జైడస్‌ చేతికి ఎంఎస్‌డీ బ్రాండ్‌లు | Zydus Cadila acquires 6 brands from American pharma MSD | Sakshi
Sakshi News home page

జైడస్‌ చేతికి ఎంఎస్‌డీ బ్రాండ్‌లు

Dec 29 2016 2:11 AM | Updated on Sep 4 2017 11:49 PM

అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎంఎస్‌డీకు చెందిన ఆరు బ్రాండ్లను జైడస్‌ క్యాడిలా సంస్థ కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు.

ఆరు బ్రాండ్‌లను కొనుగోలు చేసిన జైడస్‌
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫార్మా దిగ్గజం ఎంఎస్‌డీకు చెందిన ఆరు బ్రాండ్లను జైడస్‌ క్యాడిలా సంస్థ కొనుగోలు చేసింది. ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఎంఎస్‌డీ, అనుబంధ సంస్థలకు చెందిన ఆరు బ్రాండ్లను తమ కంపెనీ పూర్తి అనుబంధ కంపెనీ జైడస్‌ హెల్త్‌కేర్‌ కొనుగోలు చేసిందని జైడస్‌ క్యాడిల్‌ పేర్కొంది. 140కు పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న  మెర్క్‌ అండ్‌ కంపెనీకి ఎంఎస్‌డీ ఇండియా అనుబంధ కంపెనీగా వ్యవహరిస్తోంది. జైడస్‌ కొనుగోలు చేసిన బ్రాండ్లు–డెక–డ్యురబొలిన్, డ్యురబొలిన్, సస్టనాన్, మల్టీలోడ్, సికాస్టట్, యాక్సెటెన్‌లు 2015లో రూ.84 లక్షల అమ్మకాలు సాధించాయి.

ఈ డీల్‌లో భాగంగా ఈ ఆరు బ్రాండ్లకు సంబంధించి పంపిణి, వాణిజ్యపరమైన హక్కులు, ట్రేడ్‌మార్క్‌ అసైన్‌మెంట్‌ జైడస్‌ హెల్త్‌కేర్‌కు బదిలీ అవుతాయి. ఈ ఆరు బ్రాండ్ల కొనుగోళ్లతో తమ ఔషధ పోర్ట్‌ఫోలియో మరింత శక్తివంతం అవుతుందని జైడస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ షర్విల్‌ పటేల్‌ పేర్కొన్నారు. డెక–డ్యురబొలిన్, డ్యురబొలిన్‌లు ఓస్టియోపొరొసిస్‌(ఎముకల బోలు వ్యాధి)నివారణకు,  సస్టనాన్‌ పురుషుల ఆరోగ్య సెగ్మెంట్‌కు సంబంధించిన ఈ ఔషధాన్ని టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ రీప్లేస్‌మెంట్‌ ధెరపీలోనూ, మల్టీలోడ్‌ మహిళల గర్భనిరోధక ఐయూడీ డివైస్, సికాస్టట్, గాయాలను తగ్గించడంలోనూ, యాక్సెటెన్‌ అధిక రక్తపోటు చికిత్సలోనూ ఉపయోగిస్తారు.  
 

Advertisement
Advertisement