వామ్మో..నెల్లూరు!

Scrap And Dumping On Roads In PSR Nellore - Sakshi

అడుగుకో గొయ్యి..కుప్పలు తెప్పలుగా చెత్త

నరకానికి ప్రతి రూపం నగరం దుమ్ము,ధూళితో యాతన

కనీసం మంచినీళ్లు సరఫరా చేయలేని స్థితిలో నగరపాలక సంస్థ

చోద్యం చూస్తున్న మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌  

నెల్లూరు నగరం నరకానికి ప్రతి రూపంగా మారింది. ఎటు చూసినా అధ్వానమైన రోడ్లు, కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన చెత్తాచెదారాలతో నగర ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దూమ్ము, ధూళి, వానొస్తే రొచ్చు, రోడ్లు ఎక్కి పారుతున్న మురుగు నీటితో జనం రోడ్డు మీదకు వచ్చేందుకు వణికిపోతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన పొంగూరు నారాయణ మున్సిపల్‌ శాఖ మంత్రిగా.. అబ్దుల్‌ అజీజ్‌ నగర పాలక సంస్థ మేయర్‌గా వెలగబెట్టుతున్నారు. వీరు నెల్లూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి పథంలో నిలబెట్టి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్‌లో, దేశంలోనే అగ్రస్థానంలో ఉంచుతామని బీరాలు పోతున్నారు. ఏడాదిన్నరగా నెల్లూరు ప్రజలకు ప్రత్యక్షంగా నరకాన్ని చూపిస్తున్న పాలకులు ఇంకొన్ని రోజులు కష్టపడాలంటూ హితబోధ చేస్తూ తమ అసమర్థను కప్పిపుచ్చుకుంటున్నారు.  

నెల్లూరు సిటీ:   నెల్లూరు నగరం జిల్లా కేంద్రం. పెద్ద పెద్ద భవంతులు. విశాలమైన రోడ్లు. మధ్యలో సుందరంగా కనిపించే డివైడర్లు, సెంట్రల్‌ లైటింగ్‌. పైకి కనిపించకుండా పారే మురుగునీరు. ఎటు చూసినా సిమెంట్‌ రోడ్లు. రోడ్డుపై కనిపించని చెత్తా చెదారాలు. ఇలా గ్రామీణ ప్రజలు నెల్లూరును ఊహించుకుంటారు. కానీ నెల్లూరు నగరం ఇందుకు భిన్నంగా ఉంది. రోడ్డు ఎక్కితేకాని తెలియదు నగర వాసుల దుస్థితి.
నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 1.70 లక్షలు కుటుంబాలు ఉన్నాయి. 7 లక్షల మందికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. నగరంలోని ప్రధాన రహదారులు అయ్యప్పగుడి నుంచి వేదాయపాళెం, దర్గామిట్ట, కేవీఆర్‌ పెట్రోల్‌ బంక్, వీఆర్సీ సెంటర్, గాంధీబొమ్మ, ఆత్మకూరు బస్టాండ్‌ వరకు రోడ్లు దుమ్ము, ధూళితో నిండిపోయాయి. మినీబైపాస్‌ రోడ్డులోని బీవీగనర్, కొండాయపాళెం గేటు మీదుగా ఆత్మకూరు బస్టాండు వరకు ఇదే పరిస్థితి నెలకొంది. వాహనచోదకులు రోడ్లపై వాహనాలను నడపలేనిపరిస్థితి ఏర్పడింది. కళ్లలో దుమ్ము పడుతుడడంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. మరో వైపు చిన్నారులు దుమ్ముతో అనారోగ్యాల బారిన పడుతున్నారు. కార్పొరేషన్‌ అధికారులు రోడ్లపై దుమ్మును శుభ్రం చేసే ప్రయత్నాలు చేయడం లేదు. లక్షలు ఖర్చు పెట్టి రోడ్లు శుభ్రం చేసే మిషన్లు కొనుగోలు చేసినా..ఫలితం లేకుండా పోయింది.

అడుగుకొక గొయ్యి
భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పైప్‌లైన్‌ పనుల నేపథ్యంలో సిమెంట్‌ రోడ్లను ధ్వంసం చేశారు. అయితే పనులు పూర్తయిన తర్వాత  వెంటనే రోడ్లు వేస్తామని చెబుతున్న అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. రోడ్లలో గుంతలు ఏర్పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఏ రోడ్డులో ఎప్పుడు పనులు జరుగుతాయో తెలియని పరిస్థితి. పొద్దున ఖాళీగా ఉన్న రోడ్డు.. మధ్యాహ్నం క్లోజ్‌ చేసి పనులు చేపడుతుంటారు. ఏ వీధిలో పని జరుగుతుందో ఆ వీధి చివర ప్రారంభంలో బోర్డులు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వాహనచోదకులు రోడ్డు చివరి వరకు వచ్చి వాహనాలు వెళ్లేందుకు దారిలేక వెనుతిరిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వీధిలోకి వెళ్లినా ఇదే పరిస్థితి. గుంతలు తవ్విన రోడ్డును పూర్తిస్థాయిలో పూడ్చకుండా పైపై పూతలు వేయడంతో గుంతల్లో వాహనాలు ఇరుక్కు పోతున్నాయి. వృద్ధులు, చిన్నారులు ప్రమాదాలకు గురవుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలే కాదు.. పాదచారులు కూడా జారిపడి గాయపడిన ఘటనలు ఇటీవల కాలంలో కోకొల్లలుగా జరిగాయి. భారీ వర్షాలు కురిస్తే నగర వాసులకు అడుగుకొక గండం తప్పదు.

నీటి కోసం తిప్పలు
ఎన్నడూ లేని విధంగా నగరంలోని భూగర్భ జలాలు ఇంకిపోయాయి. ముఖ్యంగా బాలాజీనగర్, మూలాపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, స్టౌన్‌హౌస్‌పేట ప్రాంతాల్లో నీళ్లు లేక అవస్థలు ఎదుర్కుంటున్నారు. కార్పొరేషన్‌ నుంచి సరఫరా అయ్యే నీరు సైతం కొన్ని ప్రాంతాల్లో వారాలు పాటు రాని పరిస్థితి ఉంది. భూగర్భ డ్రెయినేజీ, తాగునీటి పనుల నేపథ్యంలో వాటర్‌ పైప్‌లైన్‌లు పగిలిపోతున్నాయి. దీంతో ఇళ్ల యజమానులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కార్పొరేషన్‌ అధికారులు మాకు సంబంధం లేదని,  ప్రజారోగ్య శాఖ తమ పని కాదని ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేయడం లేదు. రెండు పథకాలకు సంబంధించి పనులను ఎల్‌అండ్‌టీ, మెగా కంపెనీలు సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పగించడంతో వారు ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం అడుగడుగునా ప్రతి వీధిలో ఇదే పరిస్థితి ఉంది.

అనారోగ్యం బారిన ప్రజలు
నగరాన్ని సుందరీకరణ చేస్తానన్న మంత్రి నారాయణ మాటలు ఏమో కానీ.. ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. రోడ్లపై వెళ్లే సమయంలో దుమ్ము దూళి వ్యాపించి కళ్ల సమస్యలు, ఇతర జబ్బులకు లోనవుతున్నారు. చెత్తాచెదారాలు పేరుకుపోవడంతో వీధుల్లో దుర్వాసన వెలువడుతోంది. దోమలు వ్యాప్తి చెంది విషజ్వరాలకు గురి చేస్తున్నాయి. తాగునీరు మురుగు మయమవడంతో నగర వాసులు అనేక సమస్యలతో సతమవుతున్నారు. ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. మరికొంత కాలంగా కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.

ఎక్కడి చెత్త అక్కడే
మూలిగే నక్క పైన తాటికాయపడ్డట్టు నగర వాసుల పరిస్థితి మారింది. ఓ వైపు గుంతల రోడ్లు, దుమ్ము దూళితో అల్లాడిపోతుంటే మరో పక్క నగరపాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే కుప్పలు కుప్పలుగా పేరుకుపోయింది. గత 22 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు 279 జీఓకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు. సమ్మెను విరమింప చేయడం.. పరిస్థితిని చక్కదిద్దాల్సిన అధికారులు వైఫల్యం చెందుతున్నారు. పాలకవర్గం మాత్రం కార్మిక నాయకులతో చర్చలు కూడా జరపకపోవడంతో చెత్త తొలగించే నాథుడు కరువయ్యారు. దీంతో వీధులన్నీ చెత్తతో నిండిపోయి..దుర్గంధం వెదజల్లుతున్నాయి. చిన్నపాటి చినుకులకు చెత్త కుళ్లి వెదజల్లే దుర్గంధానికి స్థానిక నివాసితులు బతకలేని పరిస్థితి నెలకొంది. ఎండలకు వీచే గాలికి వీధుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలు గాలికి ఎగిరి ఇళ్లల్లోకి చేరుతున్న దుర్భర స్థితి. మంత్రి నారాయణ, మేయర్‌ అజీజ్‌లు కారుల్లో నగర రోడ్లపై షికారు చేసి వెళ్లిపోతున్నారని, నేల మీద నడిస్తే, పరిస్థితులను పరిశీలిస్తే తమ బాధ ఏంటో అర్థమవుతుందని నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top