కుదురులేని వాడు క్యూబ్‌లో ఒదిగాడు 

Harsha is the winner of the National Level Rubik Cube - Sakshi

రూబిక్‌ స్టార్‌

అమెరికాలో జాతీయ స్థాయిరూబిక్‌ క్యూబ్‌ పోటీల్లో విజేతగా నిలిచినపాలడుగు హర్ష  హైదరాబాద్‌ వచ్చి,తన లాంటి పిల్లలకు రూబిక్‌ క్యూబ్‌ గేమ్‌మీద ఆసక్తి పెంచేందుకు ఓ ప్రత్యేకఈవెంట్‌ ఏర్పాటు చేశాడు. అతడి హైపర్‌యాక్టివ్‌నెస్‌కి తండ్రి కనిపెట్టిన రూబిక్‌ గేమ్‌ పరిష్కారమే... అమెరికాలో ఏ తెలుగు కుర్రాడికీ దక్కని ఘనతను హర్షకు సాధ్యం చేసింది!

ఒకప్పుడు పిల్లలు చురుకుగా ఉండడం లేదనేదే ఎక్కువగా పెద్దవాళ్ల ఫిర్యాదుగా ఉండేది. అయితే ఇప్పుడు ‘మా వాడు హైపర్‌ యాక్టివ్‌ అండీ. ఏం చేయాలో తెలియడం లేదు’’ అనే పేరెంట్స్‌ కోకొల్లలు. కారణాలేవైనా గాని.. దీనికి రూబిక్‌ క్యూబ్‌ గేమ్‌ను ఒక మంచి పరిష్కారం అని కనుగొన్నారు అమెరికాలో ఉంటున్న పాలడుగు శ్రీకాంత్‌. ఈ గేమ్‌లో రాణిస్తున్న తమ కుమారుడు హర్ష ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ఆయన క్యూబ్‌ గేమ్‌ మీద రోజు మొత్తం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ సందర్భంగా హర్షతో ముచ్చటించినప్పుడు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 

హైపర్‌ టూ... సూపర్‌
‘‘మాది ఆంధ్రప్రదేశ్‌. (తండ్రి కాకినాడ, తల్లి విశాఖపట్టణం) చిన్నప్పుడు తన పదేళ్ల వయసులో నాన్న క్యూబ్‌ గేమ్‌ ట్రై చేశారట. కొంత కాలం దాని మీద  ఇష్టంతో ఆడి తర్వాత వదిలేశారు. చిన్నప్పటి నుంచీ నేను హైపర్‌యాక్టివ్‌గా ఉండేవాడిని. దేనిపై సరిగా ఫోకస్‌ ఉండేది కాదు. నాలో ఫోకస్‌ పెంచడానికి ఏ గేమ్‌ సరిగా ఉపయోగపడుతుందా అని నాన్న ఆలోచించి, చిన్నప్పుడే నాకు క్యూబ్‌ కొనిచ్చారు. మొదట్లో నేను అంత ఆసక్తి చూపలేదు. కొన్ని రోజులు ఆడి వదిలేశా. అయితే అనుకోకుండా నా ఫ్రెండ్‌ కూడా ఇదే ఆట మొదలుపెట్టగానే ఇద్దరం పోటా పోటీగా ఆడడం, అలా అలా కాంపిటీషన్స్‌కి కూడా వెళ్లడం, గెలవడం మొదలైంది. రెండేళ్ల క్రితం ఆగస్ట్‌ 27న మిషిగన్‌ క్యూబింగ్‌ క్లబ్‌ నిర్వహించిన పోటీలో  గెలిచాను, ఇప్పుడు అమెరికాలో ఫస్ట్‌ ర్యాంక్, వరల్డ్‌ వైడ్‌గా 6వ ర్యాంక్‌ సాధించాను. 

చదువు మెరుగయింది
ఒక క్యూబ్స్‌ సాల్వ్‌ చేయాలంటే వందల అల్గోరిథెమ్స్‌ అవసరం. దీని వల్ల బ్రెయిన్‌ డెవలప్‌మెంట్, ఫింగర్స్‌ మూవ్‌మెంట్స్‌ వల్ల నర్వ్స్‌ అన్నీ యాక్టివేట్‌ అవుతాయి. ఈ గేమ్‌ని నిరంతరం ప్రాక్టీస్‌ చేస్తుండడం వల్ల నా చురుకుదనం క్రమబద్ధం అయింది. ఏకాగ్రత  పెరిగింది. కళ్లు, మైండ్, చేతులు అన్నింటి సమన్వయం వచ్చింది.  ఫైనల్‌గా  దీని వల్ల స్టడీస్‌లో కూడా బాగా బెటర్‌ అయ్యా.  సాధారణ ఆటగాడి నుంచి ఛాంపియన్‌ కావాలంటే.. విపరీతమైన ఏకాగ్రత కావాలి. మీకు తెలుసా? ఇందులో ప్రావీణ్యం సంపాదించిన ఆటగాళ్లు ఆటలోకి దిగి ఒక్కసారి క్యూబ్‌ని చూశాక దాన్ని అచ్చం అలాగే మైండ్‌లో ప్రింట్‌ చేసుకుంటారు. ఆ తర్వాత  చేతుల్లో ఉన్న క్యూబ్‌ కనిపించదు. మైండ్‌ గేమ్‌ మాత్రమే ఉంటుంది. చేతుల్లో క్యూబ్‌ కనిపిస్తే ఆడలేం. దీనిని బ్లైండ్‌ కిడ్స్‌ ఇంకా బాగా ఆడగలగడానికి కారణం వాళ్లకి ఫోకస్‌ మరింత బాగా ఉండడమే. పెద్దయ్యాక డాక్టర్‌ అవ్వాలనేది నా లక్ష్యం. 

పిల్లలకు ఆసక్తి కల్పించాలి
అమెరికాలో దేశవ్యాప్తంగా ఈ గేమ్‌కు సంబంధించి నెలకు 50 వరకూ జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరుగుతుంటాయి. మనకు చాలా తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం మరింత తక్కువ. ఇది విద్యార్ధి దశలోని పిల్లలకు బాగా ఉపయుక్తమైంది. అందుకే దీన్ని వీలున్నంతగా ప్రమోట్‌ చేయాలని ఈవెంట్స్‌ నిర్వహిస్తున్నాం. ఈ శిక్షణ, పోటీల ఈవెంట్స్‌ ద్వారా వచ్చిన విరాళాలు, ఫీజులు రూపంలో  సేకరించిన నిధులు పూర్తిగా కేన్సర్‌ వ్యాధి బాధిత చిన్నారుల కోసం కృషి చేసే ల్యుకేమియా అండ్‌ లింఫోమా సొసైటీకి అందిస్తున్నాం’’ అని తెలిపారు హర్ష.

– ఎస్‌.సత్యబాబు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top