సర్కారుకు ముద్రగడ షాక్‌

సర్కారుకు ముద్రగడ షాక్‌ - Sakshi

అనూహ్యంగా ‘చలో అమరావతి’ పాదయాత్రను చేపట్టిన కాపు ఉద్యమనేత


 


జగ్గంపేట: కాపులకిచ్చిన హామీల్ని నెరవేర్చా లని తలపెట్టిన ‘చలో అమరావతి’ పాద యాత్రను నెల రోజులుగా అడ్డుకుంటున్న రాష్ట్రప్రభుత్వానికి కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అనూహ్య రీతిలో షాకిచ్చారు. పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా వంటావార్పూ పిలుపుతో భారీగా తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలివచ్చిన కాపు నేతలు, కాపులతో కలసి ఆయన ఆదివారం ఉదయం 11.20 గంటలకు తన నివాసం నుంచి ఒక్కసారిగా పాదయాత్రను చేపట్టారు. కంగు తిన్న పోలీసులు యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.



అయితే తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ పోలీసులను తోసుకుంటూ కిలోమీటర్‌ దూరంపాటు పాదయాత్ర కొన సాగింది. అనంతరం పోలీసులు అప్రమత్తమై యాత్రను నిలువరించారు. దీంతో అక్కడే బైఠాయించిన ముద్రగడ నిరసన తెలిపారు. చివరకు సాయంత్రం 4.30 గంటలకు వీరవరం వద్ద ముద్రగడను అదుపులోకి తీసుకున్న పోలీసులు కిర్లంపూడికి తరలిస్తున్నట్టు చెప్పారు. అయితే ఆయన్ను వీరవరం, రామచంద్రపురం, తామరాడ, పాలెం, జగ్గంపేట మండలం రామవరం మీదుగా జాతీయరహదారి వైపు తరలిం చారు. ఈ క్రమంలో అభిమానులు, కాపులు అడుగడుగునా అడ్డగించారు. దీంతో రాత్రి పదిగంటలకు ఆ వాహనం రామవరం చేరుకోగా ముద్రగడ అభిమానులు, కాపులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతైనా ఇవ్వండి లేదా అరెస్ట్‌ చేయండంటూ ముద్రగడ బీష్మించారు. చివరికి రాత్రి 11.45 గంటలకు ముద్రగడను కిర్లంపూడి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

 


లక్ష్యం నెరవేరేదాకా పోరు ఆగదు


లక్ష్యం నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. తుపాకులతో కాల్చినా, లాఠీలతో కొట్టినా ఉద్యమాన్ని వదిలిపెట్టబోమని, ఎన్ని కేసులు పెట్టినా బాధపడమని అన్నారు. పాదయాత్రను అడ్డుకుని నెలరోజులైన నేపథ్యంలో ఆదివారం ఉదయం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాలతో సిగ్గూలజ్జా లేకుండా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. ఎవరిని ఓడించాలో, ఎవరిని నెగ్గించాలో కాపు జాతికి చెప్పనక్కర్లేదన్నారు. 


 


కాపు ఉద్యమం ఉధృతం


విజయవాడలో సమావేశమైన కాపు నాయకులు


సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్‌ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని విజయవాడలో ఆదివారం సమావేశమైన కాపు ప్రతినిధులు హెచ్చరించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరుల సమావేశంలో తెలగ, బలిజ, కాపు అడహక్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ ఇమ్మడి సత్యనారాయణ మాట్లాడుతూ కాపు రిజర్వేషన్‌ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ముద్రగడతో కలసి పనిచేస్తామన్నారు. రాజకీయాలకు అతీతంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీతోపాటు జిల్లాల వారీగా కమిటీలు ఏర్పాటవుతాయన్నారు. బలిజ, తెలగ, కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను మోసం చేస్తున్నారన్నారు. త్వరలోనే తమ పాలసీని ప్రకటిస్తామని వివరించారు. 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top