ఉక్కు రంగానికి దివాలా జోష్‌

Accelerate the integration of steel in the Indian steel sector - Sakshi

ఐబీసీ కారణంగా  వేగవంతంగా ఏకీకరణ  

కొత్త కంపెనీల రాకతో  మరింత విస్తృతి 

ప్రపంచ కంపెనీల ప్రవేశానికి  మార్గం సుగమం  

ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌  నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌(ఐబీసీ).. భారత ఉక్కు రంగంలో ఏకీకరణను వేగవంతం చేస్తోందని ఎర్నస్ట్‌ అండ్‌ యంగ్‌(ఈవై) తాజా నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా భారత ఉక్కు రంగంలోకి ప్రవేశించడానికి పలు అడ్డంకులు ఎదుర్కొంటున్న విదేశీ కంపెనీలకు మార్గం సుగమం అవుతోందని ఈ నివేదిక పేర్కొంది. ఇక్కడ జరిగిన ఇండియా మినరల్స్‌ అండ్‌ మెటల్స్‌ ఫోరమ్‌ సమావేశంలో ఈవై పార్ట్‌నర్, ఉక్కు రంగానికి చెందిన అంజనీ అగర్వాల్‌ ఈ నివేదిక వివరాలను వెల్లడించారు. భారత ఉక్కు రంగంపై ఐబీసీ ప్రభావం, సంబంధిత అంశాలపై ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... 
►దివాలా ప్రక్రియ కింద నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వస్తున్న కేసుల్లో అధిక భాగం ఉక్కు రంగానికి చెందినవే ఉన్నాయి. 
► కొత్త దివాలా చట్టం కారణంగా దివాలా ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఫలితంగా ఉక్కు రంగంలో సమూల మార్పులు రానున్నాయి. 
►  దివాలా తీసిన కంపెనీల రుణ భార సమస్య ఐబీసీ కారణంగా వేగవంతంగా పరిష్కారమవుతుంది. కొద్దో, గొప్పో ఉన్న రుణం రెన్యువల్‌ కావడం సులభమవుతుంది.  
►దివాలా ప్రక్రియను ఎదుర్కొంటున్న కంపెనీలను కొనుగోలు చేయడానికి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆ కంపెనీలకు మంచి విలువే దక్కనున్నది.  
►భారత్‌లో భవిష్యత్‌ డిమాండ్‌కు తగ్గట్లుగా ఉత్పత్తుల తయారీకి అనువుగా పలు కంపెనీలు ప్లాంట్ల సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దీనికి కావలసిన భారీ పెట్టుబడులను బ్యాంకింగ్‌ రంగం సమకూర్చగలదు.  
►ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్కు రంగంలో ఏకీకరణ జోరుగా సాగుతోంది. ఇది భారత్‌పై ఇంకా ప్రభావం చూపలేదు. అయితే ఐబీసీ కారణంగా భారత్‌లో కూడా ఉక్కు రంగంలో ఏకీకరణ మరింత వేగవంతం కానున్నది. ఇప్పటికే టాటా స్టీల్‌ ఒక కంపెనీని, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ మరొక కంపెనీని కొనుగోలు చేయడం దీనికి నిదర్శనం.  
►ఏడాదిలోపు దివాలా ప్రక్రియ కిందకు మరిన్ని కంపెనీలు రానున్నాయి.  
►  పునర్వ్యవస్థీకరణ అనంతరం ఏర్పడే కంపెనీల కారణంగా బలమైన లోహ పరిశ్రమ భారత్‌లో నెలకొంటుంది.  
►  ఈ రంగంలో ఇప్పటికే బలంగా ఉన్న కంపెనీలు తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నాయి. మరో వైపు ఇతర రంగాల్లోని కంపెనీలు కొత్తగా ఈ రంగంలోకి వస్తుండటంతో ఈ రంగం విస్తృతి మరింతగా పెరగనున్నది.  
►దేశంలో గవర్నెన్స్‌ ప్రమాణాలు ముఖ్యంగా లోహ, ఉక్కు రంగాల్లో మరింతగా మెరుగుపడనున్నాయి.  
► ఉక్కు రంగానికి సంబంధించి భారత్‌లో అపార అవకాశాలు ఉండటంతో దీర్ఘకాలంలో డిమాండ్‌కు ఢోకా ఉండదని పలు కంపెనీలు భావిస్తున్నాయి. దీంతో ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ఆ కంపెనీలు వెనకాడ్డం లేదు.  
►   మౌలిక రంగంపై ప్రభుత్వం దృష్టి పెడుతుండటంతో ఏడాదికి 30 కోట్ల టన్నుల ఉక్కు వినియోగించాలన్న లక్ష్యం సాకారం కానున్నది.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top