
సాద్ మహ్మద్, ముబీనుద్దీన్, నిఖిల్ రోయిచ్
సిటీలో జరుగుతున్న మాదకద్రవ్యాల దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో జరుగుతున్న మాదకద్రవ్యాల దందాలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. సింథటిక్ డ్రగ్‌గా పిలిచే ఎల్‌ఎస్డీ విక్రయం కోసం సాద్ మహ్మద్ అనే విద్యార్థి సోషల్ మీడియా ను వేదికగా చేసుకున్నాడు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్‌ల ద్వారా కస్టమర్లతో సంప్రదింపులు జరిపాడని టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి గురువారం వెల్లడిం చారు. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు బోయిన్‌పల్లి ప్రాంతంలో ముగ్గురిని పట్టుకుని బోల్ట్స్ గా పిలిచే 32 ఎల్‌ఎస్డీ స్టాంపులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.
స్నేహితులతో కలిసి దందా...
తన స్నేమితుడైన న్యూ బోయిన్‌పల్లి వాసి మహ్మద్ ముబీనుద్దీన్‌తో కలిసి దందాకు శ్రీకారం చుట్టాడు. ఇద్దరూ కలిసి గోవా నుంచి ఒక్కో బోల్ట్ రూ.500 చొప్పున ఖరీదు చేసుకుని వచ్చే వారు. వీటిని నగరంలోకి కొందరు విద్యార్థులతో పాటు మరికొందరికి రూ.1700 నుంచి రూ.2 వేలకు (ఒక్కొక్కటి) విక్రయించే వారు. ఓ సందర్భంలో వీరి వద్ద ఎల్‌ఎస్డీ ఖరీదు చేసిన న్యూ బోయగూడకు చెందిన విద్యార్థి నిఖిల్ రోయిచ్ ఈ ముఠాలో చేరి విక్రయాలకు సహకరిస్తున్నాడు. తన ‘కస్టమర్లు’, స్నేహితులతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసిన సాద్ దాంతో పాటు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారానూ ఎల్‌ఎస్డీ క్రయవిక్రయాల లావాదేవీలు నెరపేవాడు. మే నెల్లో కసోల్ వెళ్లిన సాద్ అక్కడ నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయించాడు. ఇతడు కొన్ని సందర్భాల్లో మాదాపూర్‌కు చెందిన ప్రతీక్ బెజ్జం నుంచీ ఎల్‌ఎస్డీ ఖరీదు చేశాడు.
వలపన్ని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్...
ఈ త్రయం వ్యవహారాలపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డికి సమాచారం అందింది. ఆయన నేతృత్వంలో ఎస్సైలు ఎం.ప్రభాకర్‌రెడ్డి, పి.మల్లికార్జున్, ఎల్.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి తమ బృందాలతో గురువారం బోయిన్‌పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ వద్ద వలపన్నారు. అక్కడకు వచ్చిన సాద్, ముబీనుద్దీన్, నిఖిల్‌లను అరెస్టు చేశారు. వీరి వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న 32 బోల్ట్స్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రతీక్ కోసం గాలిస్తున్నారు. కేసును తదుపరి దర్యాప్తు నిమిత్తం సీసీఎస్ అధికారులకు అప్పగించార
వినియోగం నుంచి విక్రయం దాకా...
సికింద్రాబాద్ పరిధిలోని బోయిన్‌పల్లికి చెందిన విద్యార్థి సాద్ మహ్మద్. ఇతడు నాలుగో తరగతిలో ఉండగానే తండ్రి దూరం కావడంతో తల్లితో కలిసి మేనమామ వద్ద ఉంటున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతుండగా డానియల్ అనే స్నేహితుడి ద్వారా గంజాయి సేవించడానికి అలవాటుపడ్డాడు. ఆపై రాఘవేంద్ర అలియాస్ రాఘవ ద్వారా ఎల్‌ఎస్డీ బోల్ట్స్ కు బానిసయ్యాడు. తరచూ గోవాతో పాటు హిమాచల్‌ప్రదేశ్‌లోని కసోల్ వెళొచ్చే సాద్ అక్కడి నుంచి ఈ డ్రగ్‌ను ఖరీదు చేసేవాడు. ఈ ఎల్‌ఎస్డీకి నగరంలో మంచి డిమాండ్ ఉందని గుర్తించిన సాద్ వినియోగించడంతో పాటు ‘కస్టమర్ల’కు విక్రయించడం సైతం ప్రారంభించాడు.
డిజైన్ మధ్యలో డ్రగ్...
లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్ (ఎల్‌ఎస్డీ) మాదకద్రవ్యం వాస్తవానికి ఘనరూపంలో కనిపించే ద్రావణం. కొన్ని ప్రత్యేక పద్ధతుల్లో దీన్ని బ్లాటింగ్ పేపర్‌పై పూతలా ఏర్పాటు చేస్తారు. ఇలా పూత ఏర్పాటుకు ముందు ఆ కాగితంపై ఓ డిజైన్ రూపొందిస్తారు. కంప్యూటర్ సహాయంతో అలాంటి డిజైన్ ఉన్న కాగితాలను ఒకే సైజులో, పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. ఈ కాగితాలపై ఎల్‌ఎస్డీ పూసే విధానం పూతరేకు చుట్టల తయారీని పోలి ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. పూతరేకులపై పంచదార ఎలా వేస్తారో... బ్లాటింగ్ పేపర్‌పై ఎల్‌ఎస్‌డీ ద్రావణాన్ని అదేవిధంగా పూస్తారు. ఈ కాగి తాన్ని మామూలుగా చూస్తే ఓ డిజైన్ తో కూడిందిగా మాత్రమే కనిపిస్తుంది.