
మరదలి కోసం మట్టుబెట్టాడు
మరదలిపై మోజుతో భార్యను కడతేర్చాడు. ముగ్గురూ కలిసుండేందుకు ఒప్పుకోలేదన్న అక్కసుతో బండరాయితో బలంగా మోది ఆమె ప్రాణం తీశాడు. పరారీలో ఉన్న భర్తను పోలీసులు పట్టుకొచ్చి.. తమదైనశైలిలో విచారణ చేయడంతో నేరం అంగీకరించాడు.
- ముగ్గురూ కలిసుందామని ప్రతిపాదన
- తిరస్కరించిన భార్యను కడతేర్చిన భర్త
- పోలీసుల విచారణలో అంగీకరించిన నిందితుడు
గోరంట్ల : భార్య హత్య కేసులో నిందితుడైన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం గోరంట్ల పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ వెంకటేశ్వర్లుతో కలిసి కొత్తచెరువు సీఐ శ్రీధర్ మీడియాకు వెల్లడించారు. గడ్డం తండాకు చెందిన రమేష్‌నాయక్ బెంగుళూరులో కూలి పనులకు వెళుతున్న క్రమంలో యలహంకకు చెందిన రాజునాయక్‌తో పరి చయమైంది. ఈ క్రమంలో రాజునాయక్ కుమార్తె లక్ష్మిబాయిని పెళ్లి చేసుకొంటానని తెల్పడంతో వారు అంగీకరించారు.
ఈ ఏడాది మే18న వివాహాన్ని జరిపించారు. అయితే లక్ష్మిబాయితో వివాహానికి మునుపే తన మేనత్త కుమార్తెతో రాజునాయక్ వివాహేతర సంబంధం ఉంది. ఇప్పుడు కూడా తనతోనే ఉంటానని, నీవు కూడా ఉండొచ్చని భర్త ప్రతిపాదించగా భార్య లక్ష్మిబాయి అంగీకరించలేదు. దీంతో శనివారం రాత్రి గడ్డివామి సమీపంలో పెద్ద బండరాయి తీసుకొని మోదడంతో లక్ష్మిబాయి అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం మృతదేహాన్ని ఇంటి వద్దకు చేర్చి రాజునాయక్ పరారయ్యాడు. సోమవారం సాయంత్రం గుమ్మయ్యగారిపల్లి క్రాస్ సమీపంలో నిందితుడు ఉన్నాడనే సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి అరెస్ట్ చేసినట్లు సీఐ వివరించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్‌ఐ బాలాజీ నాయక్‌లను ఆయన అభినందించారు.