విజయవాడ : కృష్ణా నదిలో పదుల మంది జల సమాధి

Vijayawada : boat turns over in Krishna river, several dead - Sakshi

పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద బోటు బోల్తా

17 మంది మృతి, మరో ఏడుగురు గల్లంతు..

ప్రాథమిక చికిత్స అనంతరం 9 మంది డిశ్చార్జి

ఆస్పత్రిలో ఆరుగురికి చికిత్స..

హారతి చూసేందుకు వెళ్తుండగా ఘటన..

బోటులో ఒంగోలు వాసులు 32 మంది, నెల్లూరుకు చెందిన వారు ఆరుగురు

అనుమతి లేకుండా బోటు తిప్పుతున్న నిర్వాహకులు.. నిర్వాహకులపై కేసు నమోదు..

సాక్షి, అమరావతి బ్యూరో : కృష్ణా నదిలో ఘోర ప్రమాదం జరిగింది. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో ఆదివారం సాయంత్రం బోటు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడ్డారు. ఏడుగురి జాడ తెలియకుండా పోయింది. ప్రమాద సమయంలో 15 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వీరిలో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం 9 మందిని డిశ్చార్జి చేశారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. మృతుల్లో ఎక్కువ మంది ప్రకాశం జిల్లా ఒంగోలు రంగరాయ చెరువు వాకర్స్‌ క్లబ్‌కు చెందినవారు. పవిత్ర సంగమం వద్ద కృష్ణమ్మ హారతులను చూసేందుకు వెళుతుండగా బోటు బోల్తా పడింది. అనుమతిలేకుండా నిర్వహిస్తున్న బోటు మితిమీరిన సంఖ్యలో పర్యాటకులను ఎక్కించుకోవడం.. బోటు సిబ్బందికి తగిన నైపుణ్యం లేకపోవడం, నదీ మార్గంపై డ్రైవర్‌కు అవగాహన లేకపోవడం, భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని అధికారులు ప్రాథమికంగా తేల్చారు.

రెండు బస్సుల్లో 60 మంది రాక..
ఒంగోలు వాకర్స్‌క్లబ్‌కు చెందిన 60 మంది ఆదివారం ఉదయం రెండు బస్సుల్లో గుంటూరు జిల్లాలోని అమరావతి దేవాలయానికి వెళ్లారు. అక్కడ దర్శనం అనంతరం కృష్ణానదిలో స్నానం చేసేందుకు విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుకున్నారు. స్నానం చేసిన తర్వాత పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద హారతి చూడాలని భావించారు. బోటు సౌకర్యం ఉందని తెలిసి తొలుత పున్నమి ఘాట్‌ వద్ద ఉన్న పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) బోటు సిబ్బందిని సంప్రదించారు. వారు బోట్లు లేవని చెప్పి.. ప్రైవేటు బోటు వెళుతుందని రివర్‌ బోట్స్‌ అండ్‌ ఎడ్వంచెర్స్‌ కంపెనీకి చెందిన బోటును చూపించారు.

ఇసుక దిబ్బ తగిలి....
వాకర్స్‌ క్లబ్‌ సభ్యుల్లో 32 మంది రూ. 300 చొప్పున టికెట్లు తీసుకుని బోటు ఎక్కారు. వారితో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఆరుగురు కూడా ప్రయాణమయ్యారు. ఆ ప్రైవేట్‌ కంపెనీ ఈ బోటు సర్వీసును ఆదివారం ఉదయమే ప్రారంభించింది. 38 మంది ప్రయాణికులతో సాయంత్రం 4.20 గంటలకు పున్నమి ఘాట్‌లో బయలు దేరి సాయంత్రం 5.10 గంటల సమయంలో పవిత్ర సంగమం ఘాట్‌ సమీపానికి చేరుకుంది. మరికాసేపట్లో ఒడ్డుకు చేరుతారనగా బోటును ఘాట్‌ వైపునకు తిప్పే క్రమంలో ఇసుక దిబ్బ అడ్డు తగిలింది. అదే సమయంలో పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీరు ఉధృతంగా నదిలోకి రావడంతో బోటు కుదుపునకు గురై బోల్తా పడింది. బోల్తా పడిన వెంటనే బోటు డ్రైవర్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు.

కొనసాగుతున్న గాలింపు చర్యలు
కొందరు బోటు అంచులను గట్టిగా పట్టుకుని నీటిలోనే ఉండగా, కొందరికి తాడు దొరకడంతో దాన్ని పట్టుకుని బోటు పైకి వచ్చేందుకు ప్రయత్నించారు. బాధితులు గట్టిగా ఆర్తనాదాలు చేయడంతో ఘాట్‌పై ఉన్నవారు బోటు బోల్తా పడిందని గుర్తించారు. వెంటనే గజ ఈతగాళ్ల వెళ్లి బోటును పట్టుకుని వేళ్లాడుతున్నవారిని రక్షించారు. బోటు కింద ఉండిపోయిన వారంతా గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతయినవారిలో 14 మృతదేహాలను బయటకు తీసుకొచ్చారు. మరో ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. నదిలో గల్లంతు అయినవారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. చీకటి పడిపోవడంతో సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడింది. బోటు ఎక్కిన వెంటనే ప్రయాణికులు లైఫ్‌ జాకెట్లు అడగ్గా డ్రైవర్‌ లేవని సమాధానం చెప్పాడు. లైఫ్‌ జాకెట్లు వేసుకుని ఉంటే ఇంత మంది చనిపోయి ఉండేవారు కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

సకాలంలో సహాయక చర్యల్లో విఫలం...
ప్రమాదం జరిగిన వెంటనే తగినసహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం చెందింది. దీంతో మృతుల సంఖ్య పెరిగింది. ప్రమాదం ఆదివారం సాయంత్రం 5.15 గంటలకు జరిగింది. ఆ వెంటనే స్థానికులు 100 కు ఫోన్‌ చేసి సమాచారం అందించారు. విషయం తెలిసిన 10 నిమిషాలకే వైఎస్సార్‌ సీపీ నేతలు కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, ఉదయభాను తమ అనుచరులతో ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. కానీ అధికార యంత్రాంగం మాత్రం దాదాపు 45 నిమిషాల తర్వాత ఘటనా స్థలికి చేరుకుంది. పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద స్పీడ్‌ బోట్లు, తగిన ఉపకరణాలు కూడా లేవు. ఇంతలో చీకటి పడింది. సహాయకచర్యలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

మూడు గంటల తర్వాత మృతుల వివరాలు ప్రకటన....
కలెక్టర్‌ లక్ష్మీకాంతం, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ గౌతం సవాంగ్, డీసీపీ కాంతిరాణా, ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. దాదాపు మూడు గంటల తరువాత 17 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో 15 మందిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారు.

డ్రైవర్‌కు అనుభవం లేదు
డ్రైవర్‌కు అనుభవం లేకపోవడం, ప్రమాదకరమైన ప్రాంతంలో బోటింగ్‌కు ప్రభుత్వం అనుమతివ్వడమే పడవ బోల్తా పడటానికి ప్రధాన కారణాలని తెలుస్తోంది. పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద పోలవరం కాలువ (పట్టిసీమ ఎత్తిపోతల నుంచి) నుంచి నీరు ఉద్ధృతంగా కృష్ణలో కలిసే చోటుకు డ్రైవర్‌ బోటును పోనిచ్చారు. ప్రవాహానికి దగ్గరగా వెళ్లి అక్కడి నుంచి బోటును ఘాట్‌ వైపు తిప్పే ప్రయత్నంలో బోటును కంట్రోల్‌ చేయలేకపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలువ నుంచి నీరు నదిలో కలిసే ప్రదేశానికి దూరంగా బోటును తీసుకెళ్లి అక్కడి నుంచి ఘాట్‌ వైపునకు తిప్పితే ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. కానీ డ్రైవర్‌ కాలువ ప్రవాహానికి దగ్గరగా తీసుకెళ్లడం వల్ల మునిగిపోయిందని చెబుతున్నారు. మిగిలిన బోట్లను కాలువ ప్రవాహానికి దూరంగా తీసుకెళ్లి ఘాట్‌ వైపునకు తిప్పుతారని, కానీ డ్రైవర్‌ ఈ ప్రాంతంలో బోటు నడపడం కొత్తకావడంతో తెలియక ప్రవాహం దగ్గరికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. అధికార యంత్రాంగం ఈ ప్రాంతంలో పడవ ఎలా నడపాలనే దానిపై తగిన సూచనలివ్వకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.

ఈదుకుంటూ ఒడ్డుకొచ్చా : హరిబాబు
ఒక్కసారిగా పడవ కుదుపులతో ఊగి బోల్తా పడిందని అందులో ప్రయాణించిన ఒంగోలుకు చెందిన హరిబాబు ‘సాక్షి’కి చెప్పారు. మొదటిసారి కుదుపు వచ్చినప్పుడే డ్రైవర్‌ని అడిగితే ఏమీ కాదని చెప్పాడని, తర్వాత వెంటనే రెండు, మూడు కుదుపులు వచ్చాయని తెలిపారు. పట్టిసీమ నీరు కృష్ణానదిలో కలిసేది ఇక్కడేనని డ్రైవర్‌ చూపిస్తుండగానే బోటు బోల్తా పడిందని తెలిపారు. తాను ఎలాగో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలతో బయటపడ్డానన్నారు.

17మంది మృతి : జిల్లా కలెక్టర్‌
బోటు బోల్తా ప్రమాదంలో 17 మంది మృతి చెందినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం అధికారికంగా ప్రకటించారు. మరో 17 మందిని రెస్క్యూ టీం రక్షించాయన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్, రెస్క్యూటీంలు ఇంకా గాలింపు చర్యలు చేపడుతున్నాయని తెలిపారు.

మధ్యాహ్నం 4.20 గంటలు     : పున్నమి ఘాట్‌ వద్ద బయలు దేరిన బోటు
సాయంత్రం 5 గంటలు     : విజయవాడ హెడ్‌ వాటర్‌ వర్క్స్‌ వద్దకు చేరిన బోటు
సాయంత్రం 5.10 గంటలు    : పవిత్ర సంగమం ఘాట్‌ సమీపానికి చేరుకున్న బోటు
సాయంత్రం 5.15 గంటలు    : ఘాట్‌కు చేరుకోకుండానే బోల్తా పడిన బోటు

మృతుల వివరాలు
1. పసుపులేటి సీతారామయ్య (64)
2. కె.ఆంజనేయులు (58)
3. రాయపాటి సుబ్రహ్మణ్యం (60)
4. కోవూరు లలిత (35)
5. కె.వెంకటేశ్వరరావు (48)
6. రాజేష్‌ (49)
7. హేమలత (49)
8. దాచర్ల భారతి (60)
9. జెట్టి ప్రభాకర్‌రెడ్డి (50)
10. అంజమ్మ (55)
11. వెన్నెల సుజాత (40)
12. అరవపల్లి గుర్నాథరావు
13. కోవూరు కోటేశ్వరరావు (40)
14. సాయన కోటేశ్వరరావు
15. సాయన వెంకాయమ్మ
16. తుప్పాటి కుసుమ (56)
17. ఒక మృతదేహాన్ని గుర్తించాల్సివుంది

గల్లంతైన వారు
1. వెన్నెల రమణ
2. పి.ఉషారాణి
3. గాజర్ల శివన్నారాయణ
4. కోలా కోటేశ్వరరావు
5. కోలా వెంకాయమ్మ
6. తుప్పాటి బిందుశ్రీ
7. కూరపాటి నారాయణరావు

చికిత్స పొందుతున్నవారు (వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది)
1. డి.విజయశ్రీ
2. జె.శ్రీలక్ష్మి
3. బి.లక్ష్మి
4. కె.ఉషారాణి
5. భూలక్ష్మి
6. ఆర్‌.సుబ్బాయమ్మ

మరో 9 మంది ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top