
అలహాబాద్ కోర్టు తీర్పు గుర్తులేదా?
మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ మేరకు ప్రభుత్వ అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదంటూ ప్రశ్నించింది. బాధ్యులైన అధికారుల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించేలా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది.
ప్రజాప్రతినిధులు, అధికారులు, పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే అలహాబాద్ కోర్టు తీర్పు గుర్తులేదా అని హైకోర్టు ఈ సందర్భంగా ప్రశ్నించింది. ( ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉండడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా పరిగణించి.... అధికారులు, రాజకీయ నేతల పిల్లలను తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.)
తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది టీచర్లు ఉన్నారు.. ఎంతమంది పిల్లలున్నారు అనే దానిపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసులో భాగంగా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఆదేశాలు పంపింది. తదుపరి విచారణను ఈనెల 30కు వాయిదా వేసింది. ఉపాధ్యాయుల గైర్హాజరుపై విసుగెత్తిన మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు మండలం చింతకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. హైకోర్టుకు లేఖ రాసిన విషయం తెలిసిందే.