అమెరికా మెడపై ‘షట్‌డౌన్’! | shut down on america neck | Sakshi
Sakshi News home page

అమెరికా మెడపై ‘షట్‌డౌన్’!

Oct 1 2013 12:58 AM | Updated on Apr 4 2019 4:25 PM

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ చట్టం.. ఆ దేశ ప్రభుత్వ కార్యకలాపాలకు పాక్షికంగా మూసివేత(షట్‌డౌన్) ముప్పును తెచ్చిపెట్టాయి

 వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రతిష్టాత్మక హెల్త్‌కేర్ చట్టం.. ఆ దేశ ప్రభుత్వ కార్యకలాపాలకు పాక్షికంగా మూసివేత(షట్‌డౌన్) ముప్పును తెచ్చిపెట్టాయి. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న రిపబ్లికన్ పార్టీలకు, ప్రభుత్వానికి చెందిన డెమోక్రాట్‌లకు మధ్య చర్చలు కొలిక్కిరాకపోవడం దీనికి ప్రధాన కారణం. ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన తాత్కాలిక నిధుల కల్పన బిల్లును ఆమోదించేందుకు గడువు సోమవారం అర్ధరాత్రితో ముగియనుంది. దీనికి ముందే సెనేట్‌లో హెల్త్‌కేర్ చట్టంలో కొన్ని మార్పుచేర్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే సెనేట్(డెమోక్రాట్‌లకు పట్టు ఉంది) మెజారిటీ నాయకుడు హ్యారీ రీడ్... రిపబ్లికన్‌లు(ప్రతినిధుల సభలో పట్టున్న ప్రతిపక్ష పార్టీ) ప్రతిపాదించిన అంశాలను బిల్లు నుంచి తొలగించేందుకు హామీ ఇచ్చారు. దీనివల్ల ఈ కీలకమైన హెల్త్‌కేర్ చట్టంలోని కొన్ని అంశాలను ఏడాదిపాటు అమలు చేయకుండా నిలిపేందుకు వీలవుతుంది. కాగా, తాత్కాలిక వ్యయబిల్లులకు ఆమోదం పొందనిపక్షంలో ప్రభుత్వ కార్యకలాపాల షట్‌డౌన్ గండం పొంచి ఉండటంతో అమెరికాలో స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ సూచీలు సోమవారం ఉదయం భారీగా కుప్పకూలాయి.
 
 ఒబామాకేర్...
 ఆరోగ్య బీమా పరిధిలోలేని లక్షలాది మంది అమెరికన్లకు బీమా కవరేజీ కల్పించేందుకు లక్ష్యంగా ఒబామా ప్రభుత్వం ఈ చట్టానికి రూపకల్పన చేసింది. ఇదే ‘ఒబామాకేర్’గా కూడా ప్రసిద్ధిచెందింది. దీనికోసం ప్రత్యేకంగా మంగళవారం నుంచి ఎక్స్ఛేంజీలు ఏర్పాటు కానున్నాయి. చట్టప్రకారం అర్హులైన ప్రజలు తమకు నచ్చిన ఆరోగ్య బీమా పాలసీని ప్రైవేటు బీమా కంపెనీల నుంచి కొనుగోలు చేయవచ్చు. దీనికి ప్రభుత్వం తగిన నిధులను సమకూర్చుతుంది. ఒబామా ప్రభుత్వ పథకాలతో ఇప్పటికే ఉద్యోగాలు ఊడుతున్నాయని, తాజా హెల్త్‌కేర్ చట్టంవల్ల ఆరోగ్య, వైద్య ఖర్చులు మరింత భారంగా మారుతాయనేది రిపబ్లికన్‌ల వాదన.
 
 17 ఏళ్ల తర్వాత మళ్లీ...
 దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయే ముప్పు అమెరికాలో తలెత్తింది. 1995 డిసెంబర్ 16 నుంచి 1996 జనవరి 6 వరకూ షట్‌డౌన్ జరిగింది. దీనివల్ల సుమారు 8 లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి జీతాలు లేక సెలవుపై విధులను బహిష్కరించేందుకు దారితీసింది. ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. మూడేళ్ల క్రితం నాటి ఒబామాకేర్ చట్టం అమలు దశకు చేరుకున్న నేపథ్యంలో కన్జర్వేటివ్ సభ్యులు దీనిపై పీటముడి వేశారు. చట్టాన్ని ఎలాగైనా అడ్డుకోవడం కోసం ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన తాత్కాలిక బిల్లులను ఆమోదం పొందనీయకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారు.
 
 షట్‌డౌన్‌వల్ల ఏం జరుగుతుంది....
 ‘షట్‌డౌన్’ అమల్లోకి వస్తే... దేశవ్యాప్తంగా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల చెల్లింపులు నిలిచిపోయేందుకు దారితీయనుంది. దీని ప్రభావంతో మంగళవారం నుంచి వాళ్లు సెలవుపై విధులను బహిష్కరిస్తే... పలు సేవలు ఆగిపోయే ప్రమాదం ఉంది. అయితే, కీలక సేవలైన సరిహద్దు పహారా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్, పేద-వయోవృద్ధులకు హెల్త్‌కేర్ ప్రోగ్రామ్స్ వంటివి మాత్రం కొనసాగే అవకాశాలున్నాయి. వీసాలకోసం విదేశాలనుంచి వచ్చే దరఖాస్తులు, అమెరికాలో పాస్‌పోర్ట్ దరఖాస్తుల ప్రాసెసింగ్ ప్రక్రియ కూడా కొనసాగొచ్చని భావిస్తున్నారు. విదేశాల్లోని అమెరికా రాయబార, కాన్సులేట్ కార్యకలాపాలు తమ పౌరులకు అందించే సేవలకు కూడా అడ్డంకి ఉండకపోవచ్చని అంచనా. అయితే, ఫైనాన్షియల్ మార్కెట్‌పైనా ఇది ప్రభావం చూపొచ్చు. పబ్లిక్ ఆఫర్స్ ద్వారా కంపెనీల నిధుల సమీకరణ ప్రక్రియ జాప్యమయ్యే అవకాశాలున్నాయి. అక్కడి స్టాక్‌మార్కెట్ నియంత్రణ సంస్థ ఈ ప్రాసెసింగ్, దరఖాస్తులకు ఆమోదం వంటివి నిలిపేయనుండటమే దీనికి కారణం. కాగా, ఇప్పుడు కాంగ్రెస్‌లో ఒకవేళ షట్‌డౌన్ ముప్పు తప్పినప్పటికీ.. రిపబ్లికన్‌లు తమ హెల్త్‌కేర్ పోరును ఈ నెల మధ్యలో మళ్లీ తీవ్రతరం చేసే అవకాశాలున్నాయి. ప్రభుత్వ వ్యయ పరిమితిని పెంచేందుకు ఉద్దేశించిన బిల్లును అడ్డుకోవాలనే వ్యూహంతో ఉన్నారు. ఇదే జరిగితే అమెరికా ప్రభుత్వం తొలిసారిగా చెల్లింపుల విషయంలో డిఫాల్ట్ అయ్యేందుకు దారితీయొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement