దూత హిత వాక్య ప్రశస్తి

Telugu Literature: Doctor Sri Rangacharya Remember Bharavi - Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం

సకిం సభా సాధు న శాస్తి యోధిపం
హితాన్నయస్సం శృణుతే సకిం ప్రభుః
సదానకూలేషుహి కుర్వతే రతిం
నృపేష్వమాత్యేషుచ సర్వ సంపదః

సంస్కృత సాహిత్యంలో ప్రఖ్యాతుడైన భారవి మహాకవి రచించిన 1030 శ్లోకాల 18 సర్గల మహాకావ్యం కిరాతార్జునీయం. మహాభారత కథను ఇతివృత్తంగా గ్రహించి ఆలంకారిక శైలికి మార్గదర్శకంగా నిలిచింది ఈ కావ్యం. పద అర్థ సంపదల యందు గణనీయమైనది కాబట్టే ‘భారవేరర్థ గౌరవం’ అనే సార్థకమైన రచన ఇది. మల్లినాథుని వంటి మహా వ్యాఖ్యాత దీన్ని గొప్ప రచనగా అభివర్ణించాడు. దీనికి 36 వ్యాఖ్యానాలు వచ్చినాయి. ఇదంతా కావ్య ప్రాధాన్య సంక్షేప పరిచయమైతే– ప్రథమ సర్గలో– ద్వైతవనంలో వున్న ధర్మరాజు, దుర్యోధను పరిపాలన గూర్చి తెలుసుకొని రమ్మని పంపిన వనేచరుడు– విచ్చేసి– దుర్యోధన రాజ్య పాలన విశేషాలను యథార్థ కథనం చేస్తూ దాదాపు 25 శ్లోకాలను చెప్పినాడు. 

ఇక్కడ మనం గమనించవలసింది రాజు ఇష్ట సఖుడు ఎట్లుండవలెనో తెల్పటమే గాక– దీనిలోని ధర్మరాజు ఒక దేశాధినేత, వనేచరుడు అతని ఇష్ట స్నేహితుడు– ఆయన తెల్పుతున్న దుర్యోధన రాజ్యపాలనా రీతి– ఒక ప్రతిపక్ష నాయకుడు పరిపాలిస్తున్న రాజ్యం గూర్చి చెప్పటం. ఇక్కడి వనేచరుడు మన భారవియే. ఆయన రాజనీతి విశారదుడు. సంస్కృత సాహిత్యంలో రాజనీతి ప్రధానంగా వున్న ఏకైక రచన కిరాతార్జునీయం. ఆనాటి(6వ శతాబ్దం) తన ఆశ్రయ దాతకు మంత్రాలోచన చెప్పే వ్యక్తిగా ప్రధానపాత్ర వహించినాడు. అందుకే ప్రతి శ్లోకం ఒక ఆణిముత్యం. ఒక మహోపదేశం.

ప్రస్తుత శ్లోకం: ఓ రాజా! మంచి విషయాలను చెప్పి శాసించగలిగే సఖుడే నిజమైన సఖుడు. అట్లే తన యిష్ట సఖుడు చెప్పిన హితకరమైన మాటలను వినజాలని ప్రభువు ఒక ప్రభువా! మంత్రిగాని మిత్రడుగాని అప్రియ వాక్యాలను పలికి ప్రభువునకు ఆగ్రహము కల్గించి తమకు బాధ కలిగించుకోవటం శ్రేయస్కరం కాదు. ఇది సన్మిత్ర పద్ధతిలో చేరదు. తన ప్రభువునకు బాధ కలిగించుననే భావనతో యధార్థ విషయాలను దాచిపెట్టి, రాజు మనస్సునకు మంచియని భావించిన అసత్య విషయాలను చెప్పేవాడు కుత్సిత మిత్రుడేగాని సన్మిత్రుడు కాజాలడు. 

అట్లే మిత్రుడు తెల్పిన యధార్థ విషయాలను కటువుగా భావించక సహృదయంతో గమనించినవాడే ప్రభువు గాని, తదన్య భావన గలవాడై ప్రవర్తించిన రాజు ‘కుత్సిత’ ప్రభువు అనబడతాడు. అందుకే ప్రభువైనవాడు తన స్నేహితులతో బాగా కలిసియుండి పరస్పరానురక్తుడు కావలెను. అప్పుడే అతని సంపదలు నిలుస్తాయి. హితవాక్యములు అప్రియములైనా సరే ప్రభువుకు చెప్పవలసిందే. ప్రభువు కూడా హితాహిత జ్ఞాన విచక్షుడై ఉండవలెననేది సంక్షేపంగా ఈ శ్లోక భావన.

- డాక్టర్‌ శ్రీరంగాచార్య

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top