
విచిత్రాల గుట్టలు
తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, గొలుసుకట్టు చెరువులు.. ఇవే కాదు, ఇక్కడ రహస్య గుహలు కూడా ఉన్నాయి.
రాతియుగం నాటి విశేషాలను దాచుకున్న ఆ గుహలు పరిశోధకులు, చరిత్రకారులను ఆకర్షిస్తుంటే... గుహలపై ఉన్న కొండలు సాహసికులను ట్రెక్కింగ్ చేయమంటూ ఆహ్వానిస్తుంటాయి. ఒకదానిపై ఒకటి పేర్చినట్టు ఉండే ఈ వి‘చిత్ర’ గుట్టలు చరిత్రకు గుర్తులు.. యుగాల నాటి చిత్ర విచిత్రాల సమాహారం. అడ్వెంచర్‌ను ఇష్టపడే వారికి అద్భుతమైన టూర్ పాండవుల గుట్ట. - ఓ మధు
తెలంగాణ చారిత్రక వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. వేయి స్తంభాల గుడి, వరంగల్ కోట, గొలుసుకట్టు చెరువులు.. ఇవే కాదు, ఇక్కడ రహస్య గుహలు కూడా ఉన్నాయి. పురావస్తు శాఖ ఆలస్యంగా కనుగొన్న ఇక్కడి పాండవుల గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ గుట్టలు ఒక దాని మీద ఒకటి పేర్చినట్టుగా ఉంటాయి. ఇందులో ఎదురు పాండవులు, తుపాకుల గుండు, యానాదుల గుహ, ముంగీస బండ, పోతురాజు చెలిమె, గొంతెమ్మ గుహ, పంచపాండవులు, మేకలబండ ప్రముఖమైనవి.
చారిత్రక గుర్తుల గుహలు..
ఇక్కడి గుహల్లో ప్రాచీన కాలం నాటి చిత్రాలు ఉన్నాయి. తెలంగాణలోని రాతి చిత్రాల్లో ఇవి అత్యంత ప్రాచీనమైనవి. శిలాయుగం నుంచి మధ్యయుగం నాటి వరకు చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఒక మ్యూజియంలా వివిధ కాలాలకు సంబంధించిన చిత్రాలు ఒకే చోట ఉండడం సందర్శకుల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వీటిలో చేపలు, జింకలు, తాబేలు, పాము, చిలుక, నెమలి.. ఇలా రకరకాల జంతువుల చిత్రాలతో పాటు మనుషుల బొమ్మలున్నాయి. ఎదురు పాండవుల కొండలో ఆరడుగులకు పైగా ఉండే చిత్రాలు అన్నింటికన్నా పురాతనమైనవి. ఇక్కడి వర్ణచిత్రాలు, ఎరుపు రంగు చిత్రాలను బట్టి ఇవి ఏక కాల చిత్రాలు కావని తెలుస్తుంది. ఇక్కడి శిలాతోరణం ప్రకృతి వింతలో ఒకటి అనిపిస్తుంది. చేతి ముద్రలు, లిపులు, యుద్ధ సన్నివేశాలు ఇక్కడ చూడొచ్చు.
ఈ పాండవుల గుట్ట వరంగల్ నగరానికి 55 కి.మీ దూరంలో ఉంటుంది. రేగొండ మండలం రావులపల్లెకు సమీపంలో ఉందీ ప్రాంతం. హైదరాబాద్ నుంచి వరంగల్‌కు బస్‌లో వెళ్లి, అక్కడి నుంచి ఏదైనా వాహనంలో వెళ్లాలి.