ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఎన్సీపీ శనివారం సమీక్షాసమావేశం నిర్వహించింది.
సాక్షి, ముంబై: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికలతోపాటు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై ఎన్సీపీ శనివారం సమీక్షాసమావేశం నిర్వహించింది. పవార్ అధ్యక్షతన, ఉపముఖ్యంత్రి అజిత్‌పవార్ నివాసమైన దేవగిరి బంగ్లాలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలిసింది. లోక్‌సభ ఫలితాలు ఎలా ఉండనున్నాయి? ఫలితాలు అనుకూలంగా ఉంటే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎటువంటి వ్యూహాలతో వెళ్లాలి? ప్రతికూలంగా ఉంటే ఎలా వెళ్లాలి? తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం, కాంగ్రెస్ వైఖరి కూడా చర్చకు వచ్చిందని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. ఈ విషయమై పవార్ పార్టీ నేతలను స్వయంగా ప్రశ్నించి, అభిప్రాయాలు తెలుసుకున్నారని చెప్పారు.
లోక్‌సభ ఎన్నికలను ఎన్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే లక్ష్యంతో పార్టీ పనిచేసిందని, అదే పట్టుదలతో అసెంబ్లీ ఎన్నికల కోసం కూడా కష్టపడాలని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పవార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాలను ఎన్సీపీ గెలుచుకుంటుందని నేతలు పవార్‌తో చెప్పగా... మీడియా ముందు ఇటువంటి ప్రకటనలు ఎవరూ చేయవద్దని పవార్ హెచ్చరించినట్లు తెలిసింది.