సంగీత, సాహితీ దిగ్గజాల వాణి

సంగీత, సాహితీ దిగ్గజాల వాణి


కొత్త పుస్తకం

 

ఇన్ని పత్రికలు, టీవీ చానళ్ళు లేని రోజుల్లో నిరక్షరాస్యులకు సైతం విజ్ఞానానికీ, వినోదానికీ రేడియోనే ఏకైక సాధనం. స్వతంత్ర భారతావని తొలినాళ్ళకు చెందిన తెలుగు సాహిత్య, సంగీత, సాంస్కృతిక ప్రముఖులందరికీ ఆకాశవాణి కేంద్రమే చలువ పందిరి. ఆ కార్యక్రమాలన్నీ కొన్ని తరాలను ప్రభావితం చేసినవే.  అయిదు దశాబ్దాలుగా రేడియోతో అనుబంధమున్న అనంత పద్మనాభరావు అక్షర రూపమిచ్చిన ‘అలనాటి ఆకాశవాణి’ కబుర్ల నుంచి కొన్ని జ్ఞాపకాలు...

 

తెలుగు ప్రసారాలు ప్రారంభమై 76 సంవత్సరాలైంది. ఆకాశవాణి మదరాసు కేంద్రం 1938 జూన్ 1న మొదలైంది. అవిభక్త మదరాసు రాష్ట్ర రాజధాని నగరం చెన్నపట్టణం. అందువల్ల తెలుగు ప్రసారాలు అక్కడి నుండి జరిగేవి. ఎగ్మూర్‌లోని మార్షల్ రోడ్‌లో ఈస్ట్‌నూక్స్ మేడపై డాబా గదుల్లో రేడియో స్టేషన్ పెట్టడానికి వడ్రంగి పనులు, తాపీ పనులు చేసి స్టూడియో నిర్మాణం చేసి ఆస్‌బెస్టాస్ షీట్లు అమర్చారు. అది చూసిన వ్యక్తి డా॥బాలాంత్రపు రజనీకాంతరావు మనకు సజీవ సాక్షి. అప్పట్లో విద్యార్థి అయిన ఆయన తర్వాత అదే కేంద్రంలో ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా చేరడం చరిత్రలో భాగం. జూన్ 1న మదరాసు కేంద్రం నుండి ప్రసారమైన తొలి తెలుగు రేడియో నాటకం అనార్కలి. మొగలాయి వాతావరణం సృష్టించడానికి (శ్రవ్యమే అయినా) ఆ డాబా మీద గుండ్రని దిండ్లు, హుక్కాగొట్టాలను పెట్టుకొని దేవులపల్లి కృష్ణశాస్త్రి సలీంగా నటించారు. నలుగురు రచయితల నాటకాల ఆధారంగా ఆచంట జానకీరామ్ రేడియో స్క్రిప్టు ఏర్చికూర్చారు.



మదరాసు కేంద్రం ప్రారంభించిన సరిగ్గా 10 సంవత్సరాలకు 1948 డిసెంబర్1న విజయవాడ స్టేషన్ ప్రారంభించారు. ప్రసారాలు అప్పట్లో సాయంకాలం 5 గంటల 30 నిమిషాలకు మొదలయ్యేవి. విజయవాడ కేంద్ర విశిష్టత పింగళి లక్ష్మీకాంతం, బందా కనకలింగేశ్వరరావు వంటివారు పనిచేయడం. ‘రజని’ డెరైక్టర్‌గా పనిచేసిన 1971-76 మధ్యకాలం స్వర్ణయుగం. అప్పుడు విజయవాడ కేంద్రంలో ఎందరో సంగీత మూర్తులు. అక్కడ పనిచేసిన మల్లిక్ ‘అదిగో అల్లదివో..’, ‘తందనాన అహి..’ అనే అన్నమయ్య కీర్తనలకు స్వరరచన చేశారని చాలామందికి తెలియదు.



భద్రాద్రి రామయ్య కల్యాణం



తెలుగునాట ఆకాశవాణి కేంద్రాలు ప్రసారం చేసే ప్రత్యక్ష వ్యాఖ్యాన కార్యక్రమాలలో భద్రాచలం నుండి శ్రీరామనవమినాడు ప్రసారమయ్యే సీతారామచంద్ర కల్యాణం ప్రధానం. 1970 దశకంలో ఈ వ్యాఖ్యానాల కోసం శ్రోతలు ఉవ్విళ్లూరేవారు. గుంటూరు రైల్వేస్టేషన్లో ఓ పండితుడు రైలు దిగి రిక్షా వ్యక్తిని తమ ఇంటికి రమ్మని పిలిచారు. అతడు ఆ పండితుణ్ణి రిక్షా ఎక్కించుకొని మాటలు కలుపుతూ ఇరవై నిమిషాల్లో వారి ఇంటి వద్ద దించాడు. ఆ వ్యక్తి పది రూపాయలు తీసి రిక్షావాడి చేతుల్లో పెట్టారు. ‘వద్దు స్వామీ! భద్రాచల సీతారాముల్ని మా కళ్ల ముందు కనిపించేలా మీరు మాటలు చెప్పారు. డబ్బులు ఉంచండి స్వామీ!’ అని వెళ్లిపోయాడు. ఆ పండితుడెవరో కాదు - జమ్మలమడక మాధవరామశర్మ.



కడప జ్ఞాపకాలు



కడపలో కవి సమ్మేళనానికి ఆరుద్ర, శ్రీశ్రీ, సినారె, దాశరథి, పురిపండా, పుట్టపర్తి వంటి ప్రసిద్ధుల్ని ఆహ్వానించాం. ఎమర్జెన్సీ రోజులు. అందుకని ముందుగానే కవుల కవితల్ని చిత్రిక పట్టాము. ప్రభుత్వ వ్యతిరేక పదజాలాన్ని జల్లెడపట్టాం. శ్రీశ్రీ కవితలల్లలేదు. ‘‘ఇదుగో! అదుగో!’’ అంటూ హోటల్ గదిలోనే కాలక్షేపం చేస్తూ ఊరించారు. మాస్ అపీల్ కోసం సభలో శ్రీశ్రీని చివరి కవిగా వుంచాం. 10 నిమిషాల ముందు వారి వెనుకగా నుంచొని ‘‘కవిత!’’ అన్నాను మంద్ర స్వరంలో. ‘చెప్తాగా!’ అంటూ దాటవేశారు శ్రీశ్రీ. చివరిగా లేచి,‘మనదేమో నంబర్ వన్ డెమోక్రసీ/ఇదంతా హిపోక్రసీ’ అంటూ తూటాలు పేల్చారు. సభ చప్పట్లతో మారుమ్రోగింది.  

 

 అలనాటి ఆకాశవాణి

 డా. ఆర్. అనంతపద్మనాభరావు,

 ప్రతులకు: రచయిత, బి 408, సాయికృపా రెసిడెన్సీ,

 మోతీనగర్, హైదరాబాద్.

 ఫోన్: 040-23831112

 పేజీలు: 200, వెల: రూ. 180.

 

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top