
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందిన ఉద్యోగ సంఘాలు వారి సమ్మెను వాయిదా వేశాయి. 2012 నుంచి పెండింగ్‌లో ఉన్న ఐడీబీఐ బ్యాంక్ ఉద్యోగుల వేతన సవరణ సమస్యను వెంటనే పరిష్కరించాలన్న డిమాండ్‌తో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) యూనియన్లు డిసెంబర్ 27న సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సమ్మె వాయిదా పడింది.
‘ఐడీబీఐ బ్యాంక్ మేనేజ్‌మెంట్ సమస్యను ఒక నెలలో పరిష్కరిస్తామని హామీనిచ్చింది. అందుకే సమ్మెను వాయిదా వేస్తున్నాం’ అని ఏఐబీఈఏ జనరల్ సెక్రటరీ సీహెచ్.వెంకటచలం తెలిపారు. సమ్మె వాయిదా విషయాన్ని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తమకు తెలియజేసిందని ఆంధ్రా బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ రెండూ వేర్వేరుగా ఎక్సే్చంజ్‌కి నివేదించాయి.