ఓటేయాలంటే ఒక రోజు ముందే కొండలు దిగాలి!

Tribal Villages People Suffering Transport For Voting - Sakshi

నాతవరం (నర్సీపట్నం) : విశాఖ జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటేయాలంటే కొండలు దాటి సుమారు 10 కిలోమీటర్ల దూరం నడవాలి. నాతవరం మండలంలో 27 గ్రామ పంచాయతీల్లో 82 శివారు గ్రామాలు ఉన్నాయి. వీటిలో 16 గ్రామాలు గోదావరి జిల్లాల సరిహద్దులో కొండల మీద ఉన్నాయి. వారు ఓటు వేసేందుకు అధికారులు 65 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొండల మీద ఉన్న గ్రామాల గిరిజనులు ముందు రోజు కొండల పైన నుంచి నడిచి రాత్రికి సరుగుడు గ్రామంలో నిద్ర చేసి మరుసటి రోజున ఓటు వేసి తమ ఇంటికి వెళ్తుంటారు.

వృద్ధుల్లో చాలామంది కొండల పై నుంచి నడిచి రాలేక ఓటు వేయడానికి వెనుకంజ వేస్తున్నారు. సరుగుడు గ్రామంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 3,800 మంది గిరిజనులు ఓట్లు వేస్తారు. పోలింగ్‌ కేంద్రానికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో కొండలపైన సుందరకోట అసనగిరి, తోరడ, బమ్మిడికలొద్దు, కొత్త సిరిపురం, ముంతమామిడిలొద్దు, కొత్త లంకల గ్రామాలు ఉన్నాయి. కొండల దిగువ ప్రాంతాల్లో యరకంపేట, రాజవరం, మాసంపల్లి, దద్దుగుల, రామన్నపాలెం, అచ్చంపేట గ్రామాలు పోలింగ్‌ కేంద్రానికి 2 నుంచి 4 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. దీంతో ఈ గ్రామాల ప్రజలు కూడా ఓటు వేయాలంటే నడిచి వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

కలిసొచ్చిన క్రాస్‌ ఓటింగ్‌
2009 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ పరిధిలో క్రాస్‌ ఓటింగ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి డాక్టర్‌ చింతామోహన్‌ను ఒడ్డెక్కించింది. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, ఒకచోట పీఆర్పీ అభ్యర్థి గెలుపొందినా, లోక్‌సభకు వచ్చేసరికి జరిగిన క్రాస్‌ ఓటింగ్‌ ఆయనకు కలిసొచ్చింది. గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నుంచి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించగా, తిరుపతి నుంచి పీఆర్పీ అభ్యర్థి చిరంజీవి గెలుపొందారు. కాంగ్రెస్‌ సర్వేపల్లి నుంచి మాత్రమే విజయం సాధించింది. అయితే లోక్‌సభకు వచ్చేసరికి చింతామోహన్‌ 18,059 ఓట్ల ఆధిక్యంతో నెగ్గారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top