'ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన.. '

'ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన.. ' - Sakshi


'ఎవడురా నా భరతజాతిని కప్పమడిగిన తుచ్చుడు

ఎవడు ఎవడా పొగరుబట్టిన తెల్లదొరగాడెవ్వడు

బతుకు తెరువుకు దేశమొచ్చి బానిసలుగా మమ్మునెంచి

పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా..'


- అల్లూరి సీతారామరాజు వీరత్వానికి నిలువెత్తు నిదర్శనం ఈ వాక్యాలు.నేడు అల్లూరి సీతారామరాజు జయంతి

తెల్లదొరలను హడలెత్తించిన మన్యం వీరుడు

భారత స్వాతంత్య్ర చరిత్రలో మహోన్నత శక్తి

సాయుధ పోరాటానికి ప్రాణాలర్పించిన ఉద్యమ ధీరుడు


 

సాక్షి: తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు.. భారత స్వాతంత్య్ర చరిత్రలో మరపురాని మైలురాయిగా మిగిలిపోయాడు. సాయుధ పోరాటం ద్వారానే భరతమాతకు స్వేచ్ఛావాయువులు సాధ్యమని నమ్మి దాని కోసమే త్రుణప్రాయంగా ప్రాణాలర్పించిన విప్లవ వీరుడు అల్లూరి. బ్రిటిష్ సైన్యానికి కునుకులేకుండా చేసిన ఈ మన్యం వీరుడు.. 27 ఏళ్ల వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులైన అనుచరులతో, పరిమితమైన వనరులతో రవి అస్తమించని సామ్రాజ్యమనే మహాశక్తిని తన గుండెబలంతో ఢీకొన్నాడు. దిక్కులు పిక్కటిల్లేలా వందేమాతరమంటూ నినదించాడు. నేడు అల్లూరి సీతారామరాజు జయంతి. ఈ నేపథ్యంలో ఆ మహనీయుని జీవిత విశేషాలు తెలుసుకుందాం.

 

బాల్యం, విద్యాభ్యాసం..

అల్లూరి సీతారామరాజు 1897 జూలై 4న వెంకట రామరాజు, సూర్యనారాయణమ్మలకు జన్మించారు. అల్లూరి సీతారామరాజుగా సుప్రసిద్ధుడైన ఈ మన్యం వీరుని అసలు పేరు శ్రీరామరాజు. అల్లూరి స్వగ్రామం పశ్చిమగోదావరి జిల్లాలోని మోగల్లు అయినప్పటికీ విజయనగరం దగ్గర పాండ్రంగిలో తన తాత ఇంట్లో జన్మించారు. తల్లి విద్యావంతురాలు. రామరాజుకు చిత్రకళ, ఫొటోగ్రఫీలో అభిరుచి ఉండేది.ఆరో తరగతి చదువుతున్నపుడే తండ్రి మరణించాడు. పేదరికం కారణంగా కుటుంబం ఇక్కట్లపాలైంది. ఈ క్రమంలో అనేక ప్రాంతాలకు మారాల్సి వచ్చింది. 1909లో భీమవరం వద్ద కొవ్వాడ గ్రామానికి నివాసం మార్చారు. భీమవరం మిషన్ హైస్కూలులో రామరాజు చేరాడు. కుటుంబ పరిస్థితులు చదువుపై ప్రభావం చూపాయి. 1911లో రాజమండ్రిలో ఆరో తరగతి, 1912లో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఏడో తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. చిన్నప్పటి నుంచి సీతారామరాజుకు దైవభక్తి, నాయకత్వ లక్షణాలు, దానగుణం అధికంగా ఉండేవి. తుని సమీపంలో పెదతల్లి ఉన్న గోపాలపట్నంలో సీతమ్మ కొండపై రామలింగేశ్వరాలయంలో కొంత కాలం తపస్సు చేశాడు. మిత్రుడు పేరిచర్ల సూర్యనారాయణ రాజుతో కలిసి మన్యం ప్రాంతాల్లో పర్యటించేవాడు.మన్యం ప్రజల్లో చైతన్యం..

 మన్యం వాసుల కష్టాలు కడతేర్చడానికి, తెల్లదొరల దోపిడీని ఎదుర్కోవడానికి గిరిజనులకు అండగా నిలిచి పోరాటం చేయాలని రాజు నిర్ణయించుకున్నాడు. వారికి తమ హక్కులను వివరించి ధైర్యాన్ని నూరిపోశాడు. అన్యాయాన్ని ఎదిరించేలా జాగరూకత పెంచాడు. చుట్టుపక్కల 30, 40 గ్రామాల ప్రజలకు రాజు నాయకుడయ్యాడు. గిరిజనులను సమీకరించి, దురలవాట్లకు దూరం చేసి వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పి పోరాటానికి సిద్ధహస్తుల్ని చేశాడు.తెల్ల దొరల పాలిట ప్రచండుడు..

1922 ఆగస్టు 22న మన్యంలో తిరుగుబాటు ప్రారంభమైంది. రంపచోడవరం, ఏజెన్సీలోని చింతపల్లి పోలీసు స్టేషనుపై 300 మంది విప్లవ వీరులతో రాజు దాడి చేసి, రికార్డులను చింపేసి, తుపాకులు, మందుగుండు సామగ్రిని తీసుకెళ్లాడు. ఆ సమయంలో స్టేషన్‌లో ఉన్న పోలీసులకు ఎలాంటి హానీ తలపెట్టలేదు. కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం.. ఇలా అన్ని పోలీసు స్టేషన్లపై దాడి చేయడం, పోలీసు సిబ్బంది వద్ద ఆయుధాలు లాగేసుకోవడం మొదలు పెట్టాడు. ఈ విప్లవం తెల్లదొరల్లో వణుకు పుట్టించింది. ఎంత ప్రయత్నించినా అల్లూరిని బ్రిటిష్ సైన్యం నిర్బంధించలేకపోయింది.అసువులు బాసిన యోధుడు..

చివరకు విప్లవ వీరులంతా లొంగిపోకపోతే మన్యం ప్రజలను చిత్రహింసలు పెట్టి ఒక్కొక్కరిగా చంపేస్తామంటూ బ్రిటిష్ దొర రూథర్‌ఫర్డ్ ప్రకటించాడు. ఇది విని ప్రజలకు బాధలు కలిగించకూడదని తాను లొంగిపోయేందుకు అల్లూరి సీతారామరాజు సిద్ధమయ్యాడు. 1924 మే 7న కొయ్యూరు గ్రామ సమీపంలో ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు చుట్టుముట్టి రాజును బందీగా పట్టుకున్నారు. అక్కడే ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణా లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు. అతని చితాభస్మాన్ని సమీపంలోని వరాహ నదిలో కలిపారు. అలా 27 ఏళ్ల వయసులోనే అల్లూరి భరతమాత ముద్దుబిడ్డగా ప్రాణాలర్పించి వీరునిగా నిలిచాడు.

 

విశేషాలు..

భారత తపాలా శాఖ 1986లో అల్లూరి సీతారామరాజు పేరిటస్మారక తపాలా బిళ్లను విడుదల చేసింది.

1929లో మహాత్మాగాంధీ ఆంధ్రపర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించారు.

‘సీతారామరాజు మరణించినా అతడు రగిలించిన విప్లవాగ్ని చల్లారలేదురా తమ్ముడూ! వీరుడు మరణించడు. విప్లవానికి పరాజయం లేదు. చిందిన వీరుని రక్తం చిరకాలం ప్రవహిస్తూనే ఉంటుంది’ అని సీతారామరాజు బుర్రకథ ముగింపులో ఉంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top