
జగన్‌పై ఎల్లో మీడియా విషప్రచారం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడి యా, కొన్ని పత్రికలు కావాలనే తమ పార్టీ అధినేత
ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడి యా, కొన్ని పత్రికలు కావాలనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్ముతున్నాయని, అందులో భాగంగానే ‘వైఎస్సార్‌సీపీలో నుంచి వారు వెళ్లి పోతున్నారు... వీరు వెళ్లి పోతున్నారు...’ అని గత వారం రోజులుగా దురుద్దేశపూరిత కథనాలు ప్రచారం చేస్తున్నాయని వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు అంబటి రాంబాబు విమర్శించారు. ఆయన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చలేనందుకు చంద్రబాబుపై వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఎల్లో మీడియా జగన్‌ను, వైఎస్సార్‌సీపీని లక్ష్యంగా చేసుకుని విషప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వెళ్లిపోతున్నారని ఒకరోజు, ఉప్పులేటి కల్పన వెళ్లిపోతున్నారంటూ మరోరోజు కథనాలు అల్లి కనీసం వాస్తవాలేమిటో కూడా నిర్థారించుకోకుండా జగన్ కు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని దుయ్యబట్టారు. అద్భుతమైన రీతిలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతుల రుణమాఫీ, ఇంటికొక ఉద్యోగం, డ్వాక్రా మహిళల రుణాల మాఫీతో సహా అనేక వాగ్దానాలు నెరవేర్చలేక పోతున్నందువల్ల రైతులు, విద్యార్థులు, మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ విషయాలను కప్పిపుచ్చేందుకు ఓ వర్గం మీడియా జగన్‌పై తీవ్రస్థాయిలో చేస్తున్న దుష్ర్పచారాన్ని నమ్మవద్దని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వైఎస్సార్‌సీపీని వీడాల్సిన అవసరం నేతలెవ్వరికీ లేదని చెప్పారు.