని పరిస్థితులలో దృఢనిశ్చయంతో ఉంది. 

పురుషాధిక్యత గల యూదా సమాజంలో పురుషులతో స్త్రీలు బహిరంగంగా మాట్లాడడం నిషేధం. క్రీస్తు మగ్ధలేన అనే ప్రాంతానికి చెందిన స్త్రీని దోపిడీగాళ్ల  చేతులలో నుండి విడిపిస్తాడు. అప్పటినుంచి మగ్ధలేన మరియ క్రీస్తుతో పాటే ఉంది. క్రీస్తు పరిచర్యలో తనవంతు పాత్రను పోషించింది. క్రీస్తు పరిచర్య చేస్తూ వెళ్ళిన ప్రాంతాల్లో స్త్రీలను సమావేశపరుస్తూ, క్రీస్తును గురించి అనేకులకి చెబుతూ క్రీస్తు కోసం సాక్షిగా నిలబడింది. ఆమె క్రీస్తును ఎంతగా ఆరాధించిందంటే.. క్రీస్తు సిలువ వేయబడిన  మూడోరోజున ఆయన దేహానికి సుగంధద్రవ్యాలు పూయడానికి  తనతోపాటు మరికొందరు స్త్రీలను తీసుకుని పొద్దు పొడవకముందే సమాధి దగ్గరకు చేరుకుంది. సమాధిలో క్రీస్తు కనపడలేదని భయపడింది. దేవదూత ద్వారా ఆయన పునరుత్థానాన్ని గురించి తెలుసుకుని, క్రీస్తు చనిపోయి తిరిగి లేచాడన్న వార్తా ఆమే మొదటగా చేరవేసింది. 

క్రీస్తును తమ కుటుంబంలో ఒకరిగా చేర్చుకుని, ఆయన బేతనీ అనే ప్రాంతానికి వచ్చినప్పుడల్లా తమ గృహంలో ఆతిథ్యం ఇచ్చారు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు. వాళ్లు మార్త, మరియలు. క్రీస్తు బేతనియకి వచ్చినప్పుడల్లా వాళ్ళింట్లో బస చేసే వాడు. వారి సహోదరుడు లాజరుతో క్రీస్తుకు మంచి స్నేహం. క్రీస్తు చెప్పే మాటలు వినడానికి వాళ్లు ఎంతో ఆసక్తి చూపేవాళ్లు. ఒకానొక సమయంలో లాజరు అకారణంగా చనిపోయాడు. క్రీస్తు మూడు రోజులయ్యాక ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వారు ఆయనకీ విషయాన్ని తెలియజేస్తారు. లాజరును తిరిగి బతికిస్తాడు క్రీస్తు. ఇక అప్పటినుంచి ఇద్దరు అక్కా చెల్లెళ్లు క్రీస్తును ఘనపరిచి ఆయన ప్రేమ తత్వాన్ని ప్రచారంచేసారు. 

సమరయులు యూదులకన్నా జాతి పరంగా చిన్న వాళ్లు. క్రీస్తు పరిచర్య చేస్తున్న రోజుల్లో సమరయ గ్రామాల వైపు వెళ్తూ వాళ్లకు కావలసిన సహాయాన్ని, సహకారాన్ని అందించేవాడు. ఒకానొక సమయంలో ఒక  సమరయ స్త్రీ బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమయంలో క్రీస్తు అటుగా వెళ్లాడు. తాగడానికి నీళ్లిమ్మని అడిగాడు. ఆమె యూదుడైన క్రీస్తు తనని నీళ్లడగటం చూసి తన గతాన్ని చూసి క్రీస్తు తనని అసహ్యించుకుంటాడని భయపడింది. కాని క్రీస్తు ఆమెకి బుద్ధి వాక్యాన్ని బోధించాడు. తాను క్రీస్తు అనే విషయాన్ని ఆమెకి తెలిసేలా చేసాడు. ఆమె పరుగెత్తుకుంటూ ఊళ్లోకి వెళ్ళింది. క్రీస్తు గురించి ఊరంతా తెలిసేలా ఆయన కోసం గొప్ప సాక్షిగా మారింది. 

పన్నెండు ఏళ్ళుగా రక్తస్రావం ఆగక బాధపడుతున్న ఓ స్త్రీ ఒక నిర్ణయం తీసుకుంది. యేసు ప్రభువు తనకి స్వస్థతనివ్వాలంటే ఆయన ముందు ఉండాలి. ఆయనతో మాట్లాడాలి. కలవాలి. కాని అంతమంది జనంలో ఆమె ఆయన దగ్గర   ఆయన దగ్గరగా వెళ్ళలేదు కాబట్టి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను అని అనుకుంది. అలాగే చేసింది. వెంటనే రోగం బాగైంది.   ఓ రోజు వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని జనాలు రాళ్లు పట్టుకుని తరుముతూ వచ్చారు. ఆమె మీద రాళ్లు విసురుతున్నారు. ఇక ఆమెని చంపటమే తరువాయి. క్రీస్తు ఆమె దగ్గరకి వెళ్లి పడిపోయిన ఆమెని లేపాడు. రాళ్లు పట్టుకున్న వాళ్లను వారించాడు.పాపం చేయని వాడు ఆమె మీద మొదట రాయి వేయాలన్నాడు. అందరి పాపాలను నేల మీద రాయటం మొదలు పెట్టాడు. అంతే! అందరు ఎవరి పాపాలను వారు చూసుకుని భయపడి రాయి వదిలేసి పారిపోయారు. యేసు క్రీస్తు ఆ స్త్రీ దగ్గరకెళ్ళి ‘‘అమ్మా నీ మీద రాళ్ళేయడానికి వచ్చిన వాళ్లు ఎవరు లేరు. ఇక వెళ్ళు. ఇంకెప్పుడు పాపం చేయొద్దని ఆమెని విముక్తురాలిని చేసాడు. 

క్రీస్తు స్త్రీలందరినీ అమ్మా అనే పిలిచాడు. ఒకానొక సమయంలో మరియ అనే ఒక స్త్రీ, క్రీస్తు పరిసయ్యుల ఇంట్లో భోజనానికి కూర్చున్నప్పుడు అత్తరు బుడ్డి తెచ్చి అతని తల మీద పోసింది. శేరున్నర అత్తరు ఆమె జీవిత కాలం సంపాదించిన డబ్బుతో కొనినదైయుంటుంది. ఆమె తన కన్నీటితో క్రీస్తు పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలు తుడిచి అత్తరు పూసింది. ఆమె చేసిన పని ఎంత గొప్పదో క్రీస్తు చెప్తూ ఆమె ప్రేమ ఎంత గొప్పదో అందుకే అంత గొప్పగా ఆయన్ని సన్మానించుకుందని చెప్తాడు. అది క్రీస్తు వల్ల తన జీవితంలో జరిగిన  గొప్ప మేలు వల్ల కావచ్చు లేదా క్రీస్తు మీద తనకున్న వల్లమాలిన ప్రేమ కావచ్చు.  యేసు క్రీస్తు పుట్టినప్పుడు అన్నా అనే ప్రవక్తి క్రీస్తును దేవాలయంలో చూసింది. ఆయన పుట్టుక గురించిన ప్రవచనం తనకి ముందే తెలుసునని, క్రీస్తుని చూడడానికే అంత ముదుసలిదైన తాను బతికే ఉందని చెప్తుంది. క్రీస్తును తన చేతుల్లోకి ఎత్తుకుని శుభవచనాలు పలుకుతూ పరలోకపు తండ్రికి ప్రార్థన చేస్తుంది. ఎంతోమంది స్త్రీలకు క్రీస్తు చాలా ఆత్మీయుడిగా ఉన్నాడు. ఆయనకు స్త్రీ పురుష భేదం ఉన్నట్టు ఎక్కడా కనపడదు. ఆయన తనలోని మాతృత్వాన్ని ప్రేమగా చూపించడంవల్లే చాలామంది స్త్రీలు పరిచర్య చేయడానికి ఇష్టపడి ఉంటారు. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీలనైనా, ఎలాంటి స్త్రీలు తన దగ్గరకి వచ్చినా ఆయన వాళ్లని ‘అమ్మా’ అని సంబోధించేవాడు. క్రీస్తు తత్వమే ఆయనని చాలామంది ఆత్మీయుడిగా చేసింది. ఆ స్త్రీలందరూ ఆయనని ఘనపరిచి అనేకులకి ఆయన్ని పరిచయం చేస్తూ ఆయన ప్రేమకి సాక్షులుగా నిలుచున్నారు. 
- మెర్సీ మార్గరెట్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top