సీల్డ్‌ కవర్‌లో....

Yaddanapudi Sulochana Rani Secretary Novel Honor Programme - Sakshi

యద్దనపూడి సులోచనారాణి గారి ‘సెక్రటరీ’ నవల యాభై సంవత్సరాల పండగని తెలుగు పాఠకలోకం జరుపుకుంటున్న సందర్భం అది. అనేక టీవీ చానళ్లు ఆవిడ ఇంటర్వూ్యలను ప్రసారం చేశాయి. ఆ సందర్భంలో ఓ ఇంటర్వ్యూ చివరలో యాంకర్‌ అడిగారు, ‘‘మేడమ్‌! మీరు ఎన్నో కథలు, నవలలు రాసారు. వాటి గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూ ముగింపుగా మీరో చిన్న కథ చెప్తారా!’’ అని. దానికి సమాధానంగా శ్రీమతి సులోచనారాణి చెప్పిన కథ ఇది : ఒక రచయిత్రి ఉంటుంది. ఎన్నో కథలు, నవలలు రాసింది, రాస్తూ ఉంటుంది. ఆమె తర్వాతి కథ ఎప్పుడు వస్తుందా అని పాఠకులు ఆత్రుతతో ఎదురుచూస్తూ ఉంటారు. ఆమెకు డెబ్భయి ఏళ్లు వచ్చేశాయి. రాస్తూనే ఉంటుంది. అప్పుడేదో చానల్‌వాళ్లు ఇంటర్వూ్య చేస్తారు.

ఆ ఇంటర్వ్యూలో మీరు రాయబోయే కథ ఏమిటి అని అడుగుతారు. చెప్తాను. నా పబ్లిషర్‌ ఎమెస్కో విజయకుమార్‌ ఉన్నారు కదా! నా చివరి నవల రాసి ఆయనకు ఇచ్చేస్తాను. ఆయన దాన్ని నేను చనిపోయిన తర్వాత ప్రచురిస్తారు. అప్పుడు మీరందరూ చదువుకుందురుగాని; అని చెప్తుందావిడ; నేనేననుకోండి. అయితే ఆవిడ ఆ తర్వాత రెండేళ్లు, మూడేళ్లయినా చనిపోదు, ఇంకా రాస్తూనే ఉంటుంది. ఆమె రాసే కథలు, నవలల్ని మంజుల (మంజులానాయుడు, దర్శక నిర్మాత) సీరియల్స్‌ తీస్తూనే ఉంటుంది. ఆమె చివరి కథ ఏమిటో అన్న ఆసక్తి జనాన్ని చంపేస్తూ ఉంటుంది. ఈమె చచ్చిపోతేగానీ అది బయటికి రాదాయె. ఆమె ఏమి రాసిందోననే కుతూహలం రోజురోజుకి తట్టుకోలేని స్థాయికి పెరిగిపోయింది. ఇది తట్టుకోలేని ఓ పిచ్చి అభిమాని ఆమెను పొడిచి చంపేస్తాడు.

పత్రికల్లో, చానళ్లలో ఆమెకు నివాళులర్పిస్తూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు, అభిమానులు ఏడుస్తూ ఉంటారు.  కన్నీళ్లతో ఎమెస్కో విజయకుమార్‌ చొక్కా తడిసిపోయి ఉంటుంది. ఇంతలో ఆ అభిమాని వస్తాడు. విజయకుమార్‌ గారు ఆ కథ బయట పెట్టండి అని అడుగుతాడు. అప్పుడు విజయకుమార్‌ తన బీరువా తెరిచి కాగితాల బొత్తుల్లోంచి ఒక కవరు బయటికి తీస్తాడు. కెమెరాలన్నీ దాని మీద ఫోకస్‌ చేసి ఉంటాయి. అంతా ఉత్సుకతతో చూస్తుంటారు. ఏముంది ఆ కవరులో..... ఏముందనుకుంటూ.

విజయకుమార్‌ కవరు తెరుస్తాడు. అందులో ఒక తెల్లకాగితం ఉంటుంది. ‘నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని మరచిపోతున్నాను, మీరు నన్ను మరచిపోండి!’ అని మాత్రమే ఉంటుందందులో....

ఇలా నేను చేస్తానని కాదు. ఏదో సరదాగా చెప్పాను. నేను వెళ్లిపోయినప్పుడు మీరేమీ చేయవద్దు. సెక్రటరీ చదవండి అంతే. నన్ను మరచిపోతారు అంటూ ఆ ఇంటర్వ్యూని ముగించారావిడ.

ఆవిడ మరణవార్త చిరంజీవి శైలు (శైలజ) భర్త రవి నాకు తెలియజేసినప్పుడు ఎందుకో నా మనస్సు మొత్తం ఓ నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయింది. నా గుండె ఉనికి గురించి నేనే వెతుక్కున్నాను. నా సంస్థకు వెన్నెముక ఆవిడ. వెన్నెముక లేని మానవశరీరం నిలబడుతుందా అని ఓ భయం, నిటారుగా నించున్న నానుంచి నా వెన్నెముకను తొలగించినట్లు ఓ అనుభూతి. మర్నాడు ఉదయం మీడియాకు ఆ విషయం తెలియజేయటం, ఆ తరువాత హడావిడి కొంచెం తేరుకున్నాక నాకు ఓ విషయం గుర్తొచ్చింది. సులోచనారాణిగారు అమెరికా వెళుతూ నాకో కవరు పంపించారు. దాన్ని మా ఆఫీసులో కుర్రాడు అనిరుధ్‌ తీసుకువచ్చాడు. అది వచ్చిన రోజు నుండి నేనో వారం రోజులు హైదరాబాద్‌లో లేను.

నా భాగస్వామి కుమారుడి వివాహం హడావిడిలో ఫోన్‌లో అనిరుధ్‌ని అడిగితే మేడమ్‌ కొన్ని కథలు పంపారు ప్రచురణ కోసం అని చెప్పాడు. ఆవిడ వచ్చాక ప్రచురిద్దాం. చాలాకాలం తరువాత వస్తున్న పుస్తకం కదా మంచి రిలీజ్‌ ఫంక్షన్‌ పెట్టొచ్చు అని ఎడిటర్‌ గారికి చెప్పాను. ఆ కవరుని బీరువాలో దాచమని చెప్పాను. ఈ రోజు ఉదయం (22–5–18) ఆ కవరులో ఏముందా అని తెరిచి చూశాను. పైన ఆవిడ కథలో చెప్పినట్లుగానే నా కన్నీళ్లతో చొక్కా తడిసిపోతోంది. అవి అన్నీ కథలు కాదు. ఆవిడ ఆలోచనలు, అనుభూతులూను. పాఠకులతో పంచుకోవడం కోసం రాసినవి. ప్రియనేస్తమా! అనే పేరున తయారైన ఆ సంపుటిని ఆవిడ నన్ను ఆశీర్వదిస్తూ నాకు, నా అర్ధాంగికి అంకితం ఇచ్చారు. కృతజ్ఞతతో ఆవిడ పాదాలను ముద్దాడాలనిపించింది.

ఆవిడ నా ప్రియమైన పాఠకులారా! అని ప్రారంభించి రాసిన ముందుమాటను మీ ముందుంచుతున్నాను.ఎమెస్కో విజయకుమార్‌

నా ప్రియమైన పాఠకులారా!

నేను నవలలు, కథలు వ్రాయకుండా ఎందుకిలా వ్రాస్తున్నానా.. అని మీరు అనుకోవచ్చు! నా 16వ సంవత్సరంలోనే నేను ‘చిత్రనళినీయం’ అనే కథ వ్రాసినప్పుడు, నా మనసులో ఏ కోర్కెలూ లేవు! కథ వ్రాయటంలోనే నాకు పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం కోసమే మళ్ళీ... మళ్ళీ... మళ్ళీ.. 60 సంవత్సరాల పాటు వ్రాసాను.. ఆనందం పొందుతూనే ఉన్నాను. అదొక చైతన్య జలపాతం! 16 సంవత్సరాల్లో కథలు వ్రాసినçప్పుడు నాకు ఎలాంటి ఆనందం, ఉత్సాహం ఉన్నాయో, ఇప్పుడూ అంతే ఉన్నాయి..

నేను ఇన్ని సంవత్సరాలు ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా, నా మనసు కాస్తంత కూడా అలిసిపోలేదు! ఆ జలపాతం సన్నగిల్లలేదు! అదే ఉద్వేగం! అదే చైతన్యం.. 16 సంవత్సరాల వయసులో కంటే 76 సంవత్సరాల ఈ వయసులో నా మనసుకి చాలా పరిపూర్ణత వచ్చింది.. వేల మంది పాఠకులతో నేను కలిసిపోయి, వారి జీవితంలోని సంఘటనలకి స్పందించినçప్పుడు, అవి నా మస్తిష్కంలో ఉన్న భాండాగారంలో నిక్షిప్తం అయి ఉన్నాయి..

వంద సంవత్సరాలు వ్రాయగల కథల వస్తు సామగ్రి నా దగ్గర ఉంది..! కానీ నా శరీరం వయోభారంతో అలిసిపోయింది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకూ మీకు ఏదో ఒకటి వ్రాసి ఇస్తూనే ఉంటాను.
నన్ను చాలామంది ‘‘మృత్యువు’’ గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికీ ఈ ఆలోచన వస్తుంది. ఇది మన ముందున్న యథార్థం! ఒక నగ్నసత్యం! ఈ నగ్నసత్యం లోకి మనం నిర్వికారంగా, హుందాగా, ఆనందంగా నడిచి వెళ్ళాలి!

నేను లెక్కచూసుకున్నాను.. అయిన వారంతా... అమ్మా–నాన్నా, అక్కయ్యలు–బావలు, అన్నయ్యలు–ఒదినలు, పిన్నులు–పినతండ్రులు, మేనత్తలు– మేనమామలు. ఎందెందరో బంధుజనం.. అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ రామానాయుడు గారు, శ్రీ మధుసూదనరావు గారు, శ్రీ ఎల్వీ ప్రసాద్‌ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్స్, కొంతమంది ప్రియమైన పాఠకులు, అందరూ వెళ్ళిపోయారు.. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తోందని నాకు బాగా తెలుసు!

నాకు ఎప్పుడు ఏది అనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే నా ప్రియనేస్తాలు మీరు!

ఇప్పుడు నేనేదైనా వ్రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా భావిస్తాను! ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావపుష్పాలని మాలగా అల్లడం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తున్నది.
సెలవా మరి! యద్దనపూడి సులోచనారాణి
రేపటి సంచికలో...  ప్రియనేస్తమా!  గులాబీ జీవితం
 

Read latest Delhi News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top