తొలకరి లేత గడ్డితో జాగ్రత్త!

Dairy Farmers Awareness on Rain Season - Sakshi

వర్షాకాలంలో పశువులకు సోకే వ్యాధుల్లో బ్యాక్టీరియా వ్యాధి గొంతు వాపు / గురక వ్యాధి (హిమరేజిక్‌ సెప్టిసీమియా) ముఖ్యమైనది. పాస్టురెల్లా మల్టొసై అనే బ్యాక్టీరియా వల్ల ఇది సోకుతుంది. తొలకరి వర్షాల తర్వాత మొలకెత్తిన లేత గడ్డి మీద పేరుకుపోయిన ఈ బ్యాక్టీరియా, మేత ద్వారా పశువు శరీరంలోకి ప్రవేశిస్తుంది. దాదాపుగా అన్ని పశువులు ఈ వ్యాధి బారిన పడతాయి. ఈ దిగువ తెలిపిన కారణాల వల్ల వ్యాధి తీవ్రమవుతుంది.

పశువులకు పరాన్న జీవుల / వైరస్‌ / బ్యాక్టీరియా వ్యాధులు ముందుగానే ఉన్నట్లయితే..
దున్నపోతులు ఎక్కువగా పనిచేసి అలసిపోయినప్పుడు..
పశులు రవాణా సమయంలో.. ఉన్నట్లుండి మేత మార్పిడి వలన..
వాతావరణ మార్పులు – ఎక్కువగా వేడి, గాలిలో తేమ..
నీరసంగా ఉన్న పశువులు..
వ్యాధి సోకిన పశువులను వేరుగా ఉంచడం / ఉంచకపోవడం..

వ్యాధి లక్షణాలు
వ్యాధి త్వరగా సంక్రమించడం
ఎక్కువగా జ్వరం  
నోటిలో చొంగ కార్చడం
కళ్ల కలక, కంటి వెంబడి నీరు కారడం
నెమరు నిలిచిపోవడం
రొప్పడం, వైద్యం అందకపోతే చనిపోవడం

ఎక్యూట్‌ కేసులలో అయితే, ఆయాసపడడం, నొప్పిగా అరవడం, ఊపిరికి కష్టపడడం, మెడ క్రింద భాగాన, గంగడోలు ప్రాంతాల్లో నీరు చేరి ఉబ్బరింపుగా ఉండడం (బ్రిస్కట్‌ ఎడిమా) ముందర కాళ్లు కూడా నీరు పట్టినట్లు కనబడడం లాంటి లక్షణాలను కనబరుస్తుంది. పశువు గొంతులో ఈ సూక్ష్మక్రిములు ఒక్కోసారి తిష్ట వేసుకుంటాయి. పశువు నీరసించి పోయినప్పుడు లేదా పశువులో వైరల్‌ వ్యాధులు ఇతర పరాన్నజీవులు దాడి చేసినప్పుడు, ఈ గొంతులోని సూక్ష్మక్రిములు విజృంభిస్తాయి. బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించిన 30 గంటలకు వ్యాధి లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 6 నెలలు – 3 సంవత్సరాల పెయ్య / పడ్డలకు సోకుతుంది.

నివారణ
పరిశుభ్రమైన పాకలు, మంచి యాజమాన్యపు పద్ధతులు, ముందుగా వ్యాధి నిరోధక టీకా వేయించడం, ఆరోగ్యవంతమైన పశువులను వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు వెళ్లకుండా కట్టడి చేయడం, చనిపోయిన పశువులను సక్రమంగా పాతిపెట్టడం చేయాలి. రైతులకు అవగాహన కలగజేయాలి.
వ్యాధి సోకిన పశువులకు వైద్యం కోసం సల్పాడిమిడైన్‌ 50 కేజీల బరువుకు 30 మిల్లీ లీటర్లు చొప్పున కండకు ఇంజెక్షన్‌ ఇవ్వాల్సి ఉంటుంది. పెన్సిలిన్, టెట్రాసైక్లిన్లు ఎక్కువ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది. 2 లేదా 3 రూపాయలతో నివారణ టీకా వేయించుకోవడం మేలు.
ఏ టీకా అయినా పూర్తి స్థాయిలో పశువుకు పనిచేయాలంటే కనీసం 2 వారాల సమయం పడుతుంది. కాబట్టి రైతు సోదరులారా త్వరపడడండి.
– డా. ఎం.వి.ఎ.ఎన్‌.సూర్యనారాయణ ,(99485 90506), ప్రొఫెసర్‌ అండ్‌ హెడ్, పశుగణ క్షేత్ర సముదాయం, పశువైద్య కళాశాల, తిరుపతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top