చల్లనయ్యా చందరయ్యా

Chandrayaan 2 Special Story - Sakshi

చంద్రయాన్‌–2 జాబిల్లిని చేరుతున్న వేళ

ఎంతెంత దూరం... జాబిలెంత దూరం...మనిషి చందుడ్ని అందుకోవడానికి ఆరాటపడుతూనే ఉన్నాడు.చంద్రుడిపై పారాడడానికి మారాం చేస్తూనే ఉన్నాడు.వెన్నెల కురిపించే ఆ రాజు రాజ్యంలోతన జెండాను పాతడానికి దండెత్తుతూనే ఉన్నాడు.చంద్రుడు బహుశా నవ్వుకుంటూ ఉంటాడు.మేనమామకు ఉండే వాత్సల్యంతో గమనిస్తూ ఉంటాడు.ఏం కావాలి చంద్రుడి నుంచి?ఆ ప్రశ్న, దాని జవాబు శాస్త్రజ్ఞులకు వదిలిపెడదాం.మనం మాత్రం చంద్రుడిలోని కుందేలును చూద్దాం.అక్కడ కూర్చుని రాట్నం వడికే బామ్మతో కబుర్లు చెబుదాం.చంద్రుడొచ్చే వేళ కథలకు ఊ కొడదాం.చంద్రుడి వెన్నెలలో తడుస్తూ దుప్పటి కప్పుకుని కలలు కందాం.

ఆదిమ మానవునికి ప్రకృతి ఇచ్చిన తొలి టార్చ్‌లైట్‌ చంద్రుడు.కారడవులలో, కారుచీకట్లలో, మహావృక్షాల నీడన, రాతి గుహల భయంకర ఛాయలలో నాటి మనిషికి లభించిన తొలి ఓదార్పు చంద్రుడు.పగలల్లా వేట. రోజంతా తినీ తినక. తీరైన తిండి రాత్రి వేళలోనే. నలుగురి సమక్షంలోనే. గుంపంతా ఒకే చోట చేరి... నెగడు వేసుకొని... వేట కాల్చుకుంటూ... చంద్రుణ్ణి చూస్తూ తిన్న తిండే తిండి.అందుకే చంద్రుడు గోరుముద్దలకు తోడు వచ్చాడు.‘చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగుపూలు తేవె’ అని పసి పెదవుల నోటికి పాలబువ్వ అయ్యాడు. వారి మోమున దివ్య దరహాసమయ్యాడు.

చెట్టు కింద అవ్వ
చంద్రుణ్ణి ఇంత కాలంలో, ఎన్ని లక్షల కోట్ల మంది తేరిపార చూసుంటారు. చంద్రుడిలోకి చూపులు గుచ్చి ఎంత అన్వేషణ చేసి ఉంటారు. చంద్రుడి గురించి ఎన్ని ఊహలు అల్లి ఉంటారు. చంద్రుడి చుట్టూ ఉన్న మార్మికతకు ఎంత ఉద్విగ్నపడి ఉంటారు. చంద్రుడిపైకి చేరుకోవడం ఎలా అని అక్కడకు వెళితే బాగుండు అని ఎన్ని అనుకుని ఉంటారు.ఎంతసేపు చూసినా వారికి చంద్రుడి నుంచి ఏ సమాధానమూ రాదు.
అక్కడ ఒక నీడ కనిపిస్తుంది.లేదంటే కుందేలు లాంటి ఛాయ కనిపిస్తుంది. ఊళ్లలోని పిల్లలు నులక మంచాలపై మెడ వరకూ దుప్పటి కప్పుకుని చంద్రుడి వైపే చూస్తూ అక్కడ చెట్టు కింద అవ్వ కూచుని దోసెలు పోస్తూ ఉంటుందని ఆకారాన్ని పోల్చుకుంటారు.

తనివి తీరదు.ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు.
కళ్ల నిండా చూసుకోవడానికి సూర్యుడు పనికి రాడు. తారల తీరం బహుదూరం. మరి చేతికి చిక్కేవాడు... చూపుకు దక్కేవాడు ఒక్కడే. చందురుడు.వెన్నెలను తాగి మాత్రమే చకోర పక్షి జీవిస్తుందట. అదెంత ధన్యజీవి. అమావాస్య రోజు పస్తులతో అది ఏం పాటలు పాడుకొని ఉంటుందో. వెన్నెలను చూసే కలువ రెక్క విప్పుకుంటుందట. వెన్నెల ముద్దాడుతున్న కలువను చూడని, ఆ దొరవు గట్టున కాసేపైనా చేరని, ఆ రెంటి వాట్సప్‌ చాట్‌ను మౌనంగా చదవని జన్మ వృథా.

మచ్చ తప్పలేదు
ఈ చంద్రుడు ఎన్నింటికో సాక్షి. ఈ చంద్రుడు ఎన్ని విరహాగ్నులకో శ్రోత. ఎన్ని విందులలోనో సహపంక్తిదారుడు. ఎన్ని విలాపాలనో సేద తీర్చిన చందన పూత.ఈ చంద్రుడితో ప్రేమలో పడకుండా ఉండటం కష్టం.
తార ఈ శశాంకుడితో మోహంలో పడి ‘తారా శశాంకాని’కి కారణమైంది. చంద్రుడికి కూడా ‘మచ్చ’ ఉంటుంది. ‘మచ్చ లేని చంద్రుడు’ అన్న పొగడ్త దొడ్డ పొగడ్త ఎవరి గురించైనా. చిన్న చిన్న తప్పులు చేసిన గొప్పవాళ్లను ‘చంద్రుడికే ఉంది మచ్చ. ఈయనది ఏ పాటి’ అని అప్పుడు కూడా చంద్రుణ్ణే అడ్డం పెట్టుకుని పొగుడుతారు.అయితే చంద్రునికి స్థిమితం లేదు. రోజు రోజుకూ కరుగుతాడు. రోజురోజుకూ ఎదుగుతాడు. ఈ అస్థిమిత దర్శనంతో మనుషుల మనసులను కూడా అస్థిమితం చేస్తాడు. అమావాస్యకీ పున్నమికీ కొందరు మనుషులకు రేగుతుందని పెద్దలు చెబుతారు. కనుక చంద్రుణ్ణి నమ్మడానికి లేదు. ఎంత ప్రియమైన మనిషి అయినా అస్తమానూ ఇంట్లో ఉంటే చేదై పోతాడు. ఇలా వస్తూ అలా వెళుతూ ఉండాలి. ఇలా కనిపించి అలా మాయమవుతూ ఉండాలి– అమ్మని చూడటానికి వచ్చిన మేనమామలా. అందుకే చందురుడు చందమామ అయ్యాడు. అందరి మామ అతడు.

బాటలో తోడు అందరం గమనించిందే.
దారిలో మనం వెళుతూ ఉంటే చందమామ కూడా మనతో వచ్చినట్టు అనిపిస్తాడు. మనతో పాటే వస్తున్నట్టు కనిపిస్తాడు. ఎంత మెల్లగా నడిచినా. ఎంత వేగవంతమైన వాహనాల్లో దూసుకుపోతున్నా. ప్రయాణాలలో చంద్రుడు మన తోడు. ఎన్నో దూరాలను దాటించినవాడు. ఎన్నో తీరాలకు చేర్చినవాడు.ఒక అమ్మా నాన్న ఉండేవారట. వారికి ఇద్దరు కొడుకులట. పెద్ద కొడుకు కారం ముద్దలు పెట్టేవాడట. చిన్న కొడుకు నేతి ముద్దలు తినిపించేవాడట. తల్లిదండ్రులంటే ఎవరు? ఈశ్వర సమానులు. వీళ్లిద్దరి వాలకం చూసి ‘అరె పెద్దోడా... నువ్వు పగలు పొద్దంతా ధగధగమని మండుతా తిరుగు... అరె చిన్నోడా... నువ్వు రాత్రేళ నిమ్మళంగా మసలు’ అని ఆశీర్వదించారట. చిన్నోడు చంద్రుడయ్యి మన కోసం నేతి పూసల వంటి వెన్నెలను కురిపిస్తూ ఉంటాడు.

పున్నమే పండుగ
అమావాస్య రోజు చీకటి అలుముకుంటుంది. పౌర్ణమి రోజు ఆకాశాన దీపం వెలుగుతుంది. చీకటి రోజుల్లో వెలుతురు రావడమే పండుగ. అందుకే చాలా పండుగలను జానపదులు పౌర్ణమికి ముడిపెట్టారు. ‘ఏరువాక పున్నమి’ సేద్యానికి సిద్ధం కమ్మంటుంది. ‘కాముని పున్నమి’ పంచెకట్లనూ జడ కుచ్చులనూ ఒక చోట కూడమంటుంది. ‘మొలకల పున్నమి’ నేలన విత్తు గుచ్చమంటుంది. మనిషి గర్భంలో, నేలనా పంట పండిస్తాడు. జీవి కొనసాగింపుకు జీవన కొనసాగింపుకు రెండూ ముఖ్యం. జీవితాల వెలుగుకు దైహిక రసాస్వాదన కూడా ముఖ్యం. అందుకు పురిగొల్పేవాడు చందురుడు. వెన్నెల వేళ స్త్రీ పురుషులకు రమ్యవేళ అని వాత్సాయనుడు చెప్పాడు. చేను మీద బిరుసైన మంచె కట్టగలిగిన ప్రతి జానపదుడూ చెప్పాడు.

సాహిత్యంలో ముఖ్యపాత్ర
‘చంద్రుడు కర్పూరపొడిలా వెన్నెలను రాలుస్తున్నాడు’ అని ఒక ప్రాచీనకవి అన్నాడు.‘పాండవులకు, కౌరవులకు సంధి కుదరదని తేలేసరికి ఆకాశాన చంద్రుడి ముఖం వివర్ణమైంది’ అని ఒక పురా రచయిత వాక్యం పలికాడు. ‘మనసున మల్లెల మాలలూగెనే మనసున వెన్నెల డోలలూగెనె’ అన్నాడు కృష్ణశాస్త్రి. కాని శ్రీశ్రీ మాత్రం ‘గగనమంతా నిండి పొగలాగా క్రమ్మి బహుళ పంచమి జ్యోత్స భయపెట్టు నన్ను’ అన్నాడు. ‘ఆకాశపుటెడారిలో కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగుంది జాబిల్లి’ అని కూడా అన్నాడు. దేవరకొండ బాలగంగాధర తిలక్‌ తన ‘నల్లజర్ల రోడ్డు’ కథను ‘ఆకాశంలో చంద్రుడు భయంకరంగా ఉదయించాడు’ అని మొదలెడతాడు. ఆరుద్ర కవిత్వ సంపుటి పేరు ‘సినీవాలి’. ఇస్మాయిల్‌ కవిత ‘బాల్చీలో చంద్రుడు’ చాలా ఖ్యాతికెక్కింది.

ఆధాహై చంద్రమా.. రాత్‌ ఆధి...
హిందీ ఉర్దూ భాషలలో సాహిత్యంలో మౌఖిక వాంజ్ఞ్మయంలో చంద్రుడి ప్రస్తావన అనంతం. హిందీ సినిమా పాటల్లో ప్రతి మూడో పాట చంద్రుణ్ణి ప్రస్తావిస్తూనే సాగుతుంది. ‘ఆధా హై చంద్రమా... రాత్‌ ఆధి.. రెహెన జాయే తేరి మేరి బాత్‌ ఆధి.. ములాకాత్‌ ఆధి’... పాట ‘నవరంగ్‌’ సినిమాలో ఎందరికో ప్రీతిపాత్రమైంది. ‘ధీరే ధీరే చల్‌ చాంద్‌ గగన్‌ మే’, ‘ఖోయా ఖోయా చాంద్‌ ఖులా ఆస్మాన్‌’, ‘తుజే సూరజ్‌ కహూ యా చందా’, ‘రుక్‌ జా రాత్‌ ఠెహెర్‌ జారె చందా’... ఎన్నో పాటలు.

చంద్రుడిపై మనిషి కుతూహలం తీరదు. చంద్రుడి చుట్టూ మానవ అన్వేషణ ఆగదు. కాని ఆకాశాన ఉన్న ఆ మహిమాన్విత దీపం ఈ ప్రయత్నాలన్నింటిని చల్లగా చూస్తూ ఉంటుంది. దయగా నవ్వుకుంటూ ఉంటుంది. పాకుతూ వచ్చిన శిశువును తల్లి ఎలా అక్కున చేర్చుకుంటుందో వేల ఏళ్లుగా తన దరికి చేరడానికి ప్రయత్నిస్తున్న మనిషిని అలాగే అక్కున చేర్చుకుంటుంది.

సముద్రుడి కుమారుడు
పురాణాల ప్రకారం చంద్రుడి పుట్టుక క్షీర సాగరమథన సమయంలో జరిగింది. చంద్రుడు ఉబికి వచ్చాక లక్ష్మి పైకి తేలింది. అందుకే చంద్రుడికి లక్ష్మి తోబుట్టువు అయ్యిందని అంటారు. సముద్రుడు తండ్రి. హాలాహలాన్ని గరళాన నొక్కి పట్టాక ఆ అగ్నిని చల్లార్చడానికి చంద్రుణ్ణి ధరించాడట శివుడు. అందువల్ల ఆయన చంద్రశేఖరుడు అయ్యాడు. చంద్రుడు ఎంతటి చల్లటి వాడైనా చవితినాడు చూస్తే నిందలు కలిగిస్తాడని భయం ఉంది. కాని ఆ నిందలన్నీ లోక కల్యాణానికే దారి తీశాయి.

ఎడారికి రాజు
అడవుల్లో కొమ్మలు అడ్డు రావచ్చు. జనావాసాలలో భవంతులు చాటు చేయవచ్చు. కాని ఎడారిలో చంద్రుడికి ఏ అడ్డంకీ ఉండదు. రాత్రయితే ఆ అనంత ఇసుక సముదాయాలకు చంద్రుడే రాజు. అందుకే ఇస్లాంలో చంద్రుడికి చాలా ప్రాధాన్యం ఉంది. నెలవంక దర్శనంతో మొదలయ్యే పనులు అనేకం ఉన్నాయి. మహమ్మద్‌ ప్రవక్త తన జీవిత కాలంలో మహిమలు చూపలేదనే అసంతృప్తి ఆయన అనుయాయులకు ఉండేది. వారి కోసమని ప్రవక్త ఒక రాత్రి తన చూపుడువేలును చంద్రుడి వైపు చూపించారు. వెంటనే చంద్రుడు రెండు ముక్కలయ్యి మళ్లీ కలిశాడు. ఈ మహిమతో ప్రవక్త గొప్పతనం వారికి తెలిసింది. ప్రవక్త ఈ మహిమను చూపించారని ఇస్లాం ఆరాధకులలో బలంగా నమ్మేవారున్నారు.

చంద్రుడు లేని బతుకు గుడ్డి బతుకు.
చంద్రుడు లేని బతుకు ఎండ బతుకు.ఎండలో డస్సిపోయిన ప్రతి సందర్భాన ఆకాశాన లేచే ఆత్మీయబింబం చంద్రుడు.చంద్రుడు చల్లగా ఉండాలి. మనుషుల హృదయాలలో చల్లటి కాంతులే సదా విరజిమ్ముతూ ఉండాలి.– సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top