
506 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్
వరుసగా మూడు రోజులు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది.
⇒ మూడు రోజుల నష్టాలకు బ్రేక్
⇒ 27,000 దాటిన సెన్సెక్స్
⇒ ఇంట్రాడేలో 8,200ను తాకిన నిఫ్టీ
ముంబై: వరుసగా మూడు రోజులు నష్టాలు చూసిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కోలుకుంది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం, షార్ట్ కవరింగ్ ప్రధాన కారణాలుగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 506 పాయింట్లు లాభపడి 27,105 పాయింట్ల వద్ద, నిఫ్టీ 134 పాయింట్ల లాభంతో 8,192 పాయింట్ల వద్ద ముగిశాయి.
ఇంగ్లండ్‌లో వ్యాపార వర్గాలకు అనుకూలంగా ఉండే కన్సర్వేటివ్ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తోందన్న వార్తలతో పాటు అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు పెరగడం, ముడి చమురు ధరలు చల్లబడడం, ఇటీవల బాగా తగ్గి, ఆకర్షణీయ ధరల్లో లభ్యమవుతున్న బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండడం.. ఈ కారణాలన్నీ స్టాక్ మార్కెట్ పెరుగుదలకు కారణాలని నిపుణులంటున్నారు. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయంగా జోరుగా ఉన్న ప్రభుత్వ బాండ్ల విక్రయాలు నిలకడను సాధించడం కూడా ప్రభావం చూపిందని వారంటున్నారు.
జోష్ నిచ్చిన అంశాలు..!
⇒ కనీస ప్రత్యామ్నాయ పన్నుపై (మ్యాట్) ఆందోళనతో ఇటీవల ఎఫ్‌ఐఐలు షేర్లను, బాండ్లను విక్రయించడం భారత క్రెడిట్ రేటింగ్‌పై ప్రభావం చూపే అవకాశాల్లేవని మూడీస్ పేర్కొంది.
⇒ మ్యాట్‌పై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు.
⇒ ఇంగ్లాండ్‌లో భారత్ అనుకూల డేవిడ్ కామెరూన్ నేతృత్వంలోని పాలక కన్సర్వేటివ్ పార్టీ ఆశ్చర్యకరంగా విజయం సాధించడం.
⇒ లాభాల్లో ప్రారంభమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ 27 వేల పాయింట్ల కీలక మైలురాయిని దాటేసింది. వారం రోజులను పరిగణనలోకి తీసుకుంటే సెన్సెక్స్ 94 పాయింట్లు లాభపడింది.
బ్యాంక్ షేర్ల జోరు
గురువారం మసకబారిన బ్యాంకింగ్ షేర్లు శుక్రవారం వెలుగులు విరజిమ్మాయి. సెన్సెక్స్ 506 పాయింట్ల పెరుగుదలలో ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐల షేర్ల వాటా 180 పాయింట్లుగా ఉంది. బ్యాంకులతో పాటు వాహన, క్యాపిటల్ గూడ్స్ షేర్లు జోరుగా పెరిగాయి. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.9,041 కోట్ల సమీకరించిన నేపథ్యంలో టాటా మోటార్స్ షేర్ 5.1 శాతం పెరిగి రూ.514 వద్ద ముగిసింది. సెన్సెక్స్ షేర్లలో అధికంగా లాభపడ్డ షేర్ ఇదే. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంక్ 4 శాతం, యాక్సిస్ బ్యాంక్ 2.8 శాతం, సిప్లా 4 శాతం, హిందాల్కో 3.5 శాతం, బజాజ్ ఆటో 3 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.6 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2.3 శాతం చొప్పున పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం 17 శాతం పెరగడంతో హిందుస్థాన్ యూనిలివర్ 3.3 శాతం లాభపడింది. ముడి చమురు ధరలు చల్లబడడం, రూపాయి బలపడడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ షేర్లు పెరిగాయి. ఇక నికర లాభం తగ్గడంతో హీరో మోటొకార్ప్ షేర్ 2.2 శాతం తగ్గింది. 1,871 స్టాక్స్ లాభాల్లో,823 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.2,960 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.16,758 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,12,583 కోట్లుగా నమోదైంది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.438 కోట్ల నికర విక్రయాలు జరపగా, దేశీ ఇన్వెస్టర్లు రూ.1,114 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.
4 శాతం పెరిగిన ఈరోస్ షేర్...
సల్మాన్ శిక్షను బాంబే హైకోర్ట్ సస్పెండ్ చేయడంతో సల్మాన్ ఖాన్‌తో సంబంధమున్న ఈరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్ బీఎస్‌ఈలో 4.2 శాతం పెరిగి రూ.402 వద్ద, ఎన్‌ఎస్‌ఈలో 4.3 శాతం వృద్ధితో రూ.403.5 వద్ద ముగిసింది. సల్మాన్ ఖాన్ నిర్వహిస్తున్న స్వచ్ఛం సేవా సంస్థ బీయింగ్ హ్యూమన్‌తో ఒప్పందం ఉన్న మంధన ఇండస్ట్రీస్ మాత్రం 0.04 శాతం క్షీణించి రూ.255కు తగ్గింది. ఇక ఈ కేసుపై తదుపరి విచారణ వచ్చే నెల 15న జరగనున్నది.