
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో వెల్లువెత్తిన అమ్మకాల కారణంగా తొలుత కుప్పకూలిన దేశీ స్టాక్ మార్కెట్లు చివరికి టర్న్‌అరౌండ్ సాధించాయి. భారీ నష్టాల నుంచి బయటపడి లాభాలతో ముగిశాయి. చివరి గంటలో కొనుగోళ్లు పెరగడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 243 పాయింట్లు జంప్‌చేసి 33,781కు చేరగా.. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 9973 వద్ద నిలిచింది. తొలుత సెన్సెక్స్ 1000 పాయింట్లు పడిపోయి 32,348 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకగా.. తదుపరి 33,856 వద్ద గరిష్టాన్ని చేరింది. ఇక నిఫ్టీ సైతం 9,996 వద్ద గరిష్టాన్నీ, 9544 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది.
మీడియా డీలా
ఎన్‌ఎస్‌ఈలో ఐటీ 1.5 శాతం, మీడియా 1 శాతం చొప్పున డీలాపడగా.. ఆటో 3 శాతం, రియల్టీ 1 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, ఇన్‌ఫ్రాటెల్, శ్రీ సిమెంట్, బజాజ్ ఫైనాన్స్, హీరో మోటో, ఆర్‌ఐఎల్, బజాజ్ ఆటో, టైటన్, అదానీ పోర్ట్స్, ఐషర్ 7.6-2.5 శాతం మధ్య ఎగశాయి. అయితే జీ, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, పవర్‌గ్రిడ్, విప్రో, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, యాక్సిస్, యూపీఎల్, టీసీఎస్ 4.5-1.5 శాతం మధ్య క్షీణించాయి.
అమ్మకాలవైపు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 805 కోట్లు, దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 874 కోట్లు చొప్పున పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. బుధవారం ఎఫ్‌పీఐలు రూ. 919 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా.. డీఐఐలు రూ. 501 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. ఇక మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 491 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. డీఐఐలు రూ. 733 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టిన సంగతి తెలిసిందే.