చుండూరు నరమేధం
చుండూరు దళిత నరమేధంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు.
ఒంగోలు టౌన్ : చుండూరు దళిత నరమేధంపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని మాల మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ‘చుండూరు దళిత నరమేధం.. 25 ఏళ్లయినా అంటరాని న్యాయం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.
న్యాయం కోసం ఆందోళన చేస్తున్న చుండూరు బాధిత దళితుల దీక్ష శిబిరంపై అప్పటి ముఖ్యమంత్రి జనార్దనరెడ్డి పోలీసులతో దాడిచేయించారని, ఆందోళన చేస్తున్న దళితులపై కేసులు పెట్టించి ఎమర్జన్సీ సృష్టించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో న్యాయం జరగదని దళిత నాయకత్వం ఢిల్లీకి వెళ్లి నాటి ప్రధాని పీవీ నరసింహారావును కలిసినా న్యాయం జరగలేదన్నారు.
సభకు నేతృత్వం వహించిన దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ 2007లో చుండూరు ప్రత్యేక కోర్టు 21 మంది అగ్రకుల హంతకులకు యావజ్జీవ శిక్ష, 35 మందికి ఏడాది జైలు శిక్ష విధించారన్నారు. 2014లో హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డి చుండూరు అగ్రకుల హంతకులంతా నిర్దోషులేనని తీర్పు ఇచ్చారన్నారు. అందరూ నిక్దోషులైతే దళితులను చంపిందెవరని దళితులు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రముఖ దళితకవి కత్తి కల్యాణ్ మాట్లాడుతూ పార్లమెంటరీ వ్యవస్థలోనే కాకుండా న్యాయవ్యవస్థలోనూ దళితుల పట్ల వివక్ష కొనసాగుతోందన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురామ్, దళిత నాయకులు డగ్లస్, దుగ్గిరాల విజయ్‌కుమార్, దారా అంజయ్య, దేవరపల్లి రమణయ్య, యర్రగుంట్ల ఇస్సాకు, దాసరి సుందరం, గోసాల హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.
కేవీపీఎస్ ఆధ్వర్యంలో..
గుంటూరు జిల్లా చుండూరులో జరిగిన మారణకాండలో హత్యకు గురైన ఎనిమిది మంది దళితుల కేసులో నిందితులంతా నిర్దోషులైతే వారిని చంపిందెవరని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బి.రఘురామ్ ప్రశ్నించారు. చుండూరు ఘటనలో న్యాయవ్యవస్థ స్పందించిన తీరు చూస్తుంటే దళితులు వాటిపై పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక ఎల్‌బీజీ భవన్‌లో నిర్వహించిన చుండూరు మృతవీరుల 25వ సంస్మరణ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
1991 ఆగస్టు 6న చుండూరులో పెత్తందారులు కత్తులు, గొడ్డళ్లు, బరిసెలతో ఒక పథకం ప్రకారం దాడి చేసి ఎనిమిది మంది దళితులను నరికి గోతాల్లో కుక్కి తుంగభద్ర కాలువలో పడేశారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి దళితులు, మైనార్టీలపై దాడులు జరుగుతున్నా వాటిని అరికట్టకపోగా మరింత పెంచి పోషించే విధంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేవీపీఎస్ నగర అధ్యక్షుడు రాపూరి శ్రీనివాసులు నేతృత్వంలో నిర్వహించిన సంస్మరణ సభలో నాయకులు టి.రామారావు, గోపి, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కేఎఫ్ బాబు, వి.బాలకోటయ్య, తిరుపతయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ సుధాకర్ పాల్గొన్నారు.