దోమ రాలేదు.. దిగుబడి తగ్గలేదు..!

mosquito is the worst in the kharif crops in rice farmers. - Sakshi

రసాయనిక వ్యవసాయదారులు

7–8 సార్లు పురుగుల మందు కొట్టినా వరికి దోమపోటుతో తీవ్ర దిగుబడి నష్టం

ప్రకృతి సేద్యంలో వరికి సోకని దోమ.. దిగుబడి కూడా అధికమే..

ఇది ప్రకృతి వ్యవసాయదారుడు సుధాకర్‌ అనుభవం

రసాయనిక వ్యవసాయం చేసే వరి రైతుల పొలాల్లో ఈ ఖరీఫ్‌లో దోమ తీవ్రనష్టం కలిగించింది. ఎక్కువ సార్లు పురుగుల మందు పిచికారీ చేసినా పంట దెబ్బతిన్నది. కొన్నిచోట్ల అసలు పంటే చేతికి రాని పరిస్థితి. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న తన వరి పంటకు అసలు దోమే రాలేదని నలవాల సుధాకర్‌ అనే సీనియర్‌ రైతు సగర్వంగా చెబుతున్నారు. ద్రావణాలు, కషాయాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం తయారు చేసుకొని వాడుకోవటం వంటి పనులను ఓపికగా అలవాటు చేసుకోగలిగిన రైతులకు ప్రకృతి వ్యవసాయం లాభదాయకంగా, ఆరోగ్యదాయకంగా ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు..

‘తొలకరి జల్లుకు తడిసిన నేల... మట్టి పరిమళాలేమైపాయే.. వానపాములు, నత్తగుల్లలు భూమిలో ఎందుకు బతుకుత లేవు.. పత్తి మందుల గత్తర వాసనరా.. ఈ పంట పొలాల్లో..’ అంటూ ఓ కవి రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందులు పంట పొలాలకు ఎంతటి చేటు చేస్తున్నాయో వివరించారు. ప్రస్తుతం పంట పొలాలు చాలావరకు రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందుల బారిన పడుతున్నవే. అధికంగా పంట అధిక దిగుబడిని ఆశించి వారానికో మందు కొడుతున్న ఫలితంగా పచ్చని పంట భూములన్నీ విషపూరితమవుతున్నాయి. స్వచ్ఛమైన పంటకు బదులు, రోగాలకు దారితీసే కలుషితమైన ఆహార పదార్థాలను తినాల్సి వస్తోంది. పర్యావరణంలో సమతుల్యత కూడా దెబ్బతింటోంది. ఈ ఫలితంగానే ఈ ఏడాది ఖరీఫ్‌లో వరి పొలాల్లో దోమ విధ్వంసం సృష్టించింది. వరి దిగుబడులను తీవ్రంగా దెబ్బతీసింది. ఖర్చుకు వెనకాడకుండా వరుస పిచికారీలు చేసినా రైతులకు దుఃఖమే మిగిలింది.

దిగుబడి కూడా ఎక్కువే..
అయితే, ఎనిమిదేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న నలువాల సుధాకర్‌ పొలంలో మాత్రం వరికి దోమ సోకలేదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం మియాపూర్‌లోని పెర్కపల్లి వాస్తవ్యుడైన సుధాకర్‌ ఐదెకరాల్లో గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది 4 ఎకరాల్లో తెలంగాణ సోన, ఎకరంలో జైశ్రీరాం సన్నరకాల వరిని సాగు చేస్తున్నారు. ఎకరానికి 30 బస్తాల (70 కిలోల)కు ధాన్యం దిగుబడి తగ్గదని భరోసాతో ఉన్నారు. ప్రకృతి వ్యవసాయంలో మొదట దిగుబడి తక్కువగా వచ్చినా, కొద్ది ఏళ్లకు వరి దిగుబడి ఎకరానికి 30 బస్తాలకు పెరిగింది. ఈ ఏడాది రసాయనిక వ్యవసాయంలో కన్నా 5 బస్తాలు ఎక్కువగానే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఆయన పొలం చూస్తేనే అర్థమవుతుంది. ఈ పంటకు మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండడంతో సాగు లాభసాటిగానే ఉంది. ఎలాంటి హానికరమైన రసాయనాలు వాడకుండా, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక అవశేషాల్లేని ఆరోగ్యదాయకమైన, సంతృప్తికరమైన దిగుబడిని సుధాకర్‌ సాధిస్తున్నారు.

మియాపూర్‌ ప్రాంతంలో సాధారణ రసాయనిక సాగులో ఎకరానికి దాదాపు 40 బస్తాల వరి ధాన్యం పండుతుంది. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చే స్తే, మొదటి సంవత్సరంలో 20 నుంచి 25 బస్తాల వరకే వస్తాయి. కానీ, మూడు నుంచి ఐదు సంవత్సరాల్లో ఇవి 40 బస్తాలకు చేరుకొంటాయి. సాధారణ బియ్యానికి కిలో సుమారు రూ.30 ఉంటే, ప్రకృతి వ్యవసాయ బియ్యానికి స్థానికంగా కిలోకు సుమారు రూ.50ల ధర పలుకుతోంది. సాధారణ రసాయనిక పద్ధతిలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో ఎకరాకు రూ.8 నుంచి రూ.10 వేల వరకు పెట్టుబడి తగ్గుతుంది. ‘రసాయనిక వ్యవసాయం కొనసాగిస్తున్న వరి రైతు విషం తిని ప్రజలకు విషాహారాన్ని పంచుతున్నాడు.. కేన్సర్‌ రోగుల సంఖ్య పెరిగిపోవటం, సుగర్‌ రావటం, చిన్న వయసులోనే పళ్లు ఊడిపోవటం.. వంటి ఆరోగ్య సమస్యలన్నిటికీ రసాయనిక అవశేషాలున్న ఆహారమే కారణం.. రైతులు ఓపిక పెంచుకుంటే ప్రకృతి వ్యవసాయం కష్టమేమీ కాద’ని సుధాకర్‌ చెబుతున్నారు. ప్రభుత్వం మార్కెటింగ్‌ సదుపాయం కల్పించి ప్రోత్సహిస్తే ఎక్కువ మంది రైతులు ఈ దారిలోకి రావటానికి అవకాశం ఉందని ఆయన అంటున్నారు.

 మీ పంటే బాగుందంటున్నారు..
రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడే పద్ధతిలో వరి సాగు చేసిన పొలాల్లో దోమ బాగా నష్టం చేసింది. వారం వారం మందులు వేయటంతో పంట వేగంగా పెరుగుతుంది. చీడపీడలు కూడా తొందరగా ఆశిస్తాయి. ఈ ఏడాది 7–8 సార్లు పురుగుమందులు పిచికారీ చేశారు. మొత్తం ఖర్చు ఎకరానికి రూ. 20 వేల వరకు వచ్చింది. కానీ, దోమ వల్ల దిగుబడి 25 బస్తాలకు పడిపోయింది. అయితే.. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న మా పొలంలో వరికి ఈ సంవత్సరం అసలు దోమ రానే లేదు. వేప నూనె ఒకే ఒక్కసారి పిచికారీ చేశా. ఎప్పటిలాగా భూమిలో ఎకరానికి క్వింటా వేప పిండి వేశా. జీవామృతం, ఘనజీవామృతం వేశా.. నాకు మొత్తంగా ఎకరానికి రూ. 10 –11 వేలు ఖర్చయింది.

దిగుబడి వారికన్నా ఎక్కువగానే 30 బస్తాలు కచ్చితంగా వస్తుంది. ఆ రైతులు మా పంటను మొదట్లో ఎదుగుదల తక్కువగా ఉందనే వారు. ఇప్పుడు చివరకొచ్చే వరకు మీ పంటే బాగుందంటున్నారు. రైతులందరూ ఈ పద్ధతిలో సాగు చేస్తే, ఆరోగ్యకరమైన ఆహారపదార్థాలు తినే అవకాశం లభిస్తుంది. దిగుబడి లాభసాటిగా ఉంటుంది. పర్యావరణ సమస్య తలెత్తదు. భూమి విషపూరితం కాదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ‘పరంపరాగత్‌ కృషి వికాస్‌ యోజన’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రకారం రైతుకు ఎకరాకు రూ.15 వేలు ప్రోత్సాహకంగా ఇవ్వాలి. దీన్ని ఆచరణలోకి తీసుకురావాలి. మార్కెటింగ్‌ సౌకర్యం లేక ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్లు కూడా మానేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారు.

– నలువాల సుధాకర్‌ (98498 86034),
మియాపూర్, సుల్తానాబాద్‌ మండలం, పెద్దపల్లి జిల్లా
– ఆది వెంకట రమణారావు, స్టాఫ్‌ రిపోర్టర్, పెద్దపల్లి
ఫోటోలు : మర్రి సతీష్‌ కుమార్, ఫోటో జర్నలిస్టు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top