రిస్క్‌ తక్కువ... లాభాలు ఎక్కువ!

Risk Less Profits More! - Sakshi

ఫ్రాంక్లిన్‌ ఇండియా హై గ్రోత్‌ కంపెనీస్‌ ఫండ్‌

గతేడాది పెద్ద కంపెనీల షేర్లలో దాదాపు చాలా వరకు రెండంకెల రాబడులనిచ్చాయి. మార్కెట్ల ర్యాలీలో ముందుండేవి ఇవే. కాబట్టే బ్లూచిప్‌  కంపెనీల్లో రిస్క్‌ తక్కువని చెబుతారు. మార్కెట్ల సహజ లక్షణమైన ఆటుపోట్లు, అస్థిరతల నడుమ కాస్తంత లాభాలను ఇచ్చే వాటిలో బ్లూచిప్‌ స్టాక్స్‌ ముందుంటాయి.

ఆ విధంగా చూసినప్పుడు ఫ్రాంక్లిన్‌ ఇండియా హైగ్రోత్‌ కంపెనీస్‌ ఫండ్‌ను ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. పెద్ద కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయడం ఒక్కటే కాదు, వ్యాల్యూ ఇన్వెస్టింగ్‌ విధానాన్ని పాటించడం ద్వారా ఈ ఫండ్‌ అధిక రాబడులందిస్తోంది. విలువల పరంగా తక్కువకు లభిస్తున్నవి, భవిష్యత్తులో మార్కెట్ల పెరుగుదల కంటే ఎక్కువ రాబడులనిచ్చేందుకు అవకాశం ఉన్న పెద్ద కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్‌ చేస్తుంది.

పెట్టుబడుల విధానం...
అధిక వృద్ధికి అవకాశమున్న రంగాలు, సత్తా ఉన్న కంపెనీలను ఎంచుకోవడం ఈ ఫండ్‌ మేనేజర్లు అనుసరించే విధానంలో భాగం. వృద్ధి, రిస్క్, వ్యాల్యుయేషన్‌ ఈ మూడింటిని బ్యాలన్స్‌ చేస్తారు. యాక్టివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ విధానంలో వేగంగా వృద్ధి చెందేందుకు కొలమానంగా... ఎంటర్‌ప్రైజ్‌ వ్యాల్యూ, వృద్ధి రేటు, ఈపీఎస్‌ తదితర అంశాలను చూస్తారు.

అలాగే, టర్న్‌ అరౌండ్‌కు అవకాశాలున్నవి, వ్యాపార స్థిరత్వం, యాజమాన్యం నాణ్యత, కార్పొరేట్‌ పాలన, మైనారిటీ వాటాదారుల విషయంలో పారదర్శకత వంటి అంశాలను ఫండ్‌ మేనేజర్లు ఆనంద్‌ రాధాకృష్ణన్, రోషి జైన్, శ్రీకేష్‌ నాయర్‌ స్టాక్‌ ఎంపికలో పాటిస్తారు. ముఖ్యంగా ఈ పథకానికి బ్యాంకింగ్‌ రంగంలో ఎక్కువ ఎక్స్‌పోజర్‌ ఉంది. ప్రస్తుతం బ్యాంకింగ్‌ రంగం గడ్డుకాలం ఎదుర్కొంటోందని ఇన్వెస్టర్లు దృష్టిలో ఉంచుకోవాలి. అయితే ఆర్థిక రంగ వృద్ధిలో పాలు పంచుకునే రంగం కావడంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఆందోళన చెందక్కర్లేదు.

రాబడులు ఇలా ఉన్నాయ్‌...
ఈ పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 60 శాతాన్ని పెద్ద స్థాయి కంపెనీలకే కేటాయించింది. 30 శాతాన్ని మాత్రం మిడ్, స్మాల్‌ సైజు కంపెనీలకు కేటాయించారు. అధిక రాబడుల కోసం బ్యాలన్స్‌ చేయడంగా దీన్ని చూడొచ్చు. అయితే, కేటాయింపులు ఎప్పుడూ ఇదేలా ఉండవు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తుంటారు. గడిచిన ఏడాది కాలంలో 9 శాతం రాబడులను ఇచ్చింది ఈ పథకం.

మూడేళ్ల కాలంలో 9.4 శాతం, ఐదేళ్లలో 22.4 శాతం, పదేళ్లలో 14.7 శాతం వార్షిక ప్రతిఫలాన్ని పంచింది. ఇదే సమయంలో బెంచ్‌ మార్క్‌ సూచీ నిఫ్టీ 500 రాబడులు మూడేళ్లలో 6.7 శాతం, ఐదేళ్లలో 14.7 శాతంగానే ఉండడం గమనార్హం. గత ఆరు నెలల కాలంలో విలువల పరంగా చాలా ఆకర్షణీయంగా ఉన్న ఇన్ఫోసిస్, మహింద్రా అండ్‌ మహీంద్రా, గెయిల్‌ స్టాక్స్‌ను కొనుగోలు చేసింది. 2008లో పథకం ఆరంభం కాగా, అప్పటి నుంచి సూచీలతో పోలిస్తే 4 నుంచి 9 శాతం వరకు అధిక వార్షిక ప్రతిఫలాన్ని అందించింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top