గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
- అధికారులకు ప్రభుత్వం ఆదేశం
- జిల్లాలో రూ.11 కోట్ల పనులకు బ్రేక్
-ఆగిన చెరువు మరమ్మతులు
- ఆందోళనలో రైతాంగం
సాక్షి, నెల్లూరు: గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలో చేపట్టిన చెరువుల మరమ్మతు పనులను వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇరిగేషన్) ఇదాత్యనాథ్‌దాస్ జిల్లా మైనర్ ఇరిగేషన్ అధికారులకు ఉత్తర్వులు పంపారు. ఈ ఉత్తర్వుల్లో వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు. మైనర్ ఇరిగేషన్ పరిధిలో జిల్లాలో 1716 చెరువులు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా చెరువుల తూములు, ప్రధాన కాలువలు పాడు అయ్యాయి.
వీటి మరమ్మతుల కోసం అధికారుల ప్రతిపాదనల మేరకు గత ప్రభుత్వం రూ.11 కోట్ల నిధులతో పనులు మంజూరూ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ మేరకు నార్మల్ స్టేట్ ప్లాన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా రూ.5 లక్షలు, రూ.10 లక్షలు చొప్పున పనులు విభజించి స్థానిక నేతలకు అప్పగించారు.
జిల్లాలో అప్పట్లో ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో అధిక శాతం చెరువుల మరమ్మతు పనులు కేటాయించారు. మిగిలిన నియోజక వర్గాల్లో నామమాత్రంగానే అధికారులు పనులు మంజూరు చేశారు. ఆత్మకూరు నుంచి అప్పటి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తుండడంతో ఆ నియోజక వర్గానికి 60 శాతం పనులు మంజూరు చేసినట్టు ఆరోపణలొచ్చాయి.
ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కార్యకర్తలకు పనులు ఎరగా వేశారన్న ప్రచారమూ జరిగింది. వెంటనే ఎన్నికలు రావడంతో కోడ్ పుణ్యమాని ఒకరిద్దరు మినహా ఎవరూ పనులు చేయలేక పోయారు.రూ.11 కోట్ల పనులకు గాను రూ.కోటి లోపు పనులు మాత్రమే జరిగినట్టు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. చంద్రబాబు సర్కార్ రూ.10 కోట్ల పనులన్నింటినీ వెంటనే నిలిపి వేయాలంటూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఇరిగేషన్ కార్యాలయాలకు సోమవారం ఉత్తర్వులు పంపింది.
అధికారుల విస్మయం: వచ్చేది వర్షాకాలం. జిల్లాలో పలు చెరువులు దెబ్బతిన్నాయి. వెంటనే మరమ్మతులు చేయకపోతే రాబోయే సీజన్‌లో రైతులకు ఇబ్బందులు తప్పవు. తీరా మరమ్మతులు చేసే సమయంలో ప్రభుత్వం ఏకంగా పనులు రద్దుచేయడం దారుణమని ఇరిగేషన్ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నేడు ఇంజనీరింగ్ అధికారుల సమావేశం: ప్రభుత్వం ఆదేశాలతో మైనర్ ఇరిగేషన్ అధికారులు మంగళవారం జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో సమావేశం కానున్నారు. జిల్లావ్యాప్తంగా 10 నెలల్లో మంజూరైన పనులు,వాటి పురోగతిపై చర్చించనున్నారు.