
శేషవాహనంపై ఊరేగుతున్న శివపార్వతులు
ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద వెలిసిన పులిగుంటీశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది.
పులిగుండు(పెనుమూరు): ప్రముఖ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రమైన పులిగుండు వద్ద వెలిసిన పులిగుంటీశ్వరస్వామి ఆలయ గిరిప్రదక్షిణ మంగళవారం రాత్రి వైభవంగా జరిగింది. ఉదయం పౌర్ణమిని పురస్కరించుకుని ప్రధాన అర్చకులు బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అభిషేక పూజలు, అలంకరణలు జరిగాయి. గీతా గాయత్రీ యజ్ఞం, శాంతి హోమం నిర్వహించారు. సాయంత్రం శివపార్వతుల ఉత్సవ మూర్తులకు పాలభిషేకం చేశారు. అనంతరం సుందరంగా అలంకరించి శేష వాహనంపై ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. రాత్రి ఏడు గంటలకు గిరిప్రదక్షిణ ప్రారంభమైంది. మేళతాళాల నడుమ పులిగుండు చుట్టూ గుంటిపల్లె రోడ్డు, కనికాపురం రోడ్డు, కొత్తరోడ్డు, ఠాణా వేణుగోపాలపురం, సీఎస్ అగ్రహరం కాలనీ మీదుగా ఆలయం వరకు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. స్వామి గిరిప్రదక్షణతో గ్రామాలకు రాగానే భక్తులు కొబ్బరి కాయలు కొట్టి హరతులు పట్టారు. మంగళవారం మధ్యాహ్నం, రాత్రి ఆలయం వద్ద వందలాది భక్తులకు అన్నదానం చేశారు. ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు కేశవులురెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.