టీడీపీకి కొమ్ము కాసిన ఎస్సై

SI Supported To TDP In Prakasam - Sakshi

పంచాయతీ కార్యదర్శి కూడా ఇదే పరిస్థితి

బూత్‌లైన్‌లో సైకిల్‌కు ఓట్లు వేయండని ప్రచారం

సాక్షి, కె.పల్లెపాలెం (ప్రకాశం): గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్థానిక ఎస్సై కొక్కిలగడ్డ విజయకుమార్‌ ఒక వర్గానికి  కొమ్ము కాశారని స్థానిక వైఎస్సార్‌సీపీ నాయుకులు నిరసన వ్యక్తం చేశారు. ఒక వర్గాన్ని వెనుక వేసుకుని, వారికి అనుకూలంగా వ్యహరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను బూత్‌లోనికి అనుమతించారని, వైఎస్సార్‌సీపీ నాయకులను లాఠీచార్జి చేస్తూ దూరంగా తరిమి కొడుతున్నారని చెప్పారు. ఈవీఎంలు, ఈవీ ప్యాట్స్‌ ఆలస్యంగా  ప్రారంభిస్తే ఓటు వేయలేక పోయామని ఒక బాధ ఉంటే దీనికి తోడు ఎస్సై ఒక వర్గాన్ని ప్రోత్సహించి ఒకే సామాజిక వర్గానికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టారు.

మండలంలో 53 బూత్‌లో ఉంటే కేవలం పల్లెపాలెం కేంద్రంగా తీసుకుని మధ్యాహ్నం నుంచి పల్లెపాలెంలోనే మకాం వేసి టీడీపీ వర్గానికి అనుకూలంగా వ్యహరించారని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు వేసిన వారిని ఇంటికి పంపించకుండా ఒక వర్గానికి కొమ్ము కాయడం వల్ల మరొక వర్గం కాపలా కాయడం జరిగే పరిస్థితి నెలకొంది. సంబంధం లేని వ్యక్తులను లోనికి పంపడం వల్ల సైకిల్‌కు ఓటు వేయమని, వేయక పోతే చౌక దుకాణంలో బియ్యం  ఇవ్వనని ఓటుకు ప్రలోభాలు పెట్టారన్నారు. ఓటర్లు ఫిర్యాదు చేసిన ఎస్సై పట్టించుకో లేదన్నారు.

ఒక వర్గానికి కొమ్ము కాయడం, బూత్‌లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయమని ప్రచారం చేయడం వల్ల 300 ఓట్లు టీడీపీ పడ్డాయని మాజీ సర్పంచ్‌ అభ్యర్థి విశనాథపల్లి ఆనంద్‌రావు  ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పంచాయతీ కార్యదర్శి సురేష్‌ కూడా పంచాయతీ నిబంధనలు, ఎన్నికల నిబంధనలు అతిక్రమించి ఒక వర్గానికి కొమ్ముకాశారని ఆరోపించారు. బూత్‌ దగ్గర మంచినీరు, భోజనం ఇతర పనులు చేయడానికి తమ సిబ్బందిని ఉపయోగించుకోకుండా టీడీపీ వ్యక్తులను పెట్టుకున్నారని వారు బూత్‌ల్లో సైకిల్‌కు ఓటు వేయాలని ప్రచారం చేశారు. డీఎల్‌పీఓకు అర్జీ పూర్వకంగా, ఎస్సైపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top