అన్నను కాపాడిన రాఖి

Brother And Sister Rakhi Festival Story - Sakshi

చెల్లెలి చేత రాఖీ కట్టించుకోవడం అంటే ఆమెకు రక్షగా ఉంటానని పునర్‌ వాగ్దానం ఇవ్వడమే. రాఖీ కట్టించుకున్న అన్నకు చెల్లెలి అనురాగమే బలం.మనోబలం. చెల్లెలిని ఆదరించని అన్న గుండె,రాఖీ కట్టించుకోని అతని చేయి అర్థరహితం. చెల్లెలే అన్నకు రక్షగా నిలవాల్సినఒక వాస్తవ కథ ఇది.

‘ఆ రోజు చాలా వాన పడుతోంది. నేను ఏడో క్లాస్‌ చదువుతున్నాను. మా చెల్లెలు అయిదో క్లాసు. మా స్కూల్‌ నుంచి వచ్చేదారిలో రెడ్డిగారి ఇల్లు ఉంది. ఆ గేటును ఆనుకునే అవతలి వైపు జామచెట్టు ఉంటుంది. దాని నిండా జామకాయలే. కాని పనివాళ్లు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. ఆ జామచెట్టు వైపు పిల్లలు చూస్తే నాలుగు తగిలిస్తారు. అందువల్ల దాని వైపు చూడటమే తప్ప ఎప్పుడూ తిని ఎరగం. ఆ ముందు రోజు మా చెల్లెలు ఎప్పుడూ లేనిది అన్నయ్యా... ఒక జామకాయ కోసిపెట్టవా అని అడిగింది. కోయాలంటే ఎలా? చూస్తే కొడతారు. వద్దమ్మా... కుదరదు అని చెప్పి ఇంటికి తెచ్చేశాను. ఆ మరుసటిరోజు భారీ వాన. ఎవ్వరం స్కూళ్లకు వెళ్లలేదు. ఎవరూ వీధుల్లోకి రాలేదు. ఆకాశం మూసుకుపోయింది. పట్టపగలు చీకటి కమ్ముకుంది. ఇంట్లో అందరం పొయ్యి దగ్గర ముణగదీసుకొని కూచుని ఉన్నాం. కాని నాకు మాత్రం చెల్లెలు అడిగిన చిన్న కోరికే గుర్తుకు వస్తోంది. ఏమడిగిందని... మణులా మాణిక్యాలా... ఒక జామకాయేగా... ఈ వానలో రెడ్డిగారి ఇంటి గేటు దగ్గర ఎవరూ ఉండరని అనిపించింది. ఇంట్లో గొడుగు లేదు. వానకు తడిస్తే తుడుచుకోవడానికి సరైన తువ్వాలు కూడా లేనంత పేదరికం. అయినా అంతటి వానలో తలుపు తీసుకొని రివ్వున బయటకు పరిగెత్తాను. వాన తరుముతూ ఉన్నా తడుపుతూ ఉన్నా బాణాల్లా గుచ్చుతున్నా రెడ్డిగారి ఇంటికి చేరుకున్నాను. నేననుకున్నట్టుగానే గేటు దగ్గర ఎవరూ లేరు. చెట్టు నిండా జామకాయలు తడిసి దుమ్ము కడుక్కుని మెరుస్తున్నాయి. చకచకా గేటు మీద నుంచి చెట్టు మీదకు పాకి దొరికినన్ని కోసి దిగుతుండగానే కుక్క మొరిగింది. రెడ్డిగారి కుక్క. అంతే ఒక్క దూకు దూకాను. కాలు పూర్తిగా బెణికింది. అయినా పరుగు ఆపలేదు. ఇల్లు చేరి ఆ జామకాయలు మా చెల్లెలికి ఇచ్చి వాటిని తను తింటూ ఉంటే కాలు నొప్పి అంతా మర్చిపోయాను. మా చెల్లెలంటే అంత ఇష్టం మేడమ్‌ నాకు’ అన్నాడతను లేడీ సైకియాట్రిస్ట్‌తో.

నలభై ఐదేళ్లు ఉంటాయి. మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తి రూపం, వేషం ఉన్నాయి. కాని మనిషి సంతోషంగా లేడు. ఒక కన్ను లేకపోతే, ఒక చేయి లేకపోతే, ఒక ఊపిరితిత్తి లేకపోతే, ఒక మూత్రపిండం లేకపోతే మనిషికి సహజంగా ఒక దిగులు కమ్ముకునే అవకాశం ఉంది. అలాంటి దిగులుతో ఉన్నాడు. అతనికి అన్నీ ఉన్నాయి. మరి లేనిది ఏమిటి?

‘మా చెల్లెలిని చూసి నేను పదేళ్లు అవుతోంది మేడమ్‌’ అన్నాడు మళ్లీ.
అతడు రోజూ గత కొన్నాళ్లుగా రాత్రిళ్లు మంచం మీదకు చేరి దుప్పటి ముఖం మీదుగా కప్పుకొని తెల్లారే దాకా శోకిస్తున్నాడని అతడి భార్య డాక్టర్‌ దగ్గరకు తీసుకు వచ్చింది. ఎందుకు అలా ఏడుస్తున్నావని అడిగితే ఏమీ చెప్పడు. పగలంతా మామూలుగానే ఉంటాడు. ఉద్యోగానికి వెళతాడు. పిల్లల అవసరాలు చూస్తాడు. కాని రాత్రయితే బెడ్‌రూమ్‌లో దూరి ఎవరికీ కనపడకుండా ఏడుస్తూ ఉంటాడు. భార్య ఉండగా డాక్టర్‌ అడిగితే కారణం ఏమీ లేదని ఉండేవాడేమో కానీ భార్యను బయట కూచోబెట్టడం వల్ల కొద్ది కొద్దిగా ఓపెన్‌ అవుతూ ఉన్నాడు.

‘పేదవాళ్ల బతుకులో అతి పెద్ద బరువు ఏమిటో తెలుసా డాక్టర్‌? బంధం. అవును.. అమ్మా నాన్నా అన్న బంధం. చెల్లెలు అన్న బంధం. కుటుంబం అన్న బంధం. మనిషి ఈ బంధాల కోసమే బతుకుతాడు. కాని పేదరికం ఉన్నప్పుడు ఈ బంధం లేనట్టే మరుపు నటిస్తాడు. నేను టెన్త్‌ క్లాస్‌కు వచ్చేటప్పటికే చాలా చురుకైన స్టూడెంట్‌నని మా చుట్టుపక్కల పల్లెల్లో బంధువుల్లో తెలిసిపోయింది. మా దూరపు బంధువు ఒకాయన ఒకరోజు మా ఇంటికి వచ్చి మా నాన్నతో– ‘చూడు ఈశ్వరయ్య. నీ కొడుకు నీ దగ్గర ఉంటే మరుసటి సంవత్సరానికి నీలాగే మట్టిపనికి వెళ్లాలి. లేదంటే ఇక్కడి గవర్నమెంట్‌ కాలేజీలో ఏదో ఒక దిక్కుమాలిన కోర్సు చదవాలి. ఎందుకు కన్నావో కన్నావు. నేనెలా ఉన్నా పర్లేదు నా కొడుకు చల్లగా ఉంటే చాలనుకునే మనసు తెచ్చుకో. నీ కొడుకును నాకిచ్చెయ్‌. వాణ్ణి చదివించుకొని ఇంజనీరుని చేసి నా కూతురుకి ఇచ్చి చేసుకుంటా. నా మనిషిని చేసుకుంటా’ అన్నాడు. అమ్మా నాన్న అది విని మూడురోజులు ఏడ్చారు. ఏడిస్తే కన్నీళ్లు వస్తాయి కాని డబ్బులు రావు. నన్ను మా బంధువుతో పంపించేశారు’ అని తల దించుకున్నాడు.

కన్సల్టేషన్‌ రూమ్‌లో డాక్టర్‌తో పాటు గదిలో ఉన్న ప్రతి వస్తువు అతడు చెబుతున్న కథకు చెవి ఒగ్గినట్టుగా చాలా నిశ్శబ్దం ఉంది. అతడు కొనసాగించాడు.
‘ఆ తర్వాత మా ఇంటిని పట్టించుకోలేదు. మా చెల్లెలిని పట్టించుకోలేదు. ప్రతి రాఖీనాడు మా చెల్లెలు అందమైన దారాలతో రాఖీ అల్లి దానిని కవర్‌లో పెట్టి నాకు పోస్ట్‌లో పంపేది. ఆ రాఖీకి బదులుగా చిన్న చాక్లెట్‌ పంపే వీలు కూడా నాకు ఉండేది కాదు. పాత లంపటాలు ఎక్కడ నన్ను వెనక్కు లాగుతాయో అని నన్ను తీసుకెళ్లినవాళ్లు ప్రతిదానికీ ఉలిక్కిపడుతూ ఉండేవారు. మా చెల్లెలికి ఊళ్లోనే మరో మట్టిపనివాడికిచ్చి పెళ్లి చేశారు. మా చెల్లెలు కంప్లయింట్‌ చేయలేదు. నేనొచ్చి నాలుగు అక్షింతలు వేయడమే పెద్ద కానుక అన్నట్టు సంతోషంగా నవ్వింది. దాని జీవితంలో నేను అన్నగా లేను. దాని పిల్లలకు మేనమామగా లేను. చివరకు నా తల్లిదండ్రులకు నేను కొడుకుగా కూడా లేను’... అతడి కళ్లు అంచు తెగకుండా నీళ్లు నిలిపి పెట్టి ఉన్నాయి.

‘మా అమ్మా నాన్నలు చివరి రోజుల్లో చూసే మనిషి లేక అవస్థలు పడ్డారు. తీసుకెళ్లి ఉంచుకోవడానికి నా చెల్లెలు శ్రీమంతురాలు కాదు. నిరుపేద. తీసుకెళ్లి పెట్టుకోవాల్సినవాడిని నేను. కాని చేతులు కట్టివేయబడి ఉన్నాను. ఒకరోజు మా చెల్లెలు ఫోన్‌ చేసింది– ‘అన్నయ్యా.. నా కోసం నిన్ను నేను ఏమీ అడగలేదు. అమ్మా నాన్న కోసం అడుగుతున్నాను. వాళ్లను బాధించక తీసుకెళ్లి నాలుగు ముద్దలు పెట్టరా’ అంది. దొంగ సంజాయిషీలు చెప్పాను. ఇది జరిగి పదేళ్లు. పదేళ్లుగా మా చెల్లెలు నా ముఖం చూడలేదు. నాతో మాట్లాడలేదు. అన్నగా కాదు నన్నో మనిషిగా కూడా తన మనసులో నుంచి తీసేసింది. పోతే పోయిందిలే అని నేను హాయిగా ఉండొచ్చు. కాని అలా ఉండలేకపోతున్నాను. నా ఒంట్లో రక్తం ఉంది. మా చెల్లెలి ఒంట్లో కూడా రక్తం ఉంది. దానిని ఒక గర్భం నుంచి మేము పంచుకున్నాము. ఆ రక్తం ఏ అర్ధరాత్రో నన్ను లాగుతుంది. ప్రశ్నిస్తుంది. నిలదీస్తుంది. ఎందుకిలా చేశావ్‌ అని దోషిగా నిలబెడుతుంది. నాకు నిద్ర పట్టదు. ఏం చేయాలో తోచదు. అందుకే ఏడుస్తున్నాను డాక్టర్‌’ అని ఆపిన కన్నీరును మనసు తేలిక పర్చుకోవడానికి చెంపల మీద కారనిచ్చాడు.

లేడీ సైకియాట్రిస్ట్‌ అంతా వింది.
ఇతనికి ఉన్న జబ్బుకు ఒకే ఒక మందు ఉంది. ఆ మందు పేరు చెల్లెలు. ఆ చెల్లెలు పెట్టాల్సిన క్షమాభిక్ష. అన్నను క్షమించడానికి ప్రతి చెల్లెలు సిద్ధంగా ఉంటుంది. ప్రయత్నించాల్సింది అన్నే.
సాధారణంగా ఆ సైకియాట్రిస్ట్‌ పేషంట్‌ చెప్పిన వివరాలను రికార్డ్‌ చేయదు. చేసినా అతడి సంబంధీకులకు వినిపించదు. కాని ఈ కేసును చేసింది. చేసి అతడి భార్యకు వినిపించింది.
‘చూడమ్మా... దగ్గరలో రాఖీ పండగ ఉంది. ఏం చేయాలో నీ ఇష్టం’ అంది.
‘నీ భర్తకు చాలా క్షమాపణ అవసరం. నీకు కూడా అవసరం. బంధాలు కూలిపోయాయని కూల్చగలమని మనం అనుకోవచ్చు. కాని రక్తం ఎరుపుగా ఉన్నంత కాలం ఆ బంధం నిలిచే ఉంటుందని గ్రహిస్తే మేలు’ అంది.

ఆమె అంగీకారంగా తల ఊపింది.
బహుశా ఈ రాఖీ పండుగ ఒక అన్నాచెల్లెళ్ల సంతోషకరమైన ఆలింగనంగా కళకళలాడే అవకాశం ఉంది.– కథనం: సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top